రెండక్షరాల రామనామంలో అంతటి మహత్తు
రెండక్షరాల రామనామంలో అంతటి మహత్తు ఎలా చేరింది ?
- లక్ష్మి రమణ
రామనామం భవతారకం. అందులో లేశమాత్రమైనా సందేహం అక్కర లేదు . పైగా అది శివ, కేశవుల ఏకీకృత స్వరూపాన్ని వ్యక్తం చేసే పరంధామము . అందుకే వాల్మీకికి నారద మహర్షి రామ నామాన్ని ఉపదేశించారు . ఆ రామ నామాన్ని మరా అని తిరగల తిప్పి పఠించినా ఆ పరమాత్మ కటాక్షించారు . వేదాలనన్ని పురాణాలుగా మనకి అందించే గొప్ప భాగ్యాన్ని అనుగ్రహించారు . రమణీయమైన రామకథని యథాతథంగా దర్శనం చేయగలిగిన అనుగ్రహాన్ని ప్రసాదించారు . అత్యంత తేలికైన ఆ రెండక్షరాల రామనామంలో అంతటి మహత్తు ఎలా చేరింది ?
‘ఓ రామ నీనామ శ్రీరామ నీ నామ మేమి రుచిరా
కదళీ కర్జూరాది ఫలముల కధికమౌ
కమ్మనీ నీనామ మేమి రుచిరా
నవరసములకన్న నవనీతములకంటె
అధికమౌ నీ నామ మేమి రుచిరా
పనస జంబూ ద్రాక్ష ఫలరసములకంటె
అధికమౌ నీ నామ మేమి రుచిరా’ అంటారు భక్త రామదాసు .
అంతటి రుచికరమైనది రామనామం . ఆ నామాన్ని తన్మయంతో జపిస్తూ ఉంటె, ఆకలిదప్పులు కూడా మరిచిపోతారు . ఆయన భక్తుడు . దానిని అనుభవించి చెప్పినవాడు . అందువల్ల ఖచ్చితముగా నమ్మి తీరవలసినదే . అయినా సరే, అటువంటి గొప్ప శక్తి , మాధుర్యము అత్యంత సులువుగా పలికే ఒక్క చిన్న రెండక్షరాల నామములో ఎలా ఇమడగలిగింది ? దీనికి సమాధానం మరో సంగీత సరస్వతి చెప్పారు .
ఆయన కూడా రామ భక్తిలో రమించినవారు. నిధులకన్నా రాముని సన్నిధి చాలా సుఖమని గొప్ప వేదాంత సత్యాన్ని ఒకే ఒక్క ముక్కలో చెప్పిన మహనీయులు త్యాగరాజస్వామి వారు .
‘ఎవరని నిర్ణయించిరిరా నిన్ం-
ఎట్లారాధించిరిరా నర వరుల్
శివుడనో మాధవుడనో కమల
భవుడనో పర-బ్రహ్మమనో
శివ మంత్రమునకు ‘మ’ జీవము
మాధవ మంత్రమునకు ‘రా’ జీవముయీ
వివరము తెలిసిన ఘనులకు మ్రొక్కెద
వితరణ గుణ త్యాగరాజ వినుత’
అని రాముని కీర్తిస్తారు. ఎంతటి గొప్ప విశేషాన్ని చెప్పారో చూడండి .
మంత్రములో ఒక జీవాక్షరం ఉంటుంది . జీవాక్షరం అంటే, అది ఆ మంత్రములో ప్రధానమైన అర్థాన్ని / శక్తిని / జీవాన్ని ఇస్తుంది . ఆ అక్షరం ఉన్నంతవరకూ ఆ మంత్రానికి సరైన అర్థం వస్తుంది. అది తీసేస్తే, దాని అర్థం మారిపోయి , అపార్థం వస్తుంది . ఆ విధంగా , ఆ అక్షరముంటేనే అది మంత్రము అవుతోంది.
కేశవుని మంత్రం నమో నారాయణాయ . ఇందులో నారాయణ శబ్దాన్ని చూడండి . నార- అంటే జీవులు, అయణ అంటే దిక్కులు అని అర్థం . అంటే, జీవులకి దిక్కయినవాడు నారాయణుడు . నమశ్శివాయ అంటే, జీవులకి దిక్కయిన పరమాత్ముని ప్రార్ధిస్తున్నాను అని అర్థం . ఇప్పుడు ఇందులో నుండీ ‘రా’ శబ్దాన్ని తొలగిస్తే, నఅయనాయ అవుతుంది . దాని అర్థం దిక్కులు లేనివాడు, లేదా దిక్కులేనివాడని వస్తుంది .
ఇక, శివుని మంత్రం నమశ్శివాయ లో మకారము ప్రధానమైనది . ప్రాణమైనది . శివ శబ్దానికి శుభము అనేకదా అర్థము. నమశ్శివాయ అంటే శుభము కోసము శివుని ప్రార్థిస్తున్నాను అని అర్థము . అందులో మకారాన్ని తొలగిస్తే, న శ్శివాయ అంటే- శుభము కోసము కాదు. అని అర్థం వస్తుంది .
ఇలా తొలగించిన ఆ ప్రాణాక్షరాలని కలిపి చూడండి ఆ శబ్దము రామ అవుతుంది . అందుకే రామ శబ్దము శివ , కేశవ సంబంధమైనది. రామావతారంలో శివుడు - హనుమంతునిగా , కేశవుడు - శ్రీరామునిగా మనకి దర్శనం కూడా ఇస్తారు . కనుక త్రిగుణాలకీ , త్రిమూర్తులకీ అతీతమైనది రామ శబ్దం . అది పరమాత్మ స్వరూపమైనది. అందుకే రామ సేవా తత్పరుడు, రుద్రంశ సంభూతుడు అయిన మారుతి నిత్యమూ రామనామంలో రమిస్తూ ఉంటారు .
అటువంటి రామనామాన్ని మన జీవన సాఫల్యం కోసం ఆశ్రయిద్దాం . ఆ నామాన్ని ఆశ్రయించిన రామదాసుని స్వయంగా రాముడే వచ్చి ఆయన కష్టాల నుండీ ఉద్ధరించారు . త్యాగరాజునీ స్వయంగా ఆదుకున్నారు. తులసీదాసు రామ నామంతోటె తరించారు . ఇలా రామ నామం నమ్మిన వారిని భవసాగరాన్ని దాటించి తరింపజేసింది . శ్రీరామానుగ్రహ సిద్ధిరస్తు !!
శుభం !!