దివ్యమైన ‘సాకేత రామ’ అనే పేరులో ఉన్న విశేషం
దివ్యమైన ‘సాకేత రామ’ అనే పేరులో ఉన్న విశేషం తెలుసా !
- లక్ష్మి రమణ
దశరథ రాముడు, అయోధ్యా రాముడు, సీతా రాముడు ఇవన్నీ ఆ రామచంద్ర ప్రభువుని కొలుచుకొనే వాళ్లకు ఇష్టమైన పేర్లు. ఏ పేరుతో పిలిచినా ఆ సుగుణాభి రాముడు భక్తులకు ఆనంద ప్రదాయకుడే ! ఒక్క రామా అన్న రెండక్షరాల నామం చాలు జన్మ తరించిపోవడానికి. అందునా సాకేత రామా అని పిలిస్తే మరింత పరామానందంతో జీవితానికి ఏది సార్ధకమో దాన్ని అనుగ్రహిస్తారట ఆ రామచంద్ర ప్రభువు . సాకేత రాముడనే పేరులో ఏమిటా అద్భుతమైన విశేషం ? తెలుసుకుందాం రండి.
మన వేద వాంజ్ఞ్మయంలో సాకేత లోకం అంటే మోక్ష లోకం. వశిష్ట సంహితలో “ రామస్య నామ రూపం చ లీలా ధామ పరాత్పరం” – రాముని నామం, రూపం, లీలలు, ఆయన ధామం అన్నింటికన్నా గొప్ప అయిన వాటికన్నా గొప్ప అని. రాముడే రాముని కన్నా ఉన్నతమైనవాడు. అధర్వణవేదము, తైత్తరీయ అరణ్యకంలో, కొన్ని పురాణాలలో సాకేతపురాన్ని నిత్య అయోధ్య అని స్తుతింపబడి ఉంది. పరంధాముడైన రాముడు దశరధునికి పుట్టగానే భూలోక అయోధ్యకు సాకేతపురం అన్న పేరు ప్రసిద్ధికి ఎక్కింది. శ్రీరాముడు తన అవతారం చాలించినప్పుడు తనతో పాటు అయోధ్యావాసులందరినీ తనతో పాటు మోక్షలోకానికి సరయూనది ప్రవేశం ద్వారా తీసుకుపోతాడు. అందుకు మనం చూస్తున్న ఈ లోక అయోధ్యను సాకేతపురం అని తనను నమ్ముకున్నవారికి మొక్షాన్నిచ్చే రాముని సాకేతరాముడు అని అంటాము.
మహావైకుంఠంలో ప్రధానమైన ప్రదేశంలో నిత్యపార్శదులతో సాకేతపురం అలరారుతుంది అని పద్మపురాణంలో చెప్పబడి ఉంది. అదే పద్మపురాణంలో శివుడు సాకేతలోకం గురించి వివరిస్తూ “దుర్లభం యోగినాం నిత్యం స్థానం సాకేత సంజ్ఞ్యకం ! సుఖపూర్వం లభేత్తత్తు నామ సంరాధనాత్ ప్రియే” అని అంటాడు, వైకుంఠపురానికి పైన పరమయోగులకు కూడా అందని సాకేత పురం కేవలం రామ నామం ద్వారా సుసాధ్యం అని అంటాడు. ప్రాణోత్క్రమణ సమయంలో ఎవరైతే ఈ రామ తారకనామం జపిస్తాడో అతడు సాకేతపురానికి చేరుకుంటాడు ఈశ్వరుడు. కాశీనగరంలో ప్రాణం వదిలే ప్రాణులకు రాముడిన ఈశ్వరుడు తానే వారి చెవిలో ఈ తారకనామం బోధించి వారిని తన నివాసమైన సాకేతపురానికి తీసుకుపోతాడు. రాముడే ఈశ్వరుడు(శివుడు) అన్న విషయంలో సందేహం లేదు. అయోధ్యనే వేదం ఘోషిస్తున్న ఆ వేద పురుషుని పరమ పవిత్ర ప్రదేశం.
