సౌచం అంటే ఏమిటి ?
సౌచం అంటే ఏమిటి ?
- లక్ష్మి రమణ
ధర్మదేవతకున్న నాలుగుపాదాల్లో శౌచం ఒకటని ధర్మరాజు చెప్పాడు. మనం ఆ పాదాన్నే గట్టిగా పట్టుకుని మనల్ని మనం కాపాడుకోవాలి. శౌచం అంటే శుభ్రంగా వుండడం. శరీరాన్ని, మనసును, చుట్టూ ఉన్న సమాజాన్ని అన్నిటిని పరిశుభ్రంగా వుంచుకోవడం. ఇది అనారోగ్యాన్ని నిరోధించే ఉత్తమోత్తమ సాధనం.
మనం సూర్యుణ్ని ఎందుకు ఆరాధిస్తాం? సూర్యుడు ఆరోగ్యాన్ని యిస్తాడు, క్రిములను పారద్రోలుతాడు కాబట్టి. ఇంట్లో వస్తువులకు బూజు పడితే ఎండలో ఆరబెడితే బాగుపడతాయి. ఆ ఎండ తగలకే యిప్పుడందరూ డి-విటమిన్ లోపంతో బాధపడుతున్నారు. అందుకే కాస్సేపు ఎండలో నించోడి అని చెప్పేది . ఇంకొంచెం శ్రమించగలిగితే , సూర్యనమస్కారాలు ఆచరించడం మరీ మేలు .
మనమే కాదు, మన చుట్టూ ఉన్న సమాజం కూడా శుచిగా, శుభ్రంగా వుండేట్లు చూడాల్సిన అవసరం మనది. దీనికి మనం వాడేది నీరు. నీరు ఎక్కడుందా అని వెతుక్కుంటూ మానవాళి భూమంతా తిరగడంతోనే నదీతీరాల వెంబడి నాగరికతలు వర్ధిల్లాయి. అందువలన మనం నదీజలాలను కాపాడుకోవాలి. వాటిని పరిశుభ్రంగా వుంచాలి. శుద్ధి చేయవలసిన నీటినే కలుషితం చేస్తే యింక అదెక్కడ శుభ్రం చేస్తుంది? మనం నదులను పవిత్రంగా భావిస్తాం, పాపాలు పోతాయంటూ వాటిలో మునకలు వేస్తాం. అదే సమయంలో నానారకాల వ్యర్థాలను వాటిలో వదులుతాం. సామాజికపరంగా మనం చేస్తున్న తప్పు అదొక్కటే కాదు. బహిరంగ మలమూత్ర విసర్జన, ఎక్కడ పడితే అక్కడ చెత్త పారేయడం యిలాటి దుర్లక్షణాలు ఎప్పటికి పోతాయో తెలియదు. మనమే విదేశాలు వెళ్లినపుడు ఒళ్లు దగ్గర పెట్టుకుని ఉంటాం. అదే మన దేశానికి వచ్చేసరికి చెత్తడబ్బా దాకా వెళ్లడానికి బద్ధకిస్తాం.
వ్యక్తిగత శౌచం చాలా అవసరం . బయట నుంచి వస్తే, బాత్‌రూమ్‌కి వెళ్లి వస్తే, భోజనానికి ముందూవెనుకా కాళ్లూ, చేతులూ, మొహం తప్పనిసరిగా కడుక్కోవాలి. అన్నం పరబ్రహ్మస్వరూపం. భోజనం చేయడం యజ్ఞంతో సమానం. ఎక్కడపడితే అక్కడ, ఎలా పడితే అలా, బజార్లో తిరిగివచ్చిన దుస్తులతో తినకూడదు. అలా తింటే దేహరక్షణ వ్యవస్థ బలహీనమై, మనం రోగానికి సులభంగా లొంగిపోతాం.
పెళ్లిళ్లల్లో బఫే భోజనాలకు వెళ్లి వందలాదిమందికి షేక్‌హ్యాండ్‌లు యిచ్చి, హేండ్ వాష్ దూరంగా వుందని బద్ధకించి, అదే మురికి చేత్తో భోజనం చేసేవాళ్లు ఎందరో ఉన్నారు. చేశాక టిస్యూ పేపరుతో తుడిచేసుకుని, మళ్లీ కరచాలనాలు మొదలెట్టేవారు కొందరు.
