Online Puja Services

క్రొత్త శరీరములు మార్చే యోగి *స్వామి జ్ఞానానంద గిరి మహారాజ్*

18.116.43.109

క్రొత్త శరీరములు మార్చే యోగి
*స్వామి జ్ఞానానంద గిరి మహారాజ్*

 

నేను హిమాలయాలను తిలకిస్తూ, తిరుగుతున్నాను. అమర్ నాథ్ దారిలో, చందన్ వాడి నుండి లోపలికి 50 కిలోమీటర్ల దూరంలో మంచు గుహలోని ఒక యోగి గురించి ఒక సాధువు చెప్పారు, వారిని వెతుకుతూ వారి దర్శనార్థం వెళుతున్నాను. అమర గంగా జలపాతం , మంచుపర్వతాలు, మహావృక్షాలు, కొండల నుండి జాలువారే జలపాతాలు..... మహా ఆహ్లాదంగా ఉంది ప్రకృతి. ఒక మంచు కొండకు ఒక గుహా సొరంగం ఉంది. గుహలోకి ధైర్యం చేసి వెళ్లాను. పెద్ద జడలతో, భారీ శరీరముతో ఒక వృద్ధుడైన యోగి ధ్యాన ముద్రలో ఉన్నారు. వారికి ప్రణమిల్లి ధ్యానంలో రెండు రోజులు అలాగే కూర్చున్నాను. ఆ యోగి లేచి నన్ను చూశారు. ఏమనలేదు. ఎప్పటికి లేవనందున తట్టిలేపాను. ఎవరు? ఎందుకొచ్చావ్ ? అని అరిచారు.

సాష్టాంగ ప్రణామం చేసి బాబా, తమరి దర్శనానికి వచ్చాను. తమరు ధ్యానంలో ఉన్నందున, ధ్యాన భంగం చేయడం ఇష్టం లేక, నేను ధ్యానంలో కూర్చున్నాను.... అన్నాను.

నీకేమి కావాలి? అన్నారు బాబా.....మీ గురించి తెలుసుకోవాలి, అన్నాను నేను.
ప్రశ్న :- తమరి పేరు?
జ :- ఏ శరీరంలోని పేరు ?
ప్రశ్న :- అదేంటి, బాబా ఈ శరీరములో ఉన్నారు, కాబట్టి ఈ పేరే చెప్పండి....
జ :- నాయన నాకు 100 సం||లు నిండాయంటే ఒక శరీరం మారుస్తా..... ఇది మూడో శరీరం. 100 నిండింది 4వ శరీరం కోసం వెతుకుతున్నాను, అన్నారు.
ప్రశ్న :- అదేంటి బాబా, మీరు విచిత్రంగా మాట్లాడుతున్నారు. మరణం అనేది లేదా?
జ :- ఉంది. కాని యోగికి ఇచ్చామరణం. తనకు ఇష్టమొచ్చినప్పుడు దేహం విడిచే అర్హత యోగి సంపాదిస్తాడు. తన తీవ్ర సాధనల ద్వారా.....
ప్రశ్న :- మీరు మార్చబోయే శరీరం ఎక్కడుంది?
జ :- పహల్గామ్ లో....ఈ రోజు నుండి 4 రోజులకు 20 సంవత్సరాల యువకుడు మరణిస్తాడు. వాడిని ఊరుబయట పూడుస్తారు, నీవు వెళ్ళి మట్టి తీసి, వాడిని తీసి, పైకి లేపు. ఆ శరీరంలోకి నేను ప్రవేశిస్తాను.

ప్రశ్న :- ఊరు వాళ్లు నన్ను దండిస్తే...... అన్నాను?
జ :- నేనిచ్చే విభూతి చుట్టూ.... చల్లుకో! నీవు ఉన్న చాలా దూరం చీకటైపోవును. అర్ధరాత్రి ఆ శవంపై మట్టితీసి ఉంచు నీవెవరికి కనిపించవు.
ప్ర :- బాబా ఇంత శ్రమదేనికి కొత్త శరీరం ధరించొచ్చుగదా?
జ :- కొత్త శరీరం ధరిస్తే 9 నెలలు గర్భనరకం, పుట్టాక అజ్ఞాన దశలో 12 సంIIలు బాధలు, చదువు - విద్య ,మళ్ళీ తపస్సు పెద్ద తతంగం, ఎంచక్కా దేహం మార్చితే పూర్వజ్ఞానమంతా నా వెంటనే ఉండును. అందుకే ఇలా చేస్తున్నాను.
(ఈ వాదం నిరాక్షేపణీయమైనది. కానీ తీవ్ర సాధన చేయాలి.)

