Online Puja Services

శ్రీ సీతారాముల కళ్యాణం చూతము రారండి !

3.17.79.188

శ్రీ సీతారాముల కళ్యాణం చూతము రారండి !
లక్ష్మీ రమణ 

సీతారాములు ఆదర్శ మూర్తులు. నరుడైన దేవుడు , భువిజతో కలిసి, భువి పై ఎలా జీవించాలో తెలియజెప్పాడు. వైకుంఠన్ని వీడి, భూలోకం చేరి, రాముడై, సుగుణాభిసోముడై, సీతమ్మతో కలిసి, మానవ జీవికకు మార్గనిర్దేశనం చేశాడు.  విష్ణుమూర్తి ధరించిన దశావతారాలలో అటువంటి సుసంపన్నమైన సంపూర్ణ  మానవ అవతారం రామావతారం. మానవజాతిని తీర్చిదిద్ది, ధార్మిక జీవనం ఎంత గొప్పదో, తన ధర్మ ప్రవర్తన ద్వారా నిరూపించాడు .  రామకథ వింటే మనసు ఉప్పొంగుతుంది. రాముల వారిని తలుచుకుంటే తనువు పులకరిస్తుంది. అందుకే 'శ్రీరామ అని రాయకుండా ఏ కార్యమూ సాగదు . శ్రీరామరక్ష పెట్టకుండా బిడ్డకు లాలపూర్తికాదు. ఏ కష్టమొచ్చినా, ఆపదోచ్చినా  ముందు రామా అంటూ ఆయన్నే తలుచుకొంటాం . ఇలా మన నిత్య జీవితంతో ముడిపడిన దేముడు రాముడు. అందుకే ఆయన జన్మతిథి నవమి నాడు జరిగే  కల్యాణం కమనీయం, జగదానందకారకం.

సీతారాముల   కల్యాణం తిలకించేందుకు దేవతలు, మునులు కూడా వళ్ళంతా కళ్ళు చేసుకొని ఎదురు చూస్తుంటారట.  అటువంటి జగద్కళ్యాణకరుని పేళ్ళి  వేడుకలు చేయగలిగిన మన భాగ్యం యెంత ఉత్కృష్టమైనదో కదా ! జానకీ వల్లభుడు జన్మించిన/  చైత్రమాస/ పునర్వసు నక్షత్ర యుక్త నవమి నాడు శ్రీరామ జననం, సీతారాముల కళ్యాణం వేడుకలు అంగరంగ వైభవంగా జరుపుకోవడం మన సంప్రదాయం .    

బాసికం కడదామా !

ఆజానుబాహుడు , చేపకు చారెడేసి కళ్ళున్నఅరవింద దళాయతాక్షుడు, ఆడవారు కూడా అసూయ పడేంత సౌందర్యం తో ప్రకాశించేవాడు రాముడు . ఇక మణి బాసికము నుదుటను కట్టి, పారాణిని పాదాలకు బెట్టి, చెంపకు కాటుక చుక్కను బెట్టి , వరుడై వచ్చిన ఇక్ష్వాకకుల సూర్యుడు మరో మరుడు(మన్మధుడు ), మనోహరుడు.

ఆయనకు తగ్గ లావణ్య గుణసీమ సీతమ్మ. అసలే పుత్తడి బొమ్మ. ఆపై సిరి కళ్యాణపు బొట్టును బెట్టి, పట్టు పుట్టములు తీరుగ కట్టి, మల్లెలు జాజులు సిగలో జుట్టి, చెంపను జవ్వాది చుక్కను దిద్ది, పారాణి పాదాలతో నవధువుగా సిగ్గులోలక బోస్తుంటే అమ్మ రూపుని కనించడం ఆకారాలకి సాధ్యమా !

వధూవరులైన సీతారాముల జంటను చూసేందుకు రెండు కళ్ళూ సరిపోతాయా !  ఇంతటి అందం చిందే జంటకు దిష్టి తగుల్తుందని ముందుగానే బాసికం కట్టిస్తారు. అసలు వివాహ అలంకరణలో బాసికం కట్టె  సంప్రదాయంలోని అంతరార్ధం ఇదే నంటారు వేదజ్ఞులు.

అయ్యా ఇక గృహస్థాశ్రమాన్ని స్వీకరించు !

జగత్తుకు తండ్రైన రామయ్యకి  , తల్లి సీతమ్మకి పెళ్ళి చేయడం జగత్తుకు కళ్యాణం కాక మరేమిటీ ! అదిగో ఆ మహత్కార్యానికి అమ్మనీ అయ్యవారిని గృహస్థాశ్రమాన్ని స్వీకరించమని ప్రార్ధించడమే తర్వాతి తంతు . 

