రామనామాన్ని తారకమంత్రం అని ఎందుకంటారో తెలుసా !
రామనామాన్ని తారకమంత్రం అని ఎందుకంటారో తెలుసా !
- లక్ష్మి రమణ
ఓంకార స్వరూపమే తారకబ్రహ్మముగా పట్టాభిషిక్తుడై ఉన్నాడు. పట్టాభిషేకమూర్తిని హృదయంలో ధ్యానిస్తే అది ప్రణవోపాసన, తారకోపాసన. ఓంకారాన్ని విభజిస్తే ఎనిమిది భాగాలు కనపడతాయి. అకార, ఉకార, మకారములు బయటికి వినపడే స్థూల భాగములు. సూక్ష్మభాగములు అయిదు చెప్తున్నారు. బిందు, నాద, కళా, కళాతీత తత్పర. రాముడు తారకబ్రహ్మము. రామమంత్రం తారకం. తారకబ్రహ్మయైన పరమాత్మ రాముడే. ఆయన అంశలే దేవతలై ఆ దేవతలు వానరులై రామచంద్రమూర్తికి సహాయపడ్డారు.
రామాయణంలోని పట్టాభిషేకఘట్టంలో తారక తత్త్వం ప్రతిష్ఠించబడింది. ఇది యజుర్వేదంలో సారసారోపనిషత్తులో ఉన్న గొప్ప రహస్యం. ఈవిధంగా ఓంకారంలో ఎనిమిది భాగాలున్నాయి. ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క దేవత ఉన్నారు. అందుకని ఓంకారం సర్వదేవాత్మకం.
అకారం - అకారాత్ అభవత్ బ్రహ్మ - బ్రహ్మదేవుని తెలియజేస్తుంది. - బ్రహ్మ అంశంతో పుట్టినవాడు జాంబవంతుడు.
ఉకారం - ఇంద్రునీ, సూర్యునీ తెలియజేస్తుంది. ఇంద్రతేజస్సు, సూర్యతేజస్సు రెండుభాగాలుగా వచ్చింది - వాలి, సుగ్రీవ. వాలి ఇంద్రతేజస్సు, సుగ్రీవుడు సూర్యతేజస్సు. సరిగ్గా గమనిస్తే వాలి వధ అయిన తరువాత ఇంద్రుడు తనకిచ్చిన మాల సుగ్రీవుడి మెడలో వేస్తాడు. ఇప్పుడు సుగ్రీవునిలో తనకున్న సూర్యతేజస్సుతో పాటు ఇంద్రతేజస్సు కలిసిపోయింది. ఉకారము సూర్య, ఇంద్ర తేజస్సు అయితే సుగ్రీవుడు ఉకార స్వరూపుడు.
మకారం - రుద్రతేజః - రుద్రస్వరూపం హనుమ.
బిందు - బిందుశ్చక్రరాట్ స్వయం - బిందువు అనగా చక్రము. సుదర్శన చక్రం. అది సుదర్శన స్వరూపుడైన శతృఘ్నుడు.
నాద - శంఖం - భరతుడు
కళ - లక్ష్మణస్వామి.
కళాతీత - భగవంతుని అంశలన్నీ పాలిస్తున్న మూలప్రకృతి - సీతమ్మ.
తత్పర - పరాత్పర తత్త్వం, ఆయనే శ్రీరామచంద్రమూర్తి.
ఓంకారమే పట్టాభిరామమూర్తి . ఓంకారస్తారః - తారకబ్రహ్మమే రాముడు.
వామే భూమిసుతా పురశ్చ హనుమాన్పశ్చాత్సుమిత్రా సుతః
శత్రుఘ్నో భరతశ్చ పార్శ్వదళయోరాఛ్వీయ్యాది కొణేషుచ,
సుగ్రీవశ్చ, విభీషణశ్చ యువరాట్ తారాసుతో జాంబవాన్
మధ్యే నీల సరోజ కోమల రుచిం రామం భజే శ్యామలం!!
-ఉత్తర రామాయణం చెప్తూ పూజ్య గురుదేవులు వాగ్దేవి వరపుత్రులు , సమన్వయ సరస్వతి శ్రీ సామవేదం షణ్ముఖశర్మగారు .