ప్రశ్న :- మిమ్ములను గుర్తించేదెలా?
జ :- ఆ యువకుడి శరీరంలోకి ప్రవేశించినా, నా పూర్వజ్ఞానం నా దగ్గరే ఉండును. నా కంఠం మారదు. నా విద్య, నా వద్దనే ఉండును. నీవు నా వద్దకు ఏ సందేహాలు తీర్చుకోవాలని వచ్చావో అన్నిటికీ, జవాబిచ్చెదను.
ప్రశ్న :- బాబా తమరి పేరు?
జ :- మంచు గుహలో ఉన్నందున, నన్ను "బరఫ్ బాబా" అంటారు.
నేను వచ్చి ఊరి బయట ఉన్న స్మశానంలో కొత్తగా పూడ్చి పెట్టిన శవంపై మట్టి తొలగించి ఎదురు చూస్తున్నా.... బాబా పై పూర్తి విశ్వాసం ఉంది ! చుట్టూ విభూతి చల్లడంతో చీకటిగా ఉంది. అందులో అది అర్ధరాత్రి. 5 నిముషములలో శవంలోకి ఏదో వెలుగు ప్రవేశించినట్టు అయింది. కొన్ని క్షణాల్లో నిద్రలో నుండి లేచినట్టు, ఆ యువకుడు లేచి ఉన్నాడు. నాయనా! మంచిపని చేశావు. వెంటనే ఇక్కడి నుండి వెళ్ళి పోవాలి. లేదంటే, నా శరీరమును చూసి దయ్యం అనుకుంటారు. లేదా గుర్తించి మావాడు, అని ఇంటికి తీసుకెళతారు అని ఆ మహాత్ముడు తెలిపెను.
బరఫ్ బాబా మరియూ నేను, ఆ ప్రాంతం వదిలి కాశ్మీర్ లోని ఒక లోయలో గుహలో వచ్చి ఉన్నాము.
ప్రశ్న :- బాబా ఇలా శరీరాలు మార్చే విద్య మీకెలా వచ్చింది ? దయచేసి చెప్పండి. అని అడిగాను.
జ :- నాయనా! నా నాలుగో శరీరం పేరు, ధుని బాబా. నేను నాథ సాంప్రదాయ సాధువును. ఎప్పుడూ , ధుని వెలిగించు కోవడంతో ఆ పేరు పిలిచేవారు. కర్ణ ప్రయాగ నుంచి 50 కిలో మీటర్ల లోపల లోయలో పర్వత గుహలో ఉండేవాడిని. మా గురువు యోగ
విద్యలో ప్రవీణుడిని చేశారు. నలబై సంవత్సరాలు కఠోర తపమాచరించాను. నేను నా శరీరాన్ని, ఈగలు దోమలుగా మార్చే శక్తిని కూడా పొందాను. విదేశాలు చూడాలని కోరిక కలిగింది. విమానం ఎక్కేవానిపై ఈగనై వాలి అలా విదేశాలు కొన్ని చూశాను. మళ్లీ తిరిగి వచ్చి 20 సంవత్సరాలు తపస్సు చేసి ఆకాశంలో ప్రయాణించే సిద్ది పొందాను. (ఆకాశ గమన విద్య) ఆకాశగమన విద్య సహాయంతో.... చాలా దేశాలు తిరిగాను. నేను రహస్యంగా హిమాలయాల్లో తపోజీవనానికే, అలవాటు పడినాను. నాకు బయటి ప్రాపంచికులంటే, ప్రదేశాలంటే ఇష్టం ఉండేది కాదు. 100 సం||రాలు నిండాక ......
బద్రినాథ్ యాత్రకొచ్చే ఒక యాత్రికుల గుంపులో 15 సంవత్సరాల బాలుడు చనిపోతే, ఆనాడు ప్రయాణ వసతులు లేనందున, అతన్ని అక్కడే పూడ్చారు. నేను వెళ్ళి ఆ శవంపై మట్టి తీసి అందులోకి ప్రవేశించి ధుని బాబా అనే ఈ శరీరాన్ని గంగలో పారవేశాను. శరీరం మార్చినా, గాని నేను నేర్చిన విద్య, జ్ఞానం నాతోనే ఉంది. నేను కర్ర ఎప్పుడు చేతిలో పట్టుకొనే వాడిని. లక్కడ్గిరి అనేవారు. ఆ శరీరంకు 100 సంIIలు నిండిన సమయానికి, దూద్ కాశిలోని కొండ గుహలో ఉన్నాను. కొండ ప్రక్కన గల గ్రామం వారింట్లో ఒక యువకుడు అడవికొచ్చి ప్రమాదంలో, లోయలో పడి చనిపోతే , అతడి శరీరం స్వీకరించాను. ఆ తరువాత నేను టిబెట్లో స్థిరపడ్డాను, కుటీరం వేసుకొని ఉన్నాను. "కుటియా బాబా" గా పిలువబడ్డాను. తిరిగి ఒక గుహలో చేరాను.

