దేవుడి భోజనం - మనమూ తిందామా ?
దేవుడి భోజనం - మనమూ తిందామా ?
-లక్ష్మీ రమణ
ఈ రోజు లంచ్ లోకి ఏం చేద్దాం ? పోనీ, పిజ్జా ఆర్డర్ చేసేసుకుందామా ? దానికంటే, బర్గర్ అయితే బెస్ట్ . దాంతోపాటు కోక్ , ప్రెంచ్ ప్రైస్ చెప్పేద్దాం . అద్దిరిపోయే కాంబినేషన్ . ఇలా ఉంటాయి మన వాళ్ళ భోజనం ముచ్చట్లు . రోజూ ఆఫీసుల్లో , ఆపీసులు దూరిపోయిన ఇళ్లల్లో , పనిలో కూరుకుపోయి తీరికలేని ఇల్లాళ్ళున్న ఇళ్ళల్లో ఇదే కదా ముచ్చట . వీటికే మీకు నోరూరితే, ఇక, ఈ దేవుడి భోజనాన్ని గురించి విన్నారంటే, ఏమై పోతారో !!
ఇందిర వడ్డించ నింపుగను/ చిందక యిట్లే భుజించవో స్వామి
అక్కాళపాశాలు అప్పాలు వడలు/ పెక్కైన సయిదంపు పేణులును
సక్కెర రాసులు సద్యోఘృతములు/ కిక్కిరియ నారగించవో స్వామి
మీరిన కెళంగు మిరియపు దాళింపు/ గూరలు కమ్మనికూరలును
సారంపుబచ్చళ్ళు చవులుగ నిట్టే/కూరిమితో జేకొనవో స్వామీ
పిండివంటలును పెరుగులు/మెండైన పాశాలు మెచ్చి మెచ్చి
కొండలపొడవు కోరి దివ్యాన్నాలు/వెండియు మెచ్చవే వేంకటస్వామీ"
అంటూ ఇంపైన కీర్తనలో , కమ్మనైన వంటకాల్ని సొంపుగా చెబుతారు అన్నమయ్య . ఇవన్నీ , వేంకటేశ్వరుడి దివ్యాన్నాల వివరాలు . వీటిని లక్ష్మీదేవి ఇంపుగా వడ్డించి తినిపిస్తోందట. వాటిని ఒక్క మెతుక్కూడా వదలకుండా భుజించవయ్యా అని ఆయన అన్నారు సరే కానీ, ఈ వంటకాల పేర్లయినా మనం విన్నామా అని . అప్పుడెప్పుడో తిరుమల వెళ్ళినప్పుడు , అక్కడి బోర్డులపైనా చదివిన జ్ఞానం కాకుండా, నాలుకకి తెలిసిన జ్ఞానం ఏదైనా ఉన్నదా అని ?
ఒకసారి ఈ వంటకాలను పరిశీలించాల్సిన అవసరమే కనిపిస్తోంది .
అక్కాళ పాశాలు, అప్పాలు,వడలు: అక్కుళ్లు అనే బియ్యంతో చేసిన నేతి పాయసాలు, బూరెలు, గారెలు
పెక్కైన సయిదంపు పేణులు: అనేక రకాల గోధుమ సేమ్యా వంటకాలు
చక్కెర రాసులు, సద్యోఘృతములు: పంచదారతో చేసిన తాజా నేతి వంటకాలు
మీరిన కెళంగు మిరియపు దాళింపు గూరలు: మిరియాల పొడి చల్లి వండిన తాళింపు కూరలు
కమ్మని కూరలును సారంపుబచ్చళ్ళు: కమ్మని కూరలు, చక్కని సుగంధ ద్రవ్యాలు వేసి చేసిన పచ్చళ్ళు
చవులుగ నిట్టే కూరిమితో జేకొనవో స్వామీ: ఇట్టే నోరూరే ఈ రుచుల్ని ఇష్టంగా తినవయ్యా స్వామీ
పిండివంటలును పెరుగులు: ఇంకా అనేక పిండివంటలు, పెరుగుతో చేసిన వంటకాలు
కిక్కిరియ నారగించవో స్వామి: దగ్గరగా పెట్టుకుని ఆరగించవయ్యా స్వామీ!
