కుజగ్రహ దోష నివారణకు తేలికైన పరిహారమార్గాలు
కుజగ్రహ దోష నివారణకు తేలికైన పరిహారమార్గాలు ఏమిటి ?
- లక్ష్మి రమణ
మంగళవారానికి అధిపతి మంగళుడు లేదా అంగారకుడు. ఈయన్నే కుజుడు అనికూడా పిలుస్తారు . కుజదోషం జాతకంలో ఉన్నప్పుడు వారికి వివాహం కాకపోవడం, సంతానం కలగకపోవడం, వివాహ బంధంలో కలతలు రావడం, పితృదేవతల అనుగ్రహం లేకపోవడం వంటి బాధలు వెంటాడతాయి . ఈ కుజగ్రహ దోష పరిహారాన్ని పొందేందుకు అనువైన, తేలికైన పరిష్కారాలని తెలుసుకుందాం.
కుజు దశ ఏడు సంవత్సరాలు కనుక కుజుడికి అధిపతి అయిన కుమారస్వామి అష్టకం ఏడు సార్లు పారాయణం చేయాలి. ఈ పారాయణ ప్రతిరోజూ చేసుకోగలిగితే చాలా మంచిది . అలా కుదరకపోతే ప్రతి మంగళవారం చేసుకోగలగాలి. సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం చేయాలి. షష్ఠి తిథిలో, సుబ్రహ్మణ్య షష్ఠి పర్వదినాన , సుబ్రహ్మణ్య జననం జరిగిన కృత్తికా నక్షత్రం రోజున ఆ స్వామికి ఆవుపాలతో అభిషేకం చేయాలి.
మంగళుడుకు ఎర్రని రంగంటే ఇష్టం. అందువల్ల ఆయనకీ అధిపతి అయిన సుబ్రహ్మణ్యుణ్ణి ఎర్రని పుష్పాల మాలతో అర్చిస్తే, మంగళుడు సంతోషిస్తాడు. సుబ్రహ్మణ్య స్వామికి మంగళవారం నాడు ఉపవాసం ఉండి, కందిపప్పు, బెల్లంతో చేసిన పదార్ధాలను నైవేద్యం పెట్టాలి.
కార్యాలయాల్లో సుబ్రహ్మణ్య స్వామి పటం ఉంచి, ప్రతిరోజూ ధూప, దీప, నైవేద్యములు సమర్పించి కార్యక్రమాలు ప్రారంభించాలి.
సంతానం లేని దంపతులు ఏడు ఆదివారాలు కుమారస్వామి ఆలయానికి ప్రదక్షిణ చేయాలి. పన్నెండు మంగళవారాలు ఉపవాసం చేసినా , లేదా కోయని కూరలతో వంట చేసుకొని ఒక్కపొద్దు ఉండి సుబ్రహ్మణ్యుని నిష్ఠగా ఆరాధించినా సంతానం కలుగుతుంది .
మంగళవారాలు సుబ్రహ్మణ్య స్వామి ఆలయాలను దర్శించడం, ఎర్రని వస్త్రాలను, ఎర్రని పండ్లను సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో దానం చేయడం మంచి ఫలితాలని ఇస్తుంది.
స్త్రీలు ఎర్రని వస్త్రధారణ, పగడపు ఆభరణాలు అమ్మవారికి అలంకరించి, ఆ విధంగా అలంకరించిన దుర్గాదేవిని ఎర్రని పూలతో అర్చించాలి . కుంకుమపూజ చేయాలి. ఈ విధంగా దుర్గాస్తుతి చేసినా కుజుని అనుగ్రహం కలుగుతుంది. మంగళ వారాలు దుర్గాదేవి ఆలయదర్శనం చేసి ప్రదిక్షిణం చేసినా మంచి ఫలితం ఉంటుంది .
గణపతి స్తోత్రం చేయడం, అంగారకచతుర్థి నాడు గణపతిని అర్చించడం వలన మేలయిన ఫలితాలు కలుగుతాయి .
ఆంజనేయస్వామి దండకం చేసినా కూడా ఫలితం ఉంటుంది . స్తుతి చేయాలి. మంగళ వారాలాలలో సింధూరవర్ణ ఆంజనేయ స్వామి దర్శనం, ప్రదిక్షిణం, పూజ చేయాలి.
బలరామ ప్రతిష్ఠిత నాగావళీ నదీతీర పంచలింగాలను దర్శించుకోవచ్చు .
మంగళ వారం లేక కృత్తికా నక్షత్రం రోజున కుజుడికి శివాలయం లేక సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో ఏడు వేల కుజ జపం చేయించి ఎర్రని వస్త్రంలో కందిపప్పు మూట కట్టి దక్షిణ తాంబూలాదులతో బ్రాహ్మణులకు దానం ఇవ్వాలి.
ఏడు మంగళవారాలు కుజుడికి ఉపవాసం ఉండి కుజ శ్లోకం డెబ్భై మార్లు పారాయణం చేసి ఏడవ వారం కందులు దానం ఇవ్వాలి.
నానవేసిన కందులను బెల్లంతో కలిపి ఆవుకు తినిపించాలి.
కోతులకు తీపి పదార్ధములు పెట్టాలి, ఎర్రని కుక్కకు ఆహారం పెట్టాలి.
మంగళ వారం రాగిపళ్ళెంలో కందిపప్పు పోసి దక్షిణ తాంబూలాలతో యువకుడికి దానం ఇవ్వాలి.
#kujagrahadoshanivarana
Tags: Kuja, graha, dosha, nivarana,