అమ్మవారికి యోక్త్ర బంధనం చేశాక, అయ్యవారికి ఉత్తర జంధ్యాలు అలంకరించి, “అయ్యా నీలమేఘశ్యామా ! ఇప్పటివరకూ నీవు ఒంటరి వాడవే  ! ఇప్పుడు జానకీమాత ను వివాహమాడి గృహస్తువు  కాబోతున్నావు . బ్రహ్మచర్యాశ్రమం చాలించి , మా అమ్మ చేయందుకొని ఇక గృహస్థాశ్రమాన్ని స్వీకరించమని” జనకమహారాజు స్థానంలో మనం ప్రార్ధించడం ఎన్ని జన్మలు చేసుకుంటే, సిద్ధినుంచే పుణ్యమో కదా !

కన్యాదానం :

 విశ్వజననిని విశ్వంభరునికి ఇచ్చి వివాహం చేసే శుభసమయంలో  సీతమ్మను కన్యాదానం చేయడానికి, రాములవారి పాదాలు కడిగేందుకు ఆ జనకుడు చేసుకున్న పుణ్యమేమో గానీ, ఇలా ఆయన స్థానంలో మనం చేయగలిగితే, అది ఇక జన్మసార్థక హేతువే కదా !

 వరుణ్ణి సాక్షాత్తు శ్రీమన్నారాయణుని గా భావించి, వధువును శ్రీమహాలక్ష్మిగా భావించి కన్యాదానం చేయడం జరుగుతుంది. అందుకే, మామగారు వయసులో పెద్దవారైనా అల్లుడి కాళ్ళు కడిగి, పాద తీర్ధాన్ని శిరస్సున ధరిస్తాడు. ఇక రాములోరు సాక్షాత్తూ నారాయణుడే ! అయోనిజ సీతమ్మ సాక్షాత్తూ లక్ష్మీ దేవే! ఇక్కడ భావనలకు అతీతమై, భక్తీ మాత్రమె బంధమై మైధిలిని కన్యాదానం చేయగలగడం మోక్షలక్ష్మీ కటాక్షం .

కన్యాదానం చేయడం వల్ల వధువు  తండ్రి వైపు పది తరాలు, తల్లి వైపు పదితరాల వాళ్లు శాశ్వత బ్రహ్మలోకాన్ని పొందుతారని అంటారు. రామాయణంలో జనక మహారాజు 'ఇయం సీతా…. ' అంటూ సీతాదేవిని  రామునికిచ్చి కన్యాదానం చేశాడు. 

జీలకర్రా బెల్లం :

వివాహ శుభ ముహూర్తం రాగానే, మంగళ వాయిద్యాల స్వరంతో , జీలకర్ర బెల్లం కలిపిన మిశ్రమాన్ని సీతారాములు పెట్టుకున్నారు. వారి తరఫున మనమే వాటిని అలకరిస్తుంటే, స్వామి జగత్తుచాలకునిగా మంతో ఆడే బొమ్మలాట స్వరమై రూపుతో మనమాడిన భావన కలుగకూడదు మరి ! జీలకర్రా బెల్లం కలిపి పెట్టడంలో అంతరార్థం చాలా గొప్పదికదా !

  వధూవరులు ఒకరి శక్తి మరొకరిలో ప్రవేశపెట్టుకొనడానికి ఈ జీలకర్రా, బెల్లం ఉపయోగిస్తాయి. దీనినే హస్తమస్తక సంయోగం అంటారు. ఆధునిక సైన్స్  
జీలకర్ర, బెల్లం కలిపితే ధన విద్యుత్ ఉత్పన్నమై వస్తువులను ఆకర్షించే శక్తి కలుగుతుందని  చెబుతోంది. తలపై ఉండే బ్రహ్మరంధ్రంపైన  ఈ మిశ్రమాన్ని ఉంచడం వల్ల అది తెరుచుకుంటుంది. ఒకరి తలపై మరొకరు ఉంచిన చేతుల ద్వారా వారి శక్తి బ్రహ్మరంధ్రంలో ప్రవేశించి, ఆ కిందుగా ఉన్న సహస్రార చక్రం నుండి  మధ్యలో ఉన్న ఆజ్ఞాచక్రం చేరి  ఆకర్షణ కలుగుతుంది. దీనివల్ల అన్యోన్య దాపత్యం సిద్ధిస్తుంది .

