ఆయుర్వేదం వైద్యశాస్త్రమే కదా !
ఆయుర్వేదం వైద్యశాస్త్రమే కదా! మరి వేదంగా పరిగణన ఎందుకు చేస్తారు ?
-సేకరణ: లక్ష్మి రమణ
ఆయుర్వేదం కేవలం వైద్యశాస్త్రం మాత్రమే కాదు, ఒక సమగ్ర జీవనశైలి. మిగతా వైద్య ప్రక్రియలు చాలావరకు చికిత్సలను మాత్రమే పేర్కొంటాయి. కానీ మన సమగ్ర జీవన విధానం ఎలా ఉండాలో చెబుతూ... తద్వారా వ్యాధుల నివారణకూ ప్రాధాన్యమిస్తుందీ శాస్త్రం. ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తూనే దైనందిన వ్యవహారాలనూ, ఆహార విహారాలనూ, పథ్యాపథ్యాలనూ వాటి ప్రయోజనాలనూ విడమరచి వివరిస్తుందీ వేదం.
వీటిని ఆచరిస్తే కడవరకూ ఉక్కుపిండంలా ఉండేలా చూస్తుంది. నిజానికి భారతదేశానికి భరించలేని వ్యాధులు వలసవచ్చిన ప్రతిసారీ , అండాదండై ఆదుకున్నది ఆయుర్వేదమే !
ఆయుర్వేదం అంటే?
ఆయుర్వేదం కేవలం ‘వైద్యగ్రంథం’ మాత్రమే కాదు. అందులో వైద్యం కూడా ఒక ప్రధాన అంతర్భాగం. ‘‘వేదం’’ అంటే జ్ఞానమని అర్థం. దీనినే శాస్త్రం అని కూడా చెప్పవచ్చు. ఆయువు అంటే జీవితం. ఆ విధంగా అది ఆయువుకి, జీవికకి సంబంధించిన ఒక సమగ్ర జ్ఞానం. అందుకే అది వేదం .
ఆరోగ్య పరిరక్షణ కోసం ఉద్భవించిన జీవన వేదమే ‘‘ఆయుర్వేదం’’. మనిషి మనుగడకు ఆధారమైన దినచర్య, ఋతుచర్య, స్వస్థవృత్తం, సద్వృత్తం వంటి వివరాలను సూచిస్తూ, జీవనశైలికి దిశానిర్దేశం చేసే సజీవనాదం. ఆహార విహారాల స్వరూప స్వభావాల్ని, ఆరోగ్యంలోనూ, ఆయుఃవృద్ధిలోనూ వాటికున్న ప్రాశస్త్యాన్ని శాస్త్రీయ దృక్కోణంలో చూపే నిలువుటద్దం. ఇది అధర్వణ వేదానికి ఉపవేదం.
ఆయుర్వేదంలో అసలు సూత్రం
‘‘మిథ్యాహార విహారాభ్యాం సర్వేషామేవరోగాణాం, మూలకారణం’’
శాస్త్రోక్తమైన ఆహార, విహారాలను ఉల్లంఘించడమే సమస్త రోగాలకు మూలకారణం.
‘‘స్వశరీరస్య మేధావీ కృత్యేషు అవహితోభవేత్’’
జ్ఞానవంతుడు తన ఆరోగ్యం విషయంలో అప్రమత్తుడై ఉండాలి.
శృంగారం- విశిష్టత
‘‘స్మృతి మేధా ఆయురారోగ్య పుష్టీంద్రియశోబలైః
అధికా మందజరసో భవంతి స్త్రీషు సంయతాః॥
క్రమశిక్షణతో కూడిన శృంగారం వల్ల ఆయువు పెరుగుతుంది. యౌవనంతో ఉండే కాలవ్యవధి పెరుగుతుంది. అంటే దీర్ఘకాలం పాటు వయసు పైబడదు. ఫలితంగా అన్ని ఇంద్రియాలూ పుష్టిగావుండి, తెలివితేటలు పెరిగి, శక్తిమంతులై, ధీమంతులై ఆరోగ్యంగా ఉంటారు.
ఎలాంటి ఆహారం తినాలి?
