అలా రాములోరు సేదతీరిన ప్రాంతాలే మహా శివక్షేత్రాలయ్యాయి
అలా రాములోరు సేదతీరిన ప్రాంతాలే మహా శివక్షేత్రాలయ్యాయి .
సేకరణ: లక్ష్మి రమణ
రావణ వధ తర్వాత శ్రీరామ చంద్రుడు విభీషణునికి లంకా పట్టాభిషేకం చేశారు . ఆ తర్వాత సీతాలక్ష్మణ సమేతంగా బయలు దేరినా , ఆయన్ని బ్రహ్మ హత్యాపాతకం వెంటాడింది, దానికి ఉపశమనాన్ని వెతుకుతూ , కొన్ని ప్రాంతాలలో ఆగారు . సేద తీరారు . పరమేశ్వరుని అర్చించారు. అలా రామునిచేత ప్రతిష్టించబడిన శివలింగాలు ఇప్పటికీ భక్తులకి కొంగుబంగారమై కోరిన కోర్కెలను తీరుస్తున్నాయి .
రావణ వధ తరువాత సీతారామలక్ష్మణులు పుష్పకంలో అయోధ్యకు బయలు దేరుతూ వందారుమూలై అన్న ప్రాంతంలో కాసేపు ఆగారు. వందారుమూలైలో ఉన్నప్పుడు రాములవారికి అనుమానం తలెత్తింది . రావణుడు బ్రాహ్మణుడు. అతణ్ణి చంపినందుకు తనకు బ్రహ్మహత్యాదోషం చుట్టుకుంటుంది కదా! అన్న సందేహంతో దీనికి పరిష్కారం చెప్పమంటూ పరమేశ్వరుని కోరారు .
అప్పుడు శివుడు ప్రత్యక్షమయ్యి , నాలుగు ప్రాంతాలలో శివలింగాన్ని ప్రతిష్టించి పూజించమని రామునికి సూచన చేశారట . దీంతో రాములోరు లంకలో ‘మానావారి’ అన్న ప్రాంతంలో తొలి శివలింగాన్ని ప్రతిష్ఠించారు. దీన్ని ‘రామలింగ శివుడనే ‘ పేర కొలుస్తారు.
ఆ తరువాత , ‘తిరుకోణేశ్వరం’లో, అక్కడి నుంచి ‘తిరుకేదారేశ్వరం’లో మరో రెండు శివలింగాలను ప్రతిష్ఠించారు. చివరగా భారత భూభాగంలో ఇప్పుడున్న రామేశ్వరంలో మరో శివలింగాన్ని ప్రతిష్ఠించారు.
పుష్పకంపై తిరిగి వెళ్తూ, శ్రీరామచంద్రుడు రామసేతువును పాక్షికంగా ధ్వంసం చేసి వెళ్లారని కూడా ఒక కథనం వ్యాప్తిలో ఉంది . మొత్తం మీద రావణ లంక భారతీయ నాగరికతలోని అనేక కొత్త కోణాలను వెలికి తీస్తున్నది.