దినము ద్వాదశి నేడు - అన్నమయ్య కీర్తన
పెద తిరుమలయ్య తన తండ్రి యెడల అపారమైన భర్తిప్రపత్తులను కనబరిచినాడుఅన్నమాచర్యుల పుణ్య తిథి, ఫాల్గుణ బహుళ ద్వాదశినాడు ఆచార్యునికి భక్ష్యభోజ్యాదులనర్పించి శ్రీలక్ష్మీసమేతుడైన శ్రీ వేంకటేశ్వరునుతో, వైష్ణవ భక్తాగ్రేసరులతో విందులారగించగా విచ్చేయమని తిరుమలయ్య అర్ధ్రత తో పాడుకున్న పాటే అతని పితృభక్తికి అక్షర తార్కాణం.
దినము ద్వాదశి నేడు తీర్థదివసము నీకు
జనకు(డ అన్నమాచార్యు(డ విచ్చేయవే
అనంతగరుడ ముఖ్యులైన సూరిజనులతో
ఘననారదాది భాగవతులతో
దనుజ మర్దనుండైన దైవశిఖామణితోడ
వెనుకొని యారగించ విచ్చేయవే
వైకుంఠాన నుండి యాళువారలలోపల నుండి
లోకపు నిత్యముక్తులలోన నుండి
శ్రీకాంతతోడ నున్న శ్రీవేంకటేశు(గూడి
యీకడ నారగించ నింటికి విచ్చేయవే
సంకీర్తనముతోడ సనకాదులెల్ల(బాడ
పొంకపు శ్రీవేంకటాద్రి భూమి నుండి
లంకె శ్రీవేంకటగిరి లక్ష్మీవిభు(డు నీవు
నంకెల మాయీంటి విందు లారగించవే