అక్కడ ఆ దేహానికు 100 సం||లు నిండితే ముక్తినాథ్ యాత్రికులలో ఒకడు టిబెట్ లోయలో 18 సం||రాల యువకుడు లోయలో జారిపడ్డాడు. అతని చొక్క చెట్లకు చిక్కుకొని లోయ లోతు చూసి భయపడి చనిపోయిన, ఆ యువకుని చొక్కా చిరిగి జలపాతంలో శరీరంపడి కొట్టుకొని 2వ రోజు, నా గుహముందు రాయికి ఆనుకొని ఉంది. బాగా పరిశీలించా శరీరం చక్కగానే ఉంది. అందులోకి ప్రవేశించి అక్కడి నుండి పాదయాత్రలు చేస్తు తీర్థాలన్ని తిరుగుతూ, అమర్ నాథ్ వెళ్ళి మళ్ళీ వచ్చేటప్పుడు, చందన్ వాడి నుండి 50 కిలో మీటర్ల లోపల గుహలకై వెతుకగా "బరఫ్ గుహ" నచ్చి అందులో "బరఫ్ బాబా" గా పేరుపొందాను. ఇది నా శరీరాల యాత్ర .ప్రతి శరీరంలో ఉన్నప్పుడు నేను ఏకాంతతను, యోగాభ్యాసాన్ని, ధ్యానాభ్యాసాన్ని, తపస్సునే..... ఇష్టపడ్డాను. శరీరాలు మారిన నేను..... ఒక్కడినే కదా! అభిరుచి, మనస్తతత్వం ఒక్కటే గదా! నేను ఏకాంత ప్రియున్ని అని చెప్పారు బాబా.
ప్రశ్న :- ఆదిశంకరులు మీలాగే, రాజు శవంలోకి ప్రవేశించారని విన్నాను. బాబా, యోగి బ్రతికి ఉన్న శరీరంలో కూడా ప్రవేశించగలడా?
జ :- ప్రవేశించగలడు ఉదా:- రామకృష్ణపరమహంస వివేకానందలోకి ప్రవేశించి నేను బికారినైనా, నాకు ఉన్నదంతా నీకిచ్చేశాను. నీవే నేను అన్నారు. వారి సంకల్పాలన్నీ, వివేకానంద శరీరంతో పూర్తి చేయించిరి. గార్గి జనకునిలోకి ప్రవేశించి వాదన జరిపినది కదా !యోగి ఏ శరీరంలో ప్రవేశించిననూ, తన ఇచ్చా ప్రకారం కార్యాలు జరిపించగలడు. అవే భావాలున్న వాడైతే అర్థం చేసుకొనును. వ్యతిరేక భావనల వాడైతే సతమతమౌను. ఇతరుల ప్రారబ్దానికి వ్యతిరేకంగా ఏది చేయడు యోగి.

