Online Puja Services

రాముడు తీర్చిన దరిద్రం

18.189.141.141
ఓ ఊళ్ళోరాముడ్ని కొలిచే వెంకట్రావు అనే భక్తుడు ఉండేవాడు. అయితే అతను బంగారం పట్టినా మట్టయ్యేది. దాంతో దరిద్రాన్ని అనుభవించేవాడు.

ఓ రోజు అతని భార్య అతనికి ఓ సలహా ఇచ్చింది.

"రాముడ్ని మన దరిద్రం తీర్చమని ప్రార్ధించరాదూ? ఆయన మీ కోరిక తప్పక తీరుస్తాడు".

"పిచ్చిదానా! మనకేం కావాలో ఆయనకు తెలీదా? అందుకు నేనాయనకు సూచనలు ఇవ్వలేను" అని అతను ఒప్పుకోలేదు.

ఆ రాత్రి రాముడు అతనికి కలలో కనబడి చెప్పాడు.

"నీ ఇంట్లోని గూట్లో ఆరు రూపాయలు ఉన్నాయి కదా? అవి తీసుకొని రేపు సాయంత్రానికల్లా నువ్వు పెద్ద బజారుకి వెళ్ళు. అక్కడ ఆరు రూపాయలకి నీకు ఇష్టమైంది ఏది కనబడితే అది కొను. నీ దరిద్రం తీరుతుంది."

ఉదయం నిద్రలేవగానే తన భార్యకి ఆ కల గురించి చెప్పి, అతను సైకిలు మీద పెద్ద బజారుకి బయలు దేరాడు. ఓ చోట కోలాటం కర్రలు నచ్చి దాని ధరని అడిగాడు. జత పది రూపాయలు. ఇంకొంచెం ముందుకు సాగాడు, వేలంపాట వేసే ఓ హాల్లో బొమ్మలని వేలం వేస్తున్నట్లు బయట బోర్డుని చూసి లోపలకి వెళ్ళాడు. గోడకి ఓ పెద్ద చిత్రకారుడు గీసిన బొమ్మలు వేలాడుతున్నాయి. వాటిని కొనడానికి ఖరీదైన దుస్తుల్లో డబ్బున్న వాళ్ళు చాలామంది వచ్చారు. అతను వెనక్కి తిరిగిపోతుంటే పిచ్చి గీతాలతో గీసిన ఓ బొమ్మని చూపించి చెప్పారు నిర్వాహకులు.

"దీని పేరు శ్రీ రామచంద్రుడు. దీన్ని గీసింది దీపక్ అనే ఆరేళ్ళ కుర్రాడు. మా పాట అయిదు రూపాయలు."

చిన్న పిల్లవాడు గీసిన ఆ నైపుణ్యం లేని బొమ్మని కొనడానికి ఎవరూ ముందుకు రాలేదు. అసహానంగా పెద్ద చిత్రకారుడి బొమ్మల వేలంపాట మొదలవడం కోసం వారంతా వేచి చూడసాగారు.

"మొదటిసారి అయిదు రూపాయలు....రెండవసారి..అయిదు రూపాయలు...." అది రాముడి బొమ్మ అవడంతో, వెంకట్రావు గట్టిగా 'ఆరు రూపాయలు' అని అన్నాడు.

" ఆరు రూపాయలు, ఒకటోసారి..రెండోసారి..." దాన్ని కొనడానికి అక్కడున్న వారు ఎవరూ ముందుకు రాకపోవడంతో, 'మూడోసారి' అని డబ్బు తీసుకుని ఆ బొమ్మని వేలంపాట నిర్వాహకులు వెంకట్రావుకి ఇచ్చారు. అక్కడున్న వాళ్ళంతా ఆ బొమ్మని కొన్న వెంకట్రావు వంక వింతగా చూసారు.

"వేలంపాట మొత్తం ముగిసింది." అని చెప్పారు నిర్వాహకులు.

'అదేమిటి? ఇంకా గోడకి వేలాడే ఆ అసలు బొమ్మలని వేలం వేయాలిగా?" అడిగారు కొనడానికి వచ్చిన వాళ్ళు.

"ఈ బొమ్మలని గీసిన చిత్రకారుడు అతని వీలునామాలో ఏం రాసాడో వినండి. అకాల మృత్యువువాత పడిన తన కