నాడి పరిజ్ఞానము
నాడి పరిజ్ఞానము - నాడిని పట్టుకొని రోగనిర్ణయం చేయుట
శుక్లశోణిత సంయోగముచే జనించిన దేహము నందు చర్మము , రక్తము , మాంసం కొవ్వు , ఎముకలు , నరములు గూడుకట్టుకుని ఉన్నవి. మరియు మానవశరీరం నందు 70 వేల నరములు ఉన్నవని శరీరశాస్త్రం తెలుపుతుంది. ఈ నరములు శరీరమున గల లక్షణములను తనచలనములు వలన నిరూపించుచున్నవి ఈ నరముల చలనములే నాడీపరిజ్ఞానముకు మూలాధారములు అయి ఉన్నవి.
శరీరమున గల నాడులు 5 నామములతో పిలవబడుచున్నవి . అవి
* భూతనాడి .
* వాతనాడి .
* పిత్తనాడి .
* శ్లేష్మనాడి .
* గురునాడి .
ఆహారవిహారాదుల యందు మానవుడు సరైన మార్గమము అనుసరించక పోవడం వలెనే రోగములు ఉద్భవించుచున్నవి. ఈ నాడుల మూలము వలనే రోగనిర్ధారణ చేయవచ్చు.
ఏ రోగము నందు అయినను వాత,పిత్త,శ్లేష్మములు ప్రకోపించి రోగ హేతువులు అగుచున్నవి. రోగి యొక్క మణికట్టు నందు 3 అంగుళాల ప్రదేశము నందు నాడి చలించును. పురుషులకు కుడిచేతి మణికట్టు , ఆడవారికి ఎడమచేతి మణికట్టు నందు పరీక్షించవలెను. బొటనవ్రేలి నందు భూతనాడి , చూపుడువ్రేలు నందు వాతనాడి , మధ్యవ్రేలు నందు పిత్తనాడి , ఉంగరపు వ్రేలు నందు శ్లేష్మనాడి , చిటికిన వ్రేలు నందు గురునాడి చలించును. వాతపిత్తశ్లేష్మనాడులు యే రోగనిర్ణయముకు ఆధారభూతములు . వాతనాడి పామునడక వలే మెలికలుగా జలగ గమనము వలే సంచరించుచుండును. పిత్తనాడి నెమలి వలే హంసవలే చలించుచుండును. శ్లేష్మనాడి ఊరపిచ్చుక వలే , పావురమువలే ,కోడివలే నడుచుచుండును. వాతనాడికి బ్రహ్మయు , పిత్తనాడికి విష్ణువుయు , శ్లేష్మనాడికి పరమేశ్వరుడు అధి దేవతలు .
ఒక్కోసారి రోగలక్షణములు ను బట్టికూడా వైద్యం చేయవచ్చు . శరీరం నందు వేడిమి అధికం అయినకొలది చురుకుదనం అధికరించును .అదే శరీరం చల్లదనం అయినచో నాడి చురుకుదనం క్షీణించును. నాడి యొక్క గమనం అధికం అయ్యి వృద్ధినొందునచో గుండె యెక్క కార్యక్రమము చెడుపుచున్నది అని గ్రహించవలెను. ఇది చాలా అనుభవము నందు అలవడును .
నాడి పరీక్షించు విధానం -
వ్యాధిగ్రస్తుని చేతిని పట్టుకొని మెటికలు విరిచి బొటనవేలు ప్రక్కన , మణికట్టు దాటియున్న స్థలమున నాడి పరీక్షించవలెను.
పురుషులకు కుడిచేతిని , స్త్రీలకు ఎడమచేతిని పరీక్షించవలెను. అందులో 3 నాడులు పలుకుచుండును. మొదటి నాడి వాతమును , రెండోవది పిత్తమును , మూడొవది శ్లేష్మమును తెలుపును. ఇందులో యేది ఎక్కువ ఉదృతముగా ఉన్నచో ఆ ధాతువు ఎక్కువ ఉన్నది అని తెలుసుకొనవలెను.
వైద్యుడు గమనించవలసిన ముఖ్యవిధి -
వైద్యుడు వ్యాధిగ్రస్తునకు మందు ఇచ్చుటకు పూర్వము అతని వయస్సు , వృత్తి , వ్యాధి ఎప్పటినుంచి ఉన్నది , శరీరతత్వము , మల,ముత్ర విసర్జన క్రమము , నాడి మొదలగు వాటిని చక్కగా తెలుసుకొని వయస్సును అనుసరించి మందు ఇవ్వవలెను.