మనం దేవుడికి నివేదించాము అంటే, అవి శ్రేష్టమైనవి అని కదా అర్థం. బూరెలు గారెలు, నేతి స్వీట్లు, తాలింపు కూరలు, సుగంధ భరితమైన వంటకాలు, పచ్చళ్ళు, పెరుగు, పాలవంటకాలూ వీటిలో ఉన్నాయి.
ఇవే గదా ఇప్పుడు మనం తింటున్నవీ! అని అడగొచ్చు . కానీ, ఇప్పటికీ అప్పటికీ చాలా తేడా ఉంది! చింతపండు రసం కలిపినవీ, అల్లం-వెల్లుల్లి దట్టించిన మసాలా కూరలు, నూనె వరదలు కట్టేలా వండిన వేపుడుకూరలు, ఎర్రగా మంటెత్తే ఊరగాయలూ ఇంకా అనేక భయంకర వంటకాలేవీ ఈ పట్టికలో లేకపోవటం గమనార్హం.
అన్నమయ్య తరువాత గడిచిన సుమారు 500 యేళ్ళలో చింతపండు, మిరప కారం, నూనెలో దేవిన కూరలు, ఇవి ఆరోగ్యానికి చేస్తున్న హాని - అనుభవంతోనే ఉన్నప్పుడు వివరణలు దండగేకదా! ఎటువంటి యాంటీ బయటిక్సు లేకుండానే మన పూర్వులు జీవితాన్ని ఆరోగ్యంగా ఆనందించారంటే కారణం అర్ధం చేసుకోగలగాలి.
మనది ముప్పొద్దుల భోజన సంస్కృతి. ఉదయాన్నే పెరుగు/చల్లన్నం తినటం మన ఆచారం. అది ఇప్పుడు నామోషీ అయ్యింది. దాని స్థానంలో ఇడ్లీ, అట్టు, పూరీ బజ్జీ, పునుగులు తినటం నాగరికం అయ్యింది. అన్నమయ్య కాలానికి మిరప కాయలు మనకింకా పరిచయం కాలేదు. ఇప్పటి ఆవకాయ లాంటి ఊరగాయలు అప్పటి ప్రజలకు తెలీవు. వాళ్లకు తెలిసిన ఊరగాయల్లో మిరపకారం ఉండదు. అల్లం, శొంఠి, మిరియాలనే కారపు రుచికి వాడుకునే వాళ్ళు. అదే వాళ్ళ ఆరోగ్య రహస్యం.
నల్లబంగారమని మన మిరియాలని తెల్లవాళ్లు ఓడల్లో తరలించుకుపోయిన చరిత్రని మనం ఇక్కడ గుర్తు తెచ్చుకోక తప్పదు . వాళ్ళు ఇప్పుడు స్టయిల్ గా కొంచెం పెప్పర్ పౌడర్ వెయ్యండి అంటే, మనం కూడా నాలుగు మిరియాలు వేసే ప్రయత్నం చేస్తాం. కానీ ఆ నాగరికత నిజానికి మనది . మన పూర్వీకులనుండీ మనకి వచ్చిన వారసత్వ సంస్కృతీ. ఆరోగ్య విధానము .
ఇదంతా ఒక పక్కన పెడితే, అసలు వేంకటేశుని ప్రసాదానికున్న రుచి ప్రపంచంలో ఏ వంటకానికి లేదని చెబితే, అది అతిశయోక్తికాదు . రుచిలోని ఆల్కెమీ తెలిసిన దేవుడాయన . అందుకే వంటకాల మీద పరసరించిన చూపు చాలేమో , వాటికి అటువంటి ఘనమైన రుచీ, వాసనా వచ్చేస్తాయి . మనం కూడా ఆ ఆరోగ్యకరమైన వంటల్ని తిరిగి గుర్తుచేసుకుందాం . స్వామీ కడుపారా ఆరగించే ఆ శ్రేష్ఠమైన వంటకాల్ని ఆరగించి ఆరోగ్యంగా ఉందాం .