పంచభక్ష్య పరమాన్నాలతో భోజనం వడ్డిస్తే , వద్దనేవారెవరు ?
పంచభక్ష్య పరమాన్నాలతో భోజనం వడ్డిస్తే , వద్దనేవారెవరు ?
-లక్ష్మీ రమణ
పంచభక్ష్యాలు పరమాన్నంతో కలిపి తింటే, షడ్రసోపేతమైన భోజనం చేసినట్టే. ఆయుర్వేద నిపుణులు ఈ పదార్థాలని కలిపి తినడంవల్ల వ్యాధుల బారిన పడతారు అంటూ వైద్యపరమైన విశ్లేషణ చేస్తున్నారు . వాటిని ఆరగించే విధానాన్ని తెలియజేస్తున్నారు . అయినప్పటికీ వాటిని తెలుసుకోవడం సంప్రదాయం అనేది ఒక ప్రయోజనమైతే , జిహ్వ చాపల్య శాంతి మరోప్రయోజనం .
పంచభక్యాలగురించి తెలుసుకునేముందు అసలు భక్ష్యం అంటే ఏంటనేదానిగురించి కాస్త వివరంగా మాట్లాడుకోవలసిన అవసరం ఉంది .
భక్ష్యం అన్నా భోజ్యం అన్నా “తినదగినది” [”ఎడిబుల్”] అనే నిఘంటుకారుడు చెప్పేడు. కానీ ఈ రెండింటి మధ్య తేడా చాలా స్వల్పంగా వుంటుంది.
భుక్ అనే నామధాతువు భక్ష్యము (తినుబండారము) , భక్షణ (తినడము) ఈరెంటికీ మూలం. పుట్టుకలో తేడాలేదుగాని ప్రాకృత కాలం నాటికే అర్థంలో ఈబేధం ఉంది. భక్షణ అనే క్రియకు తినడమనే అర్థం. నిఘంటుకారులు కూడా భక్ష్యము అంటే తినుబండారము అని, దానికి వికృతి అయిన భక్తము అంటే అన్నము అని,విభాగించి అర్థాన్ని చెప్పారు. వికృతిలో ఇది అన్నమే. ఈ వ్యవహారమే భక్షానికి,ఇక భక్ష్యానికి తినిబండారమనే వ్యాప్తి కలిగేందుకు కారణమయ్యింది. (చూ.గాథా సప్తశ్తిలో తెలుగు పదాలు.డా.తిరుమల రామచంద్ర& దేశీ నామమాల) పదార్థాల ద్వారా చేసేవి మాత్రమే వాటి ఆకారంలో అవి ఉంటాయి. ముద్దగా చేసి చేసేవన్ని గుండ్రగా(గొళంలాకాదు)చేయటమే.
పంచభక్ష్యములు అంటే:
పంచభక్ష్యాలు భక్ష్యం, భోజ్యం, లేహ్యం, చోష్యం, పానీయం. మరింత వివరంగా చెప్పుకుందాం .
భక్ష్యం -అంటే కొరికి తినేది(గారె, అప్పము వంటివి). ఇంకా భక్షం అంటే గుండ్రనిది అనే అర్థం కూడా ఉంది. ఇంట్లొ సాధారణముగా తినే రొట్టెలు మొదలైనవి. మనం తినే ఒక తీపి పదార్థాలలో ఒకదాన్ని భక్షం అని అనటం అర్థ విపరిణామం
భోజ్యం -అంటే కొరకకుండా నమలి మింగేది (పులిహోర, దధ్యోదనం వంటివి)అని అర్ధం చేసుకోవచ్చు.
లేహ్యం -అంటే నాకి(lick) భుజింపఁదగిన వ్యంజనవిశేషము. వ్యంజనం అంటే నంచుకు తినేది అని అర్థం చేసుకోవచ్చు. ఉదాహరణకి కల్కద్రవ్యములుచేర్చి ముద్దగా చేసిన మందులను సాధారణంగా ఆయుర్వేద దుకాణాలలో లభించే తేనె వంటి పదార్ధాలతో రంగలించి తీసుకుంటాం కదా . అటువంటి వాటిని లేహ్యాలుగానే పిలుస్తుంటాం. లేహ్యం వాడుతున్నాం అని వాడుకలో కూడా ఉపయోగిస్తుంటారు. తమిళంలో లేగియమ్ అని మరున్దు అని దీన్ని పిలుస్తారు. కన్నడంలో కూడా లేహ్యం అనే అంటారు నెక్కువ ఔషది అని మరో పేరు.