దేహపోషణార్థం మనం సేవించే ఏ పదార్థమైనా ‘‘అన్నమే’’. వరి, గోధుమ, బార్లీ, రాగులు వంటి ఏ ద్రవ్యంతో చేసినా లేదా వంటతో సంబంధంలేని కందమూలాలు, ఫలాలైనా; ఘనద్రవాలవంటి ఏ రూపంతో ఉన్నా; భక్ష్య, చోష్య, పాన, లేహ్య విధానాల్లో ఎలా సేవించినా అది ఆహారమే. సృష్టిలోని వివిధ పదార్ధాల్లోంచే ఆహారం లభిస్తుంది. కనుకనే పంచభూతాత్మకమైన ఆహారం పంచభూతాత్మకమైన శరీరాన్ని పోషిస్తుంది. దీనినే సుశ్రుతాచార్యులు ఈక్రింది శ్లోకంలో ఇలా వివరించారు.
‘‘పంచభూతాత్మకే దేహేతి ఆహారః పాంచభౌతికః
విపక్వః పంచధా సమ్యగ్గుణాన్ స్వానభివర్ధయేత్॥
ఆహారం శరీరానికి మనసుకి శక్తినిచ్చి ఓజస్సుని వృద్ధి చేస్తుంది.
ఆహార వర్గీకరణ
నాలుకకు కలిగే రుచిని బట్టి, ఆహారాన్ని ఆయుర్వేదం ఆరురకాలుగా విభజించింది. ప్రధాన రసం, అనుబంధ రసం అనేవి సాంకేతిక విశ్లేషణ క్రిందకు వస్తాయి. షట్స్రాలు ఈక్రింది విధంగా ఉన్నాయి.
‘‘మధుర (తీపి), అమ్ల (పులుపు), లవణ (ఉప్పు), కటు (కారం లేక తీక్ష్ణం), తిక్త (చేదు), కషాయ (వగరు).’’
⇒ వాటి గుణకర్మల్ని బట్టి ‘‘లఘు, గురు, శీతల, ఉష్ణ, రూక్ష (పొడిపొడిగా ఉండేవి), స్నిగ్ధ (జిగురుగా ఉండేవి)’’ మొదలగు రకాలుగా విభజించింది.
⇒ మనసు మీద చూపే ప్రభావాన్ని బట్టి, ‘‘సాత్వికాహారం, రాజసాహారం, తామసికాహారం’’గా వీటిని వర్గీకరించి చెప్పారు.
సమీకృతాహారం (ఆయువర్ధకం):
పైన పేర్కొన్న ఆరు రసాలను అలవాటు చేసుకోవడం ఉత్తమం. కొంచెం మధుర రసానికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఆహారం సాత్మ్యంగా (సరిపడేదిగా), హితకరంగా (నచ్చినదిగా), లఘు, ఉష్ణ, స్నిగ్ధకరంగా ఉంటే శ్రేష్ఠం. ఇలాంటి ఆహారాన్ని ఆయుఃవర్ధకంగా చెప్పారు.
ఇక్కడ విశేషమేమిటంటే ఈ ఆరు రసాలలోనూ ఉప్పు (లవణం)ని ఎక్కువ వాడవద్దని హెచ్చరించింది ఆయుర్వేదం. దాంతో బాటే పిప్పళ్లు మరియు క్షారం (ఉప్పు సాంద్రత కలిగినవి)లనూ నిషేధించింది. దాని దుర్గుణాలను కూడా చరకాచార్యులు ఈక్రింది శ్లోకంలో ఇలా చెప్పారు.
‘‘అథఖలు త్రీణి ద్రవ్యాణి నాతి
ఉపయుంజీతాధికం
అన్యేభ్యోద్రవ్యేభ్యః తద్యథా -
పిప్పలీః, క్షారం, లవణమితి’’
‘‘అతి లవణ సాత్మ్యాః పురుషాః తేషామపి
ఖాలిత్య, ఇంద్రలుప్త, పాలిత్యాని
తథా వలయశ్చాకాలే భవంతి’’
⇒ ఉప్పును అధికంగా తీసుకునేవారికి బట్టతల, వెంట్రుకలూడటం, నెరిసిపోవడం, చర్మం ముడతలు పడటం, ఇవి చిన్న వయసులోనే వస్తాయి .
కాబట్టి చక్కగా మితమైన ఆహారాన్ని , ఉప్పు ఎక్కువ వేసుకోకుండా తీసుకొని ఆరోగ్యంగా ఉందాం . ఆయుర్వేదాన్ని అవలంభిద్దాం . మన విజ్ఞానాన్ని, మన సంపదనూ కాపాడుకుందాం .