ప్రశ్న :- మీరు దేహం త్యజించి కొత్త శరీరం పొందొచ్చుగదా! శవంలోకి ప్రవేశించుటదేనికి ?
జ :- ఈ సారి ఇక అలాగే చేస్తాను. అది నేను యోగవిద్యతో చేసిన విన్యాసం, నాయనా! ఈ సారి ఒక జన్మతీసుకొని తపమాచరించి లోక సేవజేసి జీవన్ముక్తి పొందుతాను. మరల జన్మకురాను.
ప్రశ్న :- మళ్లీ జన్మిస్తే తపస్సుదేనికి ? పూర్వ తప ఫలం తోడు రాదా?
జ :- మళ్లీ జన్మిస్తే సంస్కారాలు ఉంటాయి. కాని మళ్లీ కొంత తపస్సు చేయవలసిందే. అది లోక ఆదర్శం . కాని త్వరగా, సిద్ది ప్రాప్తి లభించును. జన్మ సంస్కారంచేత.
ప్రశ్న :- బాబా, మీరు యాత్రికుల దృష్టిలో పడలేదా? ఇన్ని శరీరాల్లో ఎప్పుడైనా?
జ :- మేము ఎప్పుడు ఎవరికి కనిపించాలో ఎవరితో మాట్లాడాలో, ఎవరికి విద్య నేర్పాలో, ఎవరికి సందేశమివ్వాలో వారికే అవకాశం దొరుకుతుంది. ఇతరులకు దొరకదు.
ప్రశ్న :- ఇప్పటి వరకు ఎంత మందితో మాట్లాడి ఉంటారు స్వామీ?
జ :- ప్రతి శరీరం మారినప్పుడల్లా 100 లేదా 150, మందితో మాట్లాడి ఉంటాను. సుకృత జీవులు సంపూర్ణ సాధకులకే, సిద్ద గురువుల దర్శన భాగ్యము లభించును. వారితో సంభాషణ, వారితో సందేహ నివృత్తి చేసుకొనుట, విద్య నేర్చుకొనుట జరుగును. అందరికీ ఈ అవకాశం ఉండదు.
ప్రశ్న :- బాబా ఎవరైనా , యాత్రికులు, దారి తప్పి మీ ఏకాంతానికి వస్తే ఏమి చేస్తారు?
జ :- మా రూపమును పక్షిగా మార్చి చెట్టుపై ఉండుట, రాయిగానో మారుట చెట్టుగానో మారుట, జంతువులుగానో మారుట, ఈగ, దోమగానో మారుట, లేదా సూక్ష్మంగా అంతర్ధానమవుట చేస్తాను. అంతే. ఎవరికి కనిపించకుండా, సూక్ష్మంగా మారుటనో చేస్తాము.
ప్రశ్న :- మీరు ఒకే సారి గొప్ప సిద్ధులు పొందారా?
జ :- లేదు, ఏ యోగి అయిన క్రమంగా ఒకటి తర్వాత ఒకటి మెట్టుమెట్టుగా క్రమంగా సిద్దిని పెంచుకుంటూ పోతాడు. చిన్న మొక్క మహావృక్షంగా క్రమంగా పెరిగే విధంగా, చిన్నగా ఉన్న శరీరం క్రమంగా పెరిగే లాగా, సిద్ది ప్రాప్తి జరుగుతుంది. సాధనాబలాన్ని బట్టి క్రమంగా వికాసం అవుతుంది. దూరదృష్టి , దూర శ్రవణం, (దూర శబ్దాలను కూర్చున్న చోటే వినుట), ఎంత దూరమైన సందేశం పంపుట, శరీరంతో ఆకాశంలో ప్రయాణించుట, ఏదైనా సృష్టించుట, ఏ రూపమైన దాల్చుట, కనిపించకుండా పోవుట, ఒకేసారి ఎన్ని రూపాలుగానైన మారుట , ఏదైన చేయగలుగుట ......ఇవన్నీ ఒకటి తర్వాత ఒకటి సాధన బలంచే సిద్దించును.

అయితె ఇదంతా మాయనే . నీ ఆత్మలో నీవు లయంచెంది, నిర్వికల్ప నిష్టపొంది ఆత్మజ్ఞానం పొందుటే ముఖ్యము. సిద్ధులన్ని కొత్త సాధకులకే ఆసక్తి కలిగించును. సిద్ద పురుషులు, అంతా నేనే లీలలు ఎవరికి చూపించకూడదు అనుకుంటారు. పరిస్థితులను బట్టి వారి నుండి సమాజ శ్రేయస్సుకు అభిమానం, అహంకార మమకారాలు లేకుండా, నిస్వార్థంగా వారి నుండి సిద్దులు ఒక లీలలాగ జరిగి పోతుండును. కాని వారెటువంటి ప్రచారాలు ప్రదర్శనలు కోరరు. వారిలో వారు బ్రహ్మానందంలో ఉంటారని బరఫ్ బాబా ఓపికగా ఎన్నో యోగపరమైన, ధ్యానపరమైన, సిద్ధి పరమైన విషయాలు తెలియజేసారు. 
టెలిగ్రామ్’ ద్వారా (గురుగీత) పొందాలనుకునేవారు:
 
- శ్రీనివాస మూర్తి చిట్టమూరి 

Quote of the day

I slept and dreamt that life was joy. I awoke and saw that life was service. I acted and behold, service was joy.…

__________Rabindranath Tagore