సదాశివ సంహిత లోకాలు:
మనకు తెలిసిన ఈ భౌతిక చతుర్దశభువనాల (14లోకాల ) పైన మనకు అగుపించని ఆధ్యాత్మిక లోకాలు ఉంటాయి. ముందుగా బ్రహ్మ నివాసమైన సత్యలోకం ఉంటుంది. దానిపై కుమారలోకం (సనత్కుమార తదితరులు ఉన్న లోకం). కుమారలోకం పైన దుర్గమ్మ ఉన్న ఉమాలోకం, అటుపై కైలాశం (శివ లోకం), ఆపై మహావిష్ణు లోకం. ఇటువంటి ఎన్నో లోకాల పైన ఉన్నది మహాశంభులోకం ( సర్వ స్వతంత్రుడు, సర్వ శక్తిమంతుడు అయిన సదాశివుడు ఉన్న లోకం ). మహాశంభులోకం పైన వాసుదేవుడు శయనించి ఉన్న మహావైకుంఠలోకం. అటుపై స్వప్రకాశమైన గోలోకం. అక్కడ రాముని అవతారమైన శ్రీకృష్ణుడు రాదాసహితంగా విచ్చేసి ఉంటాడు. గోలోక మధ్యలో నిత్యసత్యమైన సాకేతపురం ఉంటుంది. దానిలో నిత్య యవ్వనుడైన శ్రీరాముడు తన దేవేరి భగవతి సీతాదేవితో ఉంటాడు. అక్కడ మోక్షం పొందిన జీవులు స్వామీ సారూప్య భాగ్యం అనుభవిస్తూ ఉంటారు. ఆ లోకమధ్యలో కల్పవృక్షం కింద కనకపు సింహాసనం మీద శ్రీరామచంద్రమూర్తి లోకాలను అనుగ్రహిస్తూ పాలిస్తూ ఉంటాడు. ఈ సాకేతలోకాన్నే మోక్షలోకం అని, అయోధ్య అని, అపరాజిత అని, అక్షయలోకం అని , పరబ్రహ్మ ఉన్న బ్రహ్మపురి అని కూడా చెప్పబడుతుంది.
స్కాందపురాణంలో అయోధ్య గురించి “ ఆకారం బ్రహ్మ రూపమని (భగవద్గీతలో శ్రీకృష్ణుడు అక్షరాలలో ఆకారం నిర్గుణ పరబ్రహ్మ అయిన తాను అని చెబుతాడు), య కారం సగుణ పరబ్రహ్మ అయిన విష్ణువును సూచిస్తుందని, ధ కారం రుద్ర స్వరూపం అని – త్రిమూర్తులకు కూడా పరబ్రహ్మమైన మహావిష్ణు/సదాశివుని రూపమైన శ్రీరాముడు ఉన్న ప్రదేశం కావున అయోధ్య “ అని చెబుతుంది. “అయోధ్య మథుర మాయ కాశి కాంచి అవంతిక పూరి ద్వారకావతి చైవ సప్తైత మోక్షదాయిక” అని చెప్పదడుతున్న సప్త మోక్షపురాలలో అయోధ్య మొట్టమొదటిది. అటువంటి అయోధ్యలో జన్మించి రామరాజ్యాన్ని స్థాపించి మోక్షాన్ని అనుగ్రహించే రాముడే సాకేతరాముడు. ఆయననే ఎందరో మహానుభావులు తమ కీర్తనలలో సాకేతరామా అని ఆర్తిగా ఆరాధించారు. అటువంటి సాకేతరాముడు మనల్ని సరైన దారిలో పెట్టి మనను అనుగ్రహించాలి అని త్రికరణశుద్ధిగా ప్రార్ధిస్తూ ఆ సాకేతరామ చరణాలను ఆశ్రయిద్దాం.
అనువాదం: కోటి మాధవ్ బాలు చౌదరి