మూడుముడులు వేసిన రాములోరు , సిగ్గులమొగ్గ మా సీతమ్మ  :

లోకకళ్యాణం కోసం కళ్యాణ రాముడు మరోసారి జానకీ దేవికి మూడుముళ్ళు వేస్తారు.  ఈ సూత్రబంధనం  స్థూల, సూక్ష్మ, కారణ అనే మూడు శరీరాలకు చేసే ధారణ. మూడు శరీరాలకు మూడు ముళ్లన్నమాట. స్థూలశరీరం ఉన్నా లేకపోయినా ఈ బంధం శాశ్వతం గా నిలవాలని చేసే మంత్రయుక్తమైన నివేదన. ఏకం అయిన పరమాత్మ శ్రీ, పురుషులుగా వేరుపడి, మళ్ళి ఏకమవుతున్న సుముహూర్తం. జగన్నాటక సూత్రధారి  భక్తికి వశుడై, అనుగ్రహ లీలను పండిస్తున్న తరుణం. మంగళవాద్యఘోష మిన్నంటింది. పండిత వేదమంత్రఘోష ఆకాశాన్ని తాకింది.భక్తుల ఉత్సాహం అవధులు దాటింది. ఇక్షాకకుల చంద్రుడు జానకీదేవి మెడను తాళిబొట్టు కట్టాడు.

సీతారాముల తలంబ్రాలు:

ఈ ఘట్టం త్రేతాయుగంలో రామయ్య సీతమ్మను చేపట్టిన నాటినుండి కమనీయ కావ్యమే.  నీలమేఘశ్యాముని చేతిలో నీలాలై భాసించిన ముత్యాల తలంబ్రాలు, జానకీ దేవి తలపై పోయగానే పగడపు కాంతులతో ప్రకాశించాయట. ఆ వింతను చూసి వివాహ వేడుకకు తరలి వచ్చిన వారంతా ముక్కున వేలేసుకోన్నారట. అటువంటి దృశ్యాన్ని మళ్ళీ మరోసారి తన భక్తుల కోసం ఆవిష్కరించడం రాములోరి కటాక్షం . వీక్షించి తరించడం మన సౌభాగ్యం !!

ప్రాలు అంటే బియ్యం. పసుపు కలిపిన బియ్యాన్ని తలపై ఉంచి ఆశీర్వదించడం శుభ సూచకం. వీటినే అక్షతలు అని వ్యవహరిస్తారు. అక్షత అంటే విరిగిపోనిది అని అర్థం. వివాహబంధం విడదీయరాని అనుబంధమై వర్ధిల్లాలనే ఆకాంక్షతో అక్షతలను ఇలా తలంబ్రాలుగా పోసుకోవడం జరుగుతుంది. ఆశీర్వచనంగా పెద్దలు తలపై అక్షతలు వేస్తారు. జగత్తే తానై ఒప్పుతున్న శ్రీసీతా రాముల కన్నా పెద్దలు మరెవరుంటారు! అందుకే, తమ ఆనందం కోసం, లోక కల్యాణం కోసం పిన్నలు చేస్తున్న రామ కల్యానంలో అర్చక స్వాములు తలంబ్రాలను స్వామివారి పాదాలకు అర్పిస్తుంటారు. 

స్వామివారి తలబ్రాలు సర్వశుభాలు కలిగిస్తాయి. వీటిని శిరస్సుపై ధరిస్తే పెళ్లికాని వారికి పెళ్లి అవుతుంది పెళ్లి అయినవారికి సంతానం కలుగుతారు.   విద్యా, ఉద్యోగం, వివావాహం, ఐశ్వర్యం వంటి సౌభాగ్యాలు సిద్ధిస్తాయి. కార్యసిద్ధి కలుగుతుంది. వృత్తి, వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. వ్యవసాయం లాభదాయకమవుతుంది. ఈ ప్రయోజన ఫలాలు  ప్రతి ఒక్కరికి అందాలని కోరుకుందాం . 

వివాహవిందు :

మన భారతీయులంతా వైభవంగా జరుపుకునే  సీతారాముల కల్యాన విందుభోజనం వడపప్పు , పానకమే . అన్నప్రసాదాలెన్నున్నా , ఆరోజు రాములోరి కళ్యాణం తర్వాత స్వీకరించే ఈ రెండు ప్రసాదాల విందు గురించి , వాటి రుచి గురించి తెలియనివారెవ్వరట ! 

కనులనిండా  రామయ్య కళ్యాణ ఘట్టాన్ని నింపుకొని, కడుపునిండా ఆ ప్రసాదాన్ని ఆరగించి మన జన్మలు కూడా ఆ రాముని నామ స్మరణతో సార్థకం చేసుకుందాం ! శుభం . 

Quote of the day

A man is born alone and dies alone; and he experiences the good and bad consequences of his karma alone; and he goes alone to hell or the Supreme abode.…

__________Chanakya