గంగావతరణం భగీరథుని వల్లే జరిగిందా !
గంగావతరణం భగీరథుని వల్లే జరిగిందా !
లక్ష్మీ రమణ
“గంగేచ యమునేచైవ గోదావరి సరస్వతీ..
నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం కురు..”
అని సాధారణ జలాలలోకి కూడా పవిత్ర నదులని ఆహ్వానిస్తాం. ఆయా తీర్థాలని జలాల్లోకి మంత్రయుక్తంగా ఆహ్వానించి పవిత్రం చేస్తాం . సాధారణంగా ఏ నీటిలో స్నానమాచరించినా ఈ శ్లోకంలో ఉన్న ఏడు నదుల పేర్లు స్మరించుకోవాలని మన పెద్దలు చెబుతారు. ఆ నదుల వరుసలో ప్రథమ తాంబూలం గంగానదికే. గంగానదే అంతటి పవిత్రమైనది అనుకుంటే, ఆ గంగానదికి పుష్కరాలు వస్తున్నాయి . పుష్కరుడు ప్రవేశించడం వలన గంగమ్మ మరింత సౌభాగ్యదాయనిగా, వేయిరెట్లు ప్రభావవంతమై , ప్రకాశిస్తోంది. ఈ సందర్భంగా ఆ గంగమ్మని మనసారా తలచుకుందాం .
గంగ, భారతదేశంలో అతి పవిత్రమైన నది. రఘువంశ రాజు భగీరథుని అనేక ప్రయత్నాల వల్ల గంగమ్మ దివినుండి భువికి దిగివచ్చింది అనేది చాలా ప్రశస్తిని పొందిన కథ. పౌరాణికంగా కూడా ఎంతో సుప్రసిద్ధమైన గంగానది జననాదుల గురించి మహత్యాన్ని గురించి తెలుసుకుందాం .
బ్రహ్మకడిగిన పాదము :
గంగానది జననం వామనావతారంలో వామనుడు త్రివిక్రమనిగా మారి తన రెండవ అడుగుతో ఆకాశాన్ని ఆక్రమించాడు. ఆ సమయంలో బ్రహ్మ ఆ పాదపద్మానికి నమస్కరించాడు. తన కమండలంలో ఉన్న జలముతో ఉరుక్రముడైన వామనుని పాదాన్ని కడిగారు. ఆ జలమే మరింత పవిత్రమై ఆకాశ గంగ రూపంలో పరిణితి చెందింది. ఈ విధంగా విష్ణు పాదోద్భవి అయిన ఈ నది ఆకాశం నుంచి అవతరించి, ముల్లోకాలనీ పవిత్రం చేసింది . ఈ గాథ భాగవతంలోని ఎనిమిదవ స్కంధంలో చెప్పారు .
వామన పురాణం :
గంగావతరణకి సంబంధించి వామనావతారంతో సంబంధం ఉన్నదే, కానీ ఈ కథ వేరు. ఇది వామన పురాణంలో పేర్కొన్న గంగానది అవతరణ విశేషం. వామనవతార సమయంలో శ్రీమహావిష్ణువు తన రెండవ అడుగుతో ఆకాశాన్ని ఆక్రమించినప్పుడు ఆయన పాదాన్ని తాకిడికి బ్రహ్మాండ కహటానికి రంధ్రమై దాని నుండి బయటకు వచ్చిన జలధార విష్ణుపాదంపై నుంచి జాలువారి సురనదిగా, సురగంగగా మారింది అని గంగానది జననాన్ని గురించి తెలియజేసింది.
బ్రహ్మవైవర్తన పురాణం ప్రకారం :
గంగానది జననం గురించి తెలియజేసే వివిధ పురాణ గాథలు చాలానే ఉన్నాయి. గోకులంలో రాధాదేవి కార్తీక పౌర్ణమి రోజున ఒక ఉత్సవాన్ని చేసింది. దానికి సకల దేవతలు విచ్చేశారు. బ్రహ్మ ప్రేరేపించగా శివుడు గాన మాధుర్యాన్ని ఆలపించారు. బ్రహ్మ ప్రేరణ తోటి శివుడు అద్భుతమైన గానాన్ని చేశారు. ఆ గాన మాధుర్యం యెంత గొప్పదీ అంటే , స్వయంగా గోలోకంలోని కృష్ణుడు ఆ గాన మాధుర్యానికి ద్రవీభూతుడయ్యాడు. ఆ విధంగా ద్రవీభూతమైన శ్రీ కృష్ణుడే గంగగా మారింది. దానిని బ్రహ్మ తన కమండలంలోనూ, శివుడు తన శిరస్సున ధరించారు. అని బ్రహ్మవైవర్త పురాణంలో చెప్పారు .
ఇతర పురాణాల ప్రకారం :
శ్రీకృష్ణుని దేహం నుంచి గంగ జన్మించినట్టుగా, నారద పురాణము భాగవతము 5వ స్కందంలో కూడా చెప్పబడింది. ధ్రువ ఆధారమని పేరు గల పదం ఏదైతే ఉన్నదో దాని నుంచే త్రిపధగామిని అయిన గంగాదేవి ఉత్పన్నమైందని మార్కండేయ పురాణంలోని 53వ అధ్యాయం చెబుతోంది. ఆకాశంలో ఉన్న సముద్రం సోమాన్నవంగా రూపాంతరం చెందింది. అదే దేవతలకు అమృత జలాన్ని ప్రసాదిస్తుంది. దాని నుంచే గంగాదేవి జన్మించిందని లింగ పురాణం చెబుతోంది. ఇక బ్రహ్మాండ పురాణ కథనం ప్రకారం, అగస్యుడు సముద్ర జలాన్ని మొత్తాన్ని పానం చేయగా అవి మళ్లీ గంగానది జలాలతో నిండాయి. రామాయణంలో గంగాదేవిని హిమవంతుని పెద్ద కుమార్తెగా అభివర్ణించారు. ఆవిధంగా గంగమ్మ కేవలం శివుని భార్యగా మాత్రమే పార్వతీమాత సోదరికాదు , హిమవంతుని కూతురిగా కూడా ఆమె పార్వతీదేవికి సోదరిగా కనిపిస్తున్నారు . అలా జగన్మాతకి సోదరి అయినా పరమ పావని గంగమ్మ . ఇలా మరిన్ని విశేషాలు గంగమ్మ జననాన్ని గురించి మన పురాణ ఇతిహాసాల్లో కనిపిస్తున్నాయి .
అమ్మ అవతరణ గురించిన కథలు ఎలా ఉన్నా, గంగ తిపధగామిని మాత్రమే కాదు, త్రిమూర్త్యాత్మక పరమపావని అనే విషయం ఇప్పటిదాకా చెప్పుకున్న కథల వల్ల అర్థం అవుతోంది . పుష్కర సమేతంగా ఉన్న ఇటువంటి గంగమ్మలో ఒక్క మునక వేసిన జన్మజన్మల పాపాలూ నిస్సందేహంగా హరించుకుపోతాయి . అటువంటి అవకాశము ఉన్నవారు ఈ పుణ్య సమయాన్ని వినియోగించుకొని తరించగలరని ఆశిస్తూ ..
సర్వేజనా సుఖినోభవంతు .
ఋషిపీఠం వారి ప్రచురణ ఆధారంగా కృతజ్ఞతలతో .