చోష్యం -అంటే పీల్చదగ్గది లేదా జుర్రుకోడానికి వీలైనది. పులుసు జుర్రుకొని తినమని అనడం వింటూంటాంకదా !
పానీయం అంటే- త్రాగదగినది అని అర్ధం . పానము నుంచి ఉత్పన్నమైన పదం ఇది. కన్నడం లో పానకవు అని తమిళంలో కుడినీర్ అని వాడతారు. పానకం వంటి పదార్థాలని భోజనానికి పూర్వం సేవించే అలవాటు మన పూర్వీకులకు ఉండేది .
ఆహారాన్ని తిన్నామా కడుపునింపుకున్నామా అన్న పద్దతిలో కాకుండా వండటం నుంచి వడ్డించటం వరకూ మన పెద్దలు కొన్ని శాస్త్రీయ ప్రాతిపదికలను ఏర్పరచారు. కుంతకాలు, రదనికలూ, అగ్రచర్వణకాలు, చర్వణకాలు అనే నాలుగు రకాల దంతాలతో మిశ్రమ ఆహారాన్ని తీసుకోగలిగేందుకు అనుకూలమైన దంతవిన్యాసమూ, నోటి కుహరపు అమరిక కలిగివున్న మానవునికి శక్తినిచ్చేందుకు మాత్రమే కాకుండా రుచికూడా కలిసి తృప్తిని అందిచాలనేది వారి ప్రయత్నం . ఆయుర్వేదశాస్త్రాన్ని మేళవించి కలగలపిన ఆహార దినుసులతో, తెలియకుండానే ఆరోగ్య సంరక్షణ చేసుకునేలా ఆహార చట్రాన్ని రూపోందించారు. ఉదాహరణకి మన పదార్థాలలో తిరగమోత (పోపు) వెయ్యడం తప్పనిసరి . వీటిలో వాడే ఆవాలు, స్త్రీలలో ఋతుసంబంధమైన బాధలని తగ్గించి ఆహారం త్వరగా జీర్ణమయ్యేలా చేస్తాయి. ఇక జీలకర్ర గ్యాస్ సమస్యని తగ్గించడంలో సిద్ధహస్తురాలు . పసుపు, ఇంగువ లేదా వెల్లుల్లి ల గొప్పదనాన్ని యెంత వర్ణించినా తక్కువేకదా ! ఇటువంటి విశేషాలను లోతుగా పరిశీలించినపుడు కొంత ఆశ్చర్యం కలగక మానదు.
అంతే కాదు, ఏ పదార్ధాన్ని ఎటువంటి పాత్రల్లోలేదా పద్దతిలో వడ్డించాలి, తినే వారి చేతికి ఏ దిశగా వడ్డించాలి, ఎంత మేర వడ్డించాలి. తినే పద్దార్దాన్ని బట్టి వాటి క్రమం ఎలా వుండాలి, లాంటి నియమాల వెనుక ఏదో ఒకరకంగా ఏర్పడటం కాక తార్కికమైన, అర్ధవంతమైన క్రమం వుండటం గొప్పవిషయం.
పంచభక్ష్య పరమాన్నాలని నివేదించాలి అని చెప్పుకునే ముందర , వాటి గురించిన అవగాహన ఉండాలి కదా ! మరి పంచ భక్షాలతొ పాటు పరమాన్నం కలిస్తేనే షడ్రుచులు. పూర్వంలో పరమాన్నం ,పులగం దైవ సంబంధమైన కార్యక్రమాలకు మాత్రమే చేసేవారు.అలా చేసింది నలుగురుకీ పంచాలన్నదికూడా నిబంధనే.అందుకే రామయణంలో భరతుడు రాముడితో ఇలా అంటాడు."పాయసం కుసరం ఛాగం యథాన్యస్సంప్రయఛ్చతి"(పర్వ దినాల్లో పాయసం,పులగం వండి ఇతరులకు ఇవ్వనివడెవడైనా ఉంటె వాడికి తగిలేపాపం నేనీ రాజ్యాన్ని కొరుకుంటే నాకు తగులు తుంది)అని. కాబట్టి ఇంకెందుకాలశ్యం ఈ పదార్థాలన్నీ చేసుకొని పండుగల్లో ఒక పట్టు పట్టేయండి . మీతోపాటు , పదిమందికి పంచిపెట్టండి .