శివానుగ్రహం కోసం ఈ నూనెతో దీపారాధన చేయాలి .
శివానుగ్రహం కోసం ఈ నూనెతో దీపారాధన చేయాలి .
- లక్ష్మి రమణ
శ్రద్ధగా శివాలయంలో దీపాలు వెలిగించి శివార్చన చేసేవారు, ఆ దీపాలు శివుడి దగ్గర ఎంతకాలం వెలుగుతాయో అన్నియుగాలు స్వర్గ లోకంలో నివసిస్తాడు. ప్రత్యేకించి కార్తీకమాసంలో చేసే శివాలయ దీపారాధన అనంతకోటి జన్మల పుణ్యాన్ని అనుగ్రహిస్తుంది. శివాలయంలో, శివసాన్నిధ్యంలో ఏ నూనెతో దీపాలు పెడితే మంచిది అనే విషయాన్ని స్కాందపురాణం వివరిస్తుంది . సాధారణముగా దీపారాధనకు వినియోగించే నువ్వుల నూనె, ఆవునెయ్యి కాకుండా మరిన్ని తైలాలని ప్రత్యేకించి శివారాధనకి విశిష్టంగా శృతి విశేషం పేర్కొంటోంది . ఆ వివరాలు ఇక్కడ మీ కోసం .
కౌసుంభ తైలంగా పిలిచే కుసుమ నూనెతో దీపాలు వెలిగిస్తే శివలోకం ప్రాప్తిస్తుంది. అతిశి తైలము అంటే నల్ల అవిస తైలంతో దీపాలు వెలిగించిన వారికి శివానుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది. నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే తన వంశంలో 100 తరాల వారు తరిస్తారు. ఆవు నేతితో దీపారాధన చేసిన వారు భోగభాగ్యాలను పొంది తమ పూర్వీకులు అందరినీ తరింప చేస్తారు .
ఇక కార్తీకమాసంలో దీపాలను దానం చేస్తే అఖండమైన పుణ్యఫలం ప్రాప్తిస్తుంది. కర్పూరము అగరు ధూపాలు సమర్పించి శివారాధన చేసేవారు ప్రతిరోజు హారతి కర్పూరాన్ని వెలిగించి శివుడికి సమర్పించేవారు నిస్సందేహంగా శివసాయిద్యాన్ని పొందుతారు. రోజుకి ఒకటి లేక రెండు మూడు సార్లు శివారాధన క్రమం తప్పకుండా చేసే వ్యక్తి సాక్షాత్తు రుద్రుడే అవుతాడు . శివ పూజ చేస్తూ భస్మము రుద్రాక్షలు ధరించిన వారికి అక్షయ ఫలం లభిస్తుంది అని స్కాంద పురాణమ్ చెబుతోంది .
కాబట్టి అటువంటి దీపారాధనని, పూజా విధిని ఆ పరమేశ్వరునికి అర్పించి ఆయన అనుగ్రహాన్ని పొందుదాం . సర్వేజనా సుజనో భవంతు ! సర్వే సుజనా సుఖినోభవంతు !! శుభం !!