హిందూత్వాన్ని గౌరవించేలా నిర్ణయం - అమెరికా ప్రభుత్వం
హిందూత్వాన్ని గౌరవించేలా సంచలన నిర్ణయం తీసుకున్న అమెరికా ప్రభుత్వం !
సనాతన ధర్మంలోని ఆచారాలు , సంప్రదాయాలు , విజ్ఞానం , ఆధ్యాత్మిక సంపద నేడు ప్రపంచదేశాలని విశేషంగా ఆకర్షిస్తోంది. వీటిని వేదయుక్తంగా పాటించడానికి వీరు ఆసక్తిని చూపిస్తున్నారు . అమెరికా, యూరోపియన్ దేశాలతో పాటు ఆసియా దేశాలు కూడా దైవత్వం నింపుకున్న మన దేశ సంగీతం, కళలు వైపు ద్రుష్టి సారిస్తున్నాయి . ఇక మన ఆహారపు అలవాట్లు ఆరోగ్యానికి మంచివని పాటించడం మొదలు పెట్టాయి కూడా. అవును భారత దేశం ఎందరో మహానుభావులు, వేదాలు, ఋషులు, పుణ్యపురుషులు కలగలిసి ఆధ్యాతికతతో విరాజిల్లుతోంది. ఇక భారతీయులు ఒక్క మనదేశంలోనే కాదు, ప్రపంచంలో అనేక దేశాల్లో నివసిస్తున్నారు. ఏ దేశంలో నివసిస్తున్న అక్కడ తమ సంప్రదాయాన్ని అనుసరిస్తూ పండగలు, పూజలు ఫంక్షన్లను జరుపుకుంటూ, హిందూ సంస్కృతీ సాంప్రదాయాలను తమ పిల్లలకు, భవిష్యత్తు తరాలకు అందించేలా ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు.
ఇది స్థానికులైన విదేశీయులను విశేషంగా ఆకర్షిస్తోంది . హిందూత్వాన్ని అనుసరిస్తూ మనదేశంలోని అనేక పుణ్యక్షేత్రాలను దర్శించేందుకు వచ్చే విదేశీ యాత్రీకులు ఏటేటా పెరుగుతూ రావడమే ఇందుకు నిదర్శనం . వీరిలో చాలా మంది , తమ దేశాలలో కూడా భారతీయ కట్టూ , బొట్టూ ధరించి , సంప్రదాయాలని పాటించడం, ఎంతో ఇష్టంగా పవిత్రంగా మన ధర్మాన్ని ఆచరిస్తూ, ఉండడం సోషల్ మీడియా పుణ్యమా అని చూస్తూనే ఉన్నాం కదా !
అయితే తాజాగా అమెరికా ప్రభుత్వం హిందూత్వాన్ని గౌరవించేలా ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. అమెరికాలోని టెక్సాస్, ఫ్లోరిడా, న్యూజెర్సీ, ఒహాయో సహా పలు రాష్ట్రాలకు చెందిన గవర్నర్ కార్యాలయాలు ఈ మేరకు కీలక ప్రకటన చేసాయి. అమెరికా లో హిందూ మతం, చరిత్ర అమెరికా అభ్యున్నతికి ఎంతో దోహదం చేశాయని చెబుతూ , అమెరికాలోని ఆయా రాష్ట్రాలకు విశ్వ హిందూ పరిషత్ కృతజ్ఞతలు తెలిపింది. అంతేకాదు మొత్తం అమెరికా ఫెడరల్ ప్రభుత్వం కూడా అక్టోబర్ నెలని హిందూ మాసంగా గుర్తించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంగా అమెరికాలో లక్షలాది మంది హిందువులు ఉన్నారని, ప్రతీ ఒక్కరూ హిందుత్వాన్ని ప్రతీ ఒక్కరికి తెలియజేసేలా ప్రయత్నించాలని విశ్వహిందూ పరిషత్ కోరింది . అంతేకాదు ఒక్క అమెరికాలో మాత్రమే కాకుండా యావత్ ప్రపంచం హిందుత్వ గొప్పదనాన్ని గుర్తించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలనీ పిలుపునిచ్చింది . అక్టోబర్‌లో జరిగే ఈ నెలరోజుల వేడుకల కోసం హిందువులు రెడీ అవుతున్నారు. తమ కళలు, నృత్యం, సంగీతం, యోగా, ధ్యానం, బుద్ధి, ఆయుర్వేదం వంటి వాటిల్లో తమ నైపుణ్యాన్ని ప్రదర్శించడానికి రెడీ అవుతున్నారు.
- లక్ష్మి రమణ