బ్రతకడానికి ఆహారమే గానీ
బ్రతకడానికి ఆహారమే గానీ , ఆహారం కోసం బ్రతకొద్దంటుంది ఆయుర్వేదం .
-సేకరణ: లక్ష్మి రమణ
ఆహారమనేది ‘మితం’గా తినాలి. జిహ్వ చాపల్యాన్ని ఎంతగా అదుపులో ఉంచుకుంటే, అంత మంచిది. అంటే శిశువులు, యువకులు, వృద్ధులు తమ వయసును బట్టి తగినంత తిని తదనుగుణంగా వ్యాయామం చెయ్యాలని ఆయుర్వేదం చెబుతోంది. వృత్తిని బట్టి సుకుమారులు, కాయకష్టం చేసేవారు, మానసిక శ్రమకి గురయ్యేవారు తమకు అనుగుణంగా తమ ప్రమాణాల్ని మార్చుకోవాలి. అదేవిధంగా గర్భిణీ స్త్రీలకు ప్రత్యేకమైన పోషకాంశాలున్న ఆహారాన్ని సూచించారు. ఇక్కడ మరొక ముఖ్యాంశం ఏమిటంటే ‘అగ్ని’ (అరిగించుకునేశక్తి) బలాన్ని బట్టి ప్రతిఒక్కరూ ఆహార ప్రమాణాన్ని సరిచూసుకోవాలి. మితిమీరి తింటే అజీర్ణవ్యాధి కలుగుతుంది. ఇది ఎన్నో రకాల ఇతర వ్యాధులకు దారి తీస్తుంది.
తినవలసినవి తాగవలసినవి
ఇవి తినండి:
⇒ మొలకెత్తిన గింజలు (పెసలు నిత్యం లభ్యమౌతాయి)
⇒ నానబెట్టిన వేరుశనగపలుకులు
⇒ పచ్చికొబ్బరి
⇒ గ్రీన్‌సలాడ్లు (ఖీరా, టమాటా, కేరట్, బీట్‌రూట్ మొదలైనవి)
తాజా ఫలాలు: బొప్పాయి, జామ, సపోటా, సీతాఫలం, అరటి, బత్తాయి, కమలా, దానిమ్మ, ద్రాక్ష మొదలైనవి.
ఎండిన ఫలాలు: ఖర్జూరం, జీడిపప్పు, బాదం, పిస్తా, కిస్మిస్ మొదలైనవి.
⇒ ముడిబియ్యంతో వండిన అన్నం, గోధుమపిండి లేదా మల్టీగ్రైన్ పిండ్లతో చేసిన పుల్కాలు.
⇒ ఆకుకూరలలో తోటకూర చాలా శక్తినిస్తుంది. పాలకూర, బచ్చలికూర, మెంతికూర మొదలైనవి నిత్యం తినవచ్చు.
⇒ కరివేపాకు, కొత్తిమీర, పుదీనా చాలా మంచివి.
⇒ శాకాహారంలోని కాయగూరలన్నీ మంచివే. ఉడికించి తినడం అలవాటు చేసుకోవాలి. చేమదుంప శక్తినిస్తుంది.
⇒ నువ్వులు (పచ్చిపప్పు), బెల్లం రోజూ 3 చెంచాలు నమిలి తినడం మంచిది. కాల్షియం, ఐరన్ సమృద్ధిగా లభిస్తుంది.
ఇవి తాగండి
⇒ రోజూ కనీసం 3-4 లీటర్ల మంచినీరు తాగటం మంచిది. (ఒకేసారి కాకుండా, నియమిత విరామాలతో తాగాలి. తినడానికి ముందుగాని, తిన్న తర్వాత గాని 45నిమిషాల పాటు నీరు తాగవద్దు)
⇒ వారానికి రెండుసార్లు కొబ్బరినీళ్ళు తాగితే మంచిది.
⇒ స్వచ్ఛమైన చెరకు రసం తాగితే మంచిది.
⇒ అప్పుడప్పుడు, ఉదయం ఒకగ్లాసు బార్లీ తాగితే మంచిది. రాగుల జావ కూడా శక్తికరం.
⇒ పండ్లరసాలు, పచ్చికూరల జ్యూస్‌లు చాలా మంచిది.
⇒ తేనె ఎంత తిన్నా చాలా మంచిది. బలకరం, రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
ప్రస్తుతం లభించే ఆహారపదార్థాలలో ఏవి మంచివి ?
తినే ఆహారం ఏదైనా ఆ భారాన్ని తట్టుకోవలసింది ‘‘మహాకోష్ఠమే’’ (అంటే నోరు మొదలుకొని మలవిసర్జన మార్గం వరకు). ఆహారాన్ని అరిగించాల్సిన బాధ్యత జీర్ణాశయానిదైతే, ఆ సారాన్ని తగు మార్పులతో మన శరీరంలోని కణాలకు అందించే బాధ్యత కాలేయానిది. దీనినే ఆయుర్వేదం ‘యకృత్’ అని చెప్పింది. ధాతు పరిణామ ప్రక్రియ దీని ధర్మం. ఇంతటి విలువైన ఈ అవయవాన్ని (యకృత్‌అంటే లివర్‌ను) కాపాడుకోవలసిన బాధ్యత మనదే. దీనిని మనం రక్షించుకుంటే చాలు. మన దేహాన్ని అది రక్షించుకుంటుంది.