ఎవరిదైనా ఎంగిలి తినరావలసి రావడం ఖర్మగా భావించేవారు. ఎంగిలి ఐన కూడు పెట్టినందుకు ఋషులు శపించిన సందర్భాలున్నాయి. అలాటిది యిప్పుడు ఎంగిలి పాటిస్తున్నామని చెప్పుకోవడం సిగ్గుపడాల్సిన విషయం అయిపోయింది. ఒకే ప్లేట్లో నలుగురు తినడం, ఒకే గ్లాసులోది అరడజను మంది తాగడం ఫ్యాషనై పోయింది. ఇది ముమ్మాటికీ ఆరోగ్యకరం కాదు.
ఫ్యాషన్ పేరుతో అందరూ పెరిగిన గడ్డాలతో, మురికి బట్టలతో బూచాళ్లలా తయారవుతున్నారు . రఫ్‌గా ఉంటేనే మ్యాన్లీగా ఉన్నట్లు అనుకుంటూ స్నానాలు మానేసి, డీయోడరెంట్ చల్లుకుని జనాల్లో తిరిగేస్తున్నారు. ఎప్పుడు నిద్రపోతారో, ఎప్పుడు తింటారో, ఎప్పుడు పళ్లు తోముకుంటారో తెలియదు. ఎక్కడ తింటారో ముందే చెప్పలేం. రుచికోసం అంటూ రోడ్డు పక్క దుమ్మూధూళీలో పెట్టిన బళ్ల దగ్గర తింటారు. దాన్ని ఆధునిక జీవనశైలిగా అభివర్ణించుకుంటారు.వేళాపాళా లేకుండా తింటమే అనారోగ్యకరం . ఇక బల్ల మీద దుమ్ముకొట్టుకుపోయిన ఆహారాన్ని తినడం యెంత ప్రమాదమో విజ్ఞులే ఆలోచించుకోవాలి !
తిండి దగ్గరకు వచ్చాం కాబట్టి దాని గురించి మరింతగా మాట్లాడుకోవాలి. మనకు వంటిల్లే ఔషధాలయం. సుగంధ ద్రవ్యాల పేరుతో మనం వాడే దినుసులున్నీ శరీరానికి ఎంతో మేలు చేసేవి. ఉల్లి, వెల్లుల్లి, అల్లం, పసుపు, వాము, శొంఠి, మెంతులు, మిరియాలు, ఆవాలు, ఏలకులు, లవంగాలు, దాల్చిన చెక్క.ఇవన్నీ భారతీయ పోపులపెట్టెలోని రారాజులు . ఇంటివైద్యం, చిట్కాలు తెలిసిన ప్రతి గృహిణికి వీటి కథేంటో తెలుసు.
పోపులపెట్టెయే ఆవిడ మందులషాపు. వీటికోసమే గతంలో పాశ్చాత్య దేశాల వాళ్లు మన దేశాలకు వచ్చి, అంతిమంగా మన నెత్తికెక్కారు. అంత సంపద మన దగ్గర పెట్టుకుని, యివేమీ లేని పిజ్జాలు, బర్గర్ల కోసం మనం వెంపర్లాడడం, రోగనిరోధక శక్తిని నాశనం చేసుకోవడమేగా!
మన నివసించే పద్ధతి ఎలాటిది? ఇంటి ముంగిట వేపచెట్టు యాంటీ యాక్సిడెంట్లు యిస్తుంది. మామిడి చెట్టు ధారాళంగా ఆక్సిజన్ యిస్తుంది. కర్పూరం వెలిగిస్తే, ఆవుపిడకలు కాలిస్తే రోగక్రిములు నశిస్తాయి. ఇక వండుకునే విధానం ఎలాటిది? పెరట్లోని దొండపాదు దొండకాయలిస్తుంది, మునగచెట్టు ములక్కాడలిస్తుంది, కరివేపాకు చెట్టు కరివేపాకు యిస్తుంది, కొత్తిమీర మడి కొత్తిమీర యిస్తుంది. తాజా కూరలతో వంట తయారవుతుంది. పోపులపెట్టె సహాయంతో వేడివేడి చారు తయారై కఫం అణచేస్తుంది. అంతా తాజాతాజాగా, వేడివేడిగా, అప్పటికప్పుడు వండుకుని తింటాం. పైగా ఇంట్లో వండేవారి మనసుకూడా కలిసి ఆ పదార్థానికి ఆత్మీయత అనే కొత్త రుచి వస్తుంది . ఆహారానికి ఇంతకుముంచిన సౌచం ఏముంటుంది చెప్పండి !
