భీష్ముడు చెప్పిన గంగామహత్యం - పుష్కర ఘాట్లు
భీష్ముడు చెప్పిన గంగామహత్యం - పుష్కర ఘాట్లు
- లక్ష్మి రమణ
భారతీయుల జీవితాలు గంగతోనే ముడిపడ్డాయి. పుట్టినప్పటినుండీ, జీవుడు భగవంతునిలో లీనమయ్యే దాకా గంగతోటిదే ఆధ్యాత్మిక తాదాత్మ్యత భారతీయులకి . బిడ్డ పుట్టగానే గొంతులో ఓ చుక్క గంగ తీర్థం పోయడం కొన్ని ప్రాంతాలలో ఆచారం. చివరికి ఆ గంగా తీరంలోనే చనిపోవాలని కోరుకునేవారు ఎందరో ఉండగా, కనీసం ఆస్తికలనైనా గంగలో కలపమని చివరి కోరికగా వారసులని కోరేవారు మరెందరో . కనుక జననం మరణం కూడా గంగతోటే ముడిపడ్డాయి మనకు . అటువంటి గంగమ్మ పుష్కర శోభతో కొత్త కళని సంతరించున్న వేళ, ఒక్కసారి ఆ పుష్కరాల ఘాట్లని గురించిన వివరాలని తెలుసుకుందాం .
గంగానది స్పర్శ మాత్రం చేత సకల పాపాలు హరించుకు పోతాయని పురాణాలు ఉద్ఘాటిస్తున్నాయి . సగరులందరూ గంగమ్మ స్పర్శతోటి పుణ్యలోకాలు పొందాలని కదా భగీరథుడు అంతటి ప్రయత్నం చేసిరి సురగంగని భువి మీదకి తీసుకొచ్చాడు . అందుకే పితృదేవతలు పైలోకాలలో నుంచి చూస్తూ ఉంటారట, మనం గంగలో ఎప్పుడు మొనకలేస్తామా అని. మనం గంగలో వేసే మునక వారికి పుణ్యలోకాలని కలుగజేస్తుంది .
జీవిత చరమాంకంలో మృత్యు ఘడియ దగ్గర పడుతున్నప్పుడు శ్వాస సహకరించుకున్న, గొంతు పెగలకున్న, మాట తడబడుతున్న ఎక్కడలేని శక్తిని కూడా తీసుకుని, గంగ పోయమని అభ్యర్థిస్తాడు జీవుడు. తులసి కలిసిన ఆ పవిత్ర తీర్థాన్ని సేవిస్తే నేరుగా పుణ్య లోకాలకు చేరుకుంటామన్న నమ్మకం మనది . అందుకు మహాభారతంలోని భీష్మ పితామహుని వృత్తాంతమే గొప్ప ఉదాహరణ . పైగా అంపశయ్య మీద నుంచి భీష్ముడు గంగ మహత్తును వివరిస్తారు. “ ఒక్క గంగా స్నానంతో యజ్ఞ యాగాదులు చేసినంత పుణ్యము, వ్రతాలు, పూజలు చేసినంత ఆధ్యాత్మిక సంపత్తి వనకూరుతుంది. గంగ శరీరానికి తగిలితే చాలు అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు పవిత్రమైపోతాయి . గంగ లేని దేశము సోమము లేని యజ్ఞము. చంద్రుడు లేని రాత్రి లాంటిది. పూలు పూయని చెట్టు లాంటిది. ఇన్ని మాటలు ఎందుకు, గంగ గొప్పదనాన్ని చెబుతూ పోతే సముద్రంలో నీటి కణాలను లెక్కపెట్టినట్టే” అంటారాయన.
గంగ మహత్యానికి కొన్ని శాస్త్రీయమైన కారణాలు ఉన్నాయి. ఆ నీటికి కఫాన్ని తగ్గించే గుణం ఉంది. అందుకేనేమో, తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న వారి గొంతులో చిటికెడు గంగ పోస్తారు. గంగా నదిలోని కొన్ని రకాల సూక్ష్మ క్రిములకు, వివిధ వ్యాధుల దుష్ప్రభావాన్ని తగ్గించే గుణం ఉందని పరిశోధనలు చెబుతున్నాయి. గంగోత్రి నుంచి బయలుదేరి ఎన్నో అరుదైన మొక్కలు వనమూలికలను తనలో కలుపుకుని ప్రవహించే గంగానదికి ఔషధీయ గుణాలు ఉన్నాయని ఆయుర్వేద నిపుణులు చెబుతారు. అన్నిటికీ మించి గంగ మీదున్న నమ్మకం అచంచలమైన భక్తి ఆ నీటికి అంత మహత్తునిచ్చింది.
ఇంతటి , అంతటి అని చెప్పలేనంత గొప్పది కాబట్టే గంగని పరమపావని అని ఒక్క మాటతో తేల్చేశారు ఋషులు. ఆ పావనిలో పుష్కరుడుండే 2023లోని ఈ ఏప్రియల్ 22 నుండీ మే 3 వరకూ పరమ పర్వదినాలుగా చెప్పుకోవాలి . ఈ రోజుల్లో గంగలో స్నానం చేసేవారి భాగ్యాన్ని మాటల్లో వర్ణించడం , అక్షరాలలో పొడగడం సాధ్యమయ్యే పని కాదు. ఆ గంగమ్మలో స్నానం చేయడానికి అనువైన తీర్థాలు ఎక్కడున్నాయో చూద్దాం .
గంగా పుష్కర ఘాట్లు :
పుష్కరాలు జరిగే ఈ పన్నెండురోజులూ గంగా నది తీర ప్రాంతాలైన గంగోత్రి, గంగాసాగర్, హరిద్వార్, బదిరీనాథ్, కేదారనాథ్, వారణాసి, అలహాబాద్, ప్రయాగ క్షేత్రాలు పుష్కరశోభను తరించుకుంటున్నాయి. దీనికి సంబంధించి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లూ చేస్తోంది . విశేషించి తెలుగువారు ఉత్తరాదిలో ఉన్న ఈ గంగాతీర క్షేత్రాలకి వెళ్లే ఏర్పాట్లని చేస్తోంది . విశాఖ పట్టణం నుండీ గంగా పుష్కరాల సందర్భంగా ఒక ప్రత్యేక రైలుని వారణాసికి ప్రారంభము చేశారు .
అవకాశం ఉన్నవారు బృహస్పతి గంగమ్మలో ఉన్న ఈ పన్నెండు రోజుల్లో చక్కగా గంగాస్నానం చేసి, గంగమ్మ ఒడ్డున ఉన్న కేత్రరాజా దర్శనం చేసి ఆ సర్వేశ్వరుని అనుగ్రహాన్ని పొందగలరని ఆశిస్తూ ..
శలవు. శుభం .