నవమి రోజే ఆ పరంధాముడు అవతరించడానికి కారణం ?
నవమి రోజే ఆ పరంధాముడు , పురుషోత్తముడు అవతరించడానికి కారణం ఏమిటి ?
-సేకరణ
ధర్మ బధ్ధ జీవనానికి ఒక నిలువెత్తు నిర్వచనం గా ,మనిషి ఇలా బ్రతకాలి, అని ఒక ఆదర్శవంతమైన జీవితాన్ని గడిపి మానుష్య జన్మకున్న వైశిష్ట్యాన్ని మనకి ఆవిష్కరించిన మర్యాదా పురుషోత్తముడు శ్రీ రామ చంద్ర మూర్తి. ఆయా శ్రీరాముని జన్మదినోత్సవాన్ని నాటి నుండీ నేటివరకూ అంగరంగ వైభోగంగా జరుపుకోవడమే మహద్భాగ్యం కాదా ! అటువంటి దివ్య సుందర మూర్తి శ్రీరామచంద్రమూర్తి. ఆ దివ్య మానవుడు జన్మించిన చైత్ర శుద్ధ నవమి వచ్చేసింది. అసలు నవమి రోజే ఆ పరంధాముడు , పురుషోత్తముడు అవతరించడానికి కారణం ఏమిటి ?
రామ శబ్దం :
అసలు “రామ” శబ్దం లోనే గొప్పతనం ఉంది .”ఓం నమో నారాయణాయ” అన్న అష్టాక్షరీ మహమంత్రం లోని “రా” బీజాక్షరాన్ని “ఓం నమః శివాయ” అన్న పంచాక్షరీ మహామంత్రం లోని “మ” బీజాక్షరాన్ని తీసుకువచ్చి “రామ” అన్న పేరుని దశరథాత్మజునికి వశిష్టులు పెట్టారు అని అంటారు, “రమయతి ఇతి రామః ” అని ఉక్తి .రామ అన్న మాట తోనే హృదయము రమిస్తుంది అందుకు కాదా “శ్రీ రామ నీ నామమెంతో రుచిరా” అని రామదాసు గారు ఎలుగెత్తి పాడినది. అలాగే రామ అని మనం అనే టప్పుడు ‘రా’ అక్షరం పలికేటప్పుడు నోరు తెరుచుకొని మనలోని పాపములు బయటకు వచ్చి దహింపబడతాయని…”మ” అక్షరం పలికే సమయం లో నోరు మూసుకొని బయట ఉన్న పాపములు లోనికి రాకుండా ఉంటాయని ఆర్యోక్తి.అలాగే “రా” అన్న అక్షరం భక్తులను సంసార సాగరం నుండి రక్షిస్తే ,”మ” భక్తుల మనోభీష్టాలను నెరవేరుస్తుందని పెద్దలైన వారు నిర్వచించారు .
సహస్రనామ తత్తుల్యం:
శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే |
సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే ||
పరమశివుడు పార్వతీ దేవి తో చెప్పిన ఈ శ్లోకం అందరికీ తెలిసినదే ,శ్రీ రామ రామ రామ అని మూదు సార్లు జపిస్తే శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ చేసిన ఫలము వస్తుందనేది ఈ శ్లోక భావం .
అదెలా అంటే కటపయాది సూత్రం ప్రకారం “య” వర్గం లో “రా” రెండవ అక్షరం కాగా “ప” వర్గం లో “మ ” ఐదవ అక్షరం రెండు * ఐదు =పది కదా , దీనిని బట్టి ఒక సారి రామ అంటే పది సంఖ్య కు సంకేతం .ఇక మూడు సార్లు జపిస్తే 10*10*10 =1000 కి సమానమవుతుంది . అందుకే పరమశివుడు అలా నిర్వచించాడు అని.
శ్రీ రామ నవమి:
ఇహ స్వామి జన్మించినది నవమి నాడు ,ఇన్ని తిథులు ఉండగా స్వామి నవమి నాడే ఎందుకు జన్మించాడంటే నవమి పరమేశ్వర తత్వాన్ని సూచిస్తుంది కనుక , పెద్దలు 9 సంఖ్య పరమాత్మని సూచిస్తుందంటారు , చూడండి 9 ని తీసుకొని మీరు ఎంత తోనన్నా హెచ్చ వేయండి మీకు మళ్ళీ 9 ఏ వస్తుంది.
9*1=9
9*2=18 ——– 8+1 =9
9*3=27 ——– 2+7=9
9*4=36 ——– 3+6=9
9*5=45 ——– 4+5=9
ఇలా మీరు ఎంతతో అన్నా హెచ్చ వేయండి మీకు తొమ్మిదే వస్తుంది , ఇది పరమాత్మ తత్వానికి చిహ్నం ఆయన ఎన్ని రూపాలలో ఉన్నా ఎన్ని అవతారములు ఎత్తినా ఎన్ని పేర్లు పెట్టుకున్నా అసలుతత్వము ఒక్కటే అది తనని తాను ఎన్ని విధాలుగా సృజించుకున్నా అది అలాగే ఉంటుంది. ఇది నవమి నాడు ఆయన అవతరించడం వెనుక ఉన్న రహస్యం.
ఈవిధం గా అవతరించి నరుడి గానే చరించి, సత్య ధర్మాలను పట్టుకొని , పితృ భక్తి, ఏకపత్నీవ్రతము ,భ్రాత్రుప్రేమ ,కర్తవ్య నిష్ట వంటి సద్గుణములను సొదాహరణము గా చూపించిన ఆ శ్రీరామ చంద్ర ప్రభువు యొక్క పాదపద్మములకు సాంజలి బంధకముగా నమస్కరిస్తూ ఆ ప్రభువు యొక్క కృప మనపై వర్షించాలని కోరుకుంటూ ఈ శ్రీ రామ నవమి నాడు ఆయనని సుతిస్తూ మన జీవితాలని పండిచుకుందాం.
మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే
చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం
స్వస్తి .