శరీరం బాగుండాలంటే మనసు కూడా బాగుండాలి. రెండూ పరస్పరాశ్రితాలు. మనసు బాగాలేక శరీరానికి వచ్చే వ్యాధులను సైకో`సొమాటిక్ డిసీజెస్ అంటారు. కోపం, నిరాశ, దిగులు, క్రుంగుబాటు వలన రక్తపోటు, కడుపులో అల్సర్ , గుండెనొప్పి, నిద్రలేమి, కీళ్లనొప్పులు రావడం మనకు తెలుసు. జీవితంలో కష్టాలు లేనివారు ఎవరూ లేరు. అయితే రోజులో కాసేపయినా మనసు ప్రశాంతంగా ఉంచుకోవడం కోసం సంగీతం, సాహిత్యం, యితర లలితకళ ఏదైనా వినడమో, చూడడమో అలవరచుకోండి. యోగా, ధ్యానం చేయండి. యోగాసనాలకు ఒళ్లు ‘వంగని’వారు కనీసం ప్రాణాయామం చేయండి. ఇది మానసిక శుభ్రతకి ఉపయోగిస్తుంది . ఒత్తిడిని తగ్గించి మనసుని ఉత్సాహంగా చేస్తుంది .
ఈ కాలుష్యవాతావరణంలో అన్నిటికంటె ఎక్కువగా దెబ్బ తినేవి ఊపిరితిత్తులే. కరోనా కూడా ఊపిరితిత్తులను ముడుచుకునేట్లా చేస్తుంది. ప్రాణాయామంతో అవి విప్పారుతాయి. పూర్తి స్థాయిలో పనిచేస్తాయి. ఇక ధ్యానమంటారా, ఏకాగ్రత కుదరడం లేదని మానేయకండి. ఇవన్నీ అభ్యాసంపైనే వస్తాయి. సాధన వుంటే మనసును ప్రశాంతంగా వుంచుకోవడం మరీ అంత కష్టం కాదు.
మన కర్మ సిద్ధాంతాన్ని నమ్మండి. భగవద్గీతలో చెప్పినట్లు - నీ పని నువ్వు చేసుకుంటూ పో, ఫలితంపై ఆశ పెట్టుకోవద్దు. అది దేవుడి పని. ఫలితాన్ని ఆశించి పని చేయవద్దు. ‘ఇది నా ధర్మం, నిర్వర్తిస్తున్నాను.’ అనుకుంటూ చేసుకుంటూ పోవడమే మన పని. ఈ సిద్ధాంతాన్ని అమలు చేశారంటే, అటు ఆత్యాత్మికం , ఇటు మానసిక శాంతి రెండూ దక్కుతాయి. ప్రయత్నించండి .
సౌచం గురించి మూడుముక్కల్లో చెప్పాంటే - శరీరాన్ని, మనసును, బుద్ధిని శుచిగా పెట్టుకోండి, మంచి ఆహారం తినండి, మంచి అలవాట్లు పాటించండి, శరీరాన్ని దృఢంగా ఉంచుకోండి . సమాజం కూడా శుచిగా వుండేట్లు పౌరుడిగా కృషి చేయండి. పెద్దలమాటని గౌరవించండి . విద్య, వైద్యానికి గౌరవం యివ్వండి. ఆరోగ్యమే మహాభాగ్యమని, అధికధనమూ, ఆయుధాలు ఆపత్సమయాన అక్కరకు రావని గుర్తుంచుకోండి .
చివరగా, పూజకో , దేవాలయానికో వెళ్లేప్పుడు పాటించేదే సౌచం కాదనీ , వ్యక్తిగతంగా ఎల్లప్పుడు సౌచాన్ని పాటించడం వల్లే , భగవంతుడు సంతుస్టుడవుతాడని గ్రహించండి .
శుభం .