జీవితమున సగభాగం నిద్దురకు , విశ్రాంతికే కేటాయించాల్సిన అవసరం ఎంతైనా ఉంది
జీవితమున సగభాగం నిద్దురకే సరిపోవు ... అని సినీకవి చెప్పిన మాట గతంలో ఓకే కానీ, ప్రస్తుత బిజీ లైఫ్‌కు వర్తించదనేది కాదనలేని వాస్తవం... హడావుడి జీవితం, పోటీ ప్రపంచంలో మనుగడ సాధించేందుకు ప్రతి ఒక్కరూ రేయింబవళ్లు కష్టపడాల్సిందే! గతంలో కాయకష్టం చేసిన శరీరాలను నిద్ర తల్లి వెంటనే జోకొట్టేది, కానీ ప్రస్తుత లైఫ్‌స్టైల్‌లో శారీరక కష్టం చాలా తక్కువైంది... టెక్నాలజీ కారణంగా శరీరాలు సుఖమరిగాయి... దీంతో నిద్ర సరిగా రాకపోవడం, నిద్రలేమి సమస్యలు తలెత్తుతున్నాయి... కారణాలేవైనా, ఎక్కువ కాలం నిద్రలేమితో బాధపడేవారికి వివిధ రకాల అనారోగ్య సమస్యలు ఎదురవుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు... సాధారణంగా ప్రతి వ్యక్తికి 8 గంటల కనీస నిద్ర అవసరం. చిన్నపిల్లలు, యువతకు 10 గంటల నిద్ర తప్పనిసరి. పైగా కరోనా లాంటి వైరస్ ల బారిన పడకుండా కాపాడుకోవడానికి బలవర్థక ఆహారం ఎంతముఖ్యమో, కంటినిండా నిద్ర పోవడం కూడా అంతే ముఖ్యమని సూచిస్తున్నారు...
పెద్దవారిలో నిద్రలేమితో జ్ఞాపక శక్తి క్షీణిస్తుంది. నిద్రపోతున్న సమయంలో జ్ఞాపకాలను నిల్వచేసే ముఖ్యమైన మెదడు తరంగాలు ఉత్పత్తి అవుతాయి. ఇవి మెదడులోని హిప్పోకాంపస్ అనే భాగం నుంచి ప్రిఫ్రంటల్ కార్టెక్స్‌కు దీర్ఘకాలిక జ్ఞాపకాలను బదిలీ చేస్తాయి. నిద్రలేమితో ఈ మొత్తం ప్రక్రియకు ఆటంకం ఏర్పడుతుంది. సరిగా నిద్రలేకపోతే ఆకలి పెరిగి ఊబకాయానికి దారి తీస్తుంది. మనిషి ఆలోచనలు, కొత్త విషయాలు నేర్చుకునే సామర్థ్యంపై నిద్రలేమి తీవ్ర ప్రభావం చూపుతుంది. సరిపడినంత నిద్రలేకపోవడం వలన ఏ విషయంపైనా శ్రద్ధ పెట్టలేకపోవడం, చురుకుదనం తగ్గడం, ఏకాగ్రత లోపించడం వంటి సమస్యలు ఎదురవుతాయి.
నిద్రలేమి సమస్య దీర్ఘకాలం కొనసాగితే నిరాశ, నిస్పృహ, ఆందోళన చుట్టుముడుతుంటాయి. ఫలితంగా శరీరంలో కార్టిసోల్ అనే స్ట్రెస్ హార్మోన్ అధిక మోతాదులో విడుదల అవుతుంది. ఇది చర్మసంరక్షణకు తోడ్పడే కొల్లాజెన్‌ను విచ్ఛిన్నం చేసి చర్మ సౌందర్యాన్ని కోల్పోయేలా చేస్తుంది. కేవలం శారీరక సమస్యలే కాకుండా పలు రకాల మానసిక సమస్యలు కూడా నిద్రలేమితో ఉత్పన్నమవుతాయి. శరీరానికి సరైన నిద్ర ఉంటే అది వివిధ జీవక్రియలను సమన్వయపరుస్తుంది, మంచి నిద్రలేకపోతే జీవక్రియలలో మార్పులు సంభవిస్తాయి, దీంతో వైరస్‌ల బారిన పడే అవకాశం పెరుగుతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు..