Online Puja Services

నిద్ర ఎప్పుడు లేవాలి..?

18.119.136.220

ధర్మ సందేహములు:
సందేహం:
నిత్య జీవితంలో నిద్ర ఎప్పుడు లేవాలి..?

సమాధానము:
నిద్ర లేచే విషయంలో హిందు ధర్మ శాస్త్రాలు, వైద్య శాస్త్రం కూడా ఒకే మాటగా “బ్రాహ్మే ముహూర్తే బుద్ధేత” అని, అలాగే “బ్రాహ్మీ ముహూర్తే ఉత్థాయ చింతయే దాత్మనో హితం” అని పేర్కొన్నాయి. ఆయురారోగ్యాలతోపాటు ధర్మాచరణకు బ్రాహ్మీ ముహూర్తంలో నిద్ర లేవాలని హిందూ ధర్మ గ్రంథాలు తెలిపాయి.

సూర్యోదయానికి ముందున్న ముహూర్తాన్ని రౌద్రమంటారు. దీనికి ముందున్నదే బ్రాహ్మీ ముహూర్తం. అనగా సూర్యోదయానికి సుమారు గంటన్నర ముందుండే సమయం. ఈ సమయంలో నిద్రలేవటంలో వైజ్ఞానిక రహస్యం ఇమిడి ఉంది. భూమి తన చట్టూ తాను తిరగటం వలన రాత్రింపగళ్లూ ఏర్పడతాయి. బ్రాహ్మీముహూర్తం నుంచి మధ్యాహ్నం వరకు ఉండే సమయం ఉత్తేజం కలిగించే సమయం. ఈ సమయంలో దేహంలో అన్ని రకాల శక్తులు వృద్ధి పొందుతాయి, చురుగ్గా పనిచేస్తాయి. దీనిని ఆదాన సమయం అంటారు.

మధ్యాహ్నం నుంచి మధ్యరాత్రి దాటే వరకు శిథిలత నిచ్చు సమయం. ఈ సమయంలో అలసట స్వభావాలు ఏర్పడుతుంది. శరీరంలోని అన్ని అవయవాల శక్తులు సన్నగిల్లుతాయి. దేహం విశ్రాంతి కోరుకుంటుంది. దీనిని విసర్గ సమయం అంటారు. ఆదాన సమయంలో నిద్రపోవటం, విసర్గ సమయంలో మెలకువగా ఉండటం శారీరకంగానూ, మానసికంగానూ అనారోగ్యకరమైంది. దీంతో బుద్ది చురుకుదనం కోల్పోతుంది. లౌకిక వ్యవహారాలకే ప్రాధాన్యత నిచ్చేవారు ఈ వత్యాసం గుర్తించలేరు. ఇలాంటి వారు తమ ఆధ్యాత్మిక దృష్టిని వికసింప చేసుకునే అవకాశాలను చాలా వరకు కోల్పోతారు. అందుకే ఇలాంటి వారికి అవసరమైన శాంతస్థితి చేకూరదు. దీంతో వీరు నిజమైన సుఖ శాంతులకు దూరం అవుతారు. ఈ ప్రవృత్తిని నిశాచర ప్రవృత్తిగా పిలుస్తారు.

వేకువ జామునే నిద్ర లేచే విషయంలో పసిపిల్లలే సదాచారపరులు. చిన్నారులు తల్లిదండ్రుల కంటే ముందే బ్రాహ్మీ ముహూర్తాన్నే నిద్రలేస్తారు. వాళ్లను నిద్రలేపుతారు. పసిపిల్లలు నిద్రలేచే ఈ ప్రవృత్తి ప్రకృతి సిద్ధం. బ్రాహ్మీ ముహూర్తంలో పక్షుల కిలకిలా రావాలు వినిపిస్తాయి. పశుపక్ష్యాదులు కూడా బ్రాహ్మీ ముహూర్తంలోనే నిద్రలేస్తాయి. అంతేకాదు సకల పుష్పాలు…ఈ ముహూర్తంలోనే పరిమళాలు వేదజల్లుతాయి. అలాగే ఈ ముహూర్తంలో నిద్రలేస్తే, మన బుద్ది కూడా వికసించి ఉత్తమ సమాలోచనలు పొందుతుంది. అందుకే ఇది బ్రాహ్మీ ముహూర్తం అయ్యింది. బ్రాహ్మీ అంటే సరస్వతి. బ్రాహ్మీ ముహూర్తాన లేచిన వెంటనే చల్లని నీటితో కళ్లు తుడుచుకోవాలి. కొన్ని గంటలుగా కాంతిని నిరోధించిన కళ్లకు హఠాత్తుగా వెలుగు చూపటం దోషం. అందుకై ఇలా చన్నీటితో తుడుచుకోవాలి.

ఆ తర్వాత ‘సముద్ర వసనే దేవి! పర్వత స్తనమండలే, విష్ణుపత్ని! నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వమే’ అని భూదేవికి నమస్కరించిన తర్వాతే పాదం భూమిపై మోపే ఆచారం మన పెద్దలది. మన దైనిందిన జీవితమంతా సకల దుష్ట విసర్జనలతో సహా ఈ భూమి మీదే చేస్తాము. కాబట్టే మనకు తిండిని ప్రసాదించే, జీవితాంతం మనలను భరించే ఈ భూమికి క్షమాపణ చెప్పుకొని నెత్తిన కాలు పెట్టుటం కనీస కర్తవ్యం. కాలు తగిలితే సారీ చెప్పుకొనే నాగరికతను చూస్తున్న మనం…భూదేవిని క్షమించమని ప్రార్థనను చేయలేమా?

నిద్రలేవగానే శుభదర్శనం చేయాలని సదాచారం చెబుతోంది. నిద్రలేవగానే శ్రోతియుని , గుణ సంపన్నుని, గోవును, అగ్నిని, సోమయాజిలాంటి వారినే చూడాలని, పాపిష్ఠివారిని, అమంగళకర వ్యక్తులను చూడతగనది అంటారు. ఇలా అనడంలో నిద్రలేచిన వెంటనే చేసే దర్శనం ఆరోజు జీవితంపై ప్రభావం చూపుతుందని ప్రజల విశ్వాసం. అందుకే ఎప్పుడైన ప్రమాదం జరగగానే ఛీ..నిద్రలేస్తూ ఎవరి మొగం చూచానో అనుకోవడం మనం చూస్తాం. చాలా మంది నిద్రలేవగానే అరచేతిని చూచుకొంటారు.

కరాగ్రే వసతే లక్ష్మీ-కరమధ్యే సరస్వతీ! కరమూలే స్థితో బ్రహ్మా- ప్రభాతే కరదర్శనం!! అనేది ఆర్ష వ్యాక్యం.

అరచేతి అగ్రభాగం లక్ష్మీస్థానం. మధ్యభాగం సరస్వతి స్థానం. కరమూల బ్రహ్మ లేదా గోవింద స్థానం. కాబట్టే ఉదయం లేవగానే అరచేతిని చూచుకొంటారు. అరచేతిలో శ్రీరామ వ్రాసి కన్నుల కద్దుకొవడం కొందరు చేస్తారు. నిద్రలేవనగానే ఏ విధంగానైన దర్శనం అయ్యేటట్లు చేసుకోవడం మంచిది.

దైవ ప్రార్థన తర్వాత ముఖం, కాళ్లు చేతులు కడుగుకొని పుక్కిలించి ఉమ్మివేయాలి. అనంతరం జలపానం చేయాలి. ప్రాతఃకాల జలపానం ఎంతో ఆరోగ్యప్రదం. రాత్రి నిద్రకు ముందు రాగి, వెండి , కంచు లేదంటే మట్టి పాత్రలో మంచినీరుంచి ప్రాతః కాలంలో త్రాగితే సకల దోషాలు పోయి ఆరోగ్యం చేకూరుతుంది. వాత పిత్తశ్లేష్ఠు, ప్రకోపాలు తొలగటమేకాక హృద్రోగం, కాస, శ్యాస, క్షయ, అస్మరీ..మూత్రంలో రాళ్లు, గ్రహణీ….రక్త విరేచనాలు, అతిసార, అతి మూత్ర మొదలైన ఎన్నో వ్యాధులు క్రమంగా ఉపశమిస్తాయి. అంతేకాక సంతోషం, బలం, ఆయుర్వృద్ధి, వీర్యవృద్ధి,ఆరోగ్యం కలుగుతాయి. జలపానం చేశాక కొంత సేపు నడవడం మలబద్దకాన్ని పొగడుతుంది.

బ్రాహ్మీ ముహూర్తంలో ప్రాతః స్మరణ కర్త్యవంగా మన పెద్దలు చెప్పారు. ప్రాతఃస్మరణతో పుణ్యము, సంస్కారం, చేకూరుతాయి. ఇష్టదైవాలతోపాటు, మహనీయులను, పుణ్యతీర్థాలను స్మరించటం, మహనీయుల జీవిత విశిష్టతను తెలుసుకొని ఆచరణలో వారిని ఆదర్శంగా స్వీకరించడం జీవితానికి ధన్యత.

- Whatsapp sekarana

Quote of the day

No one saves us but ourselves. No one can and no one may. We ourselves must walk the path.…

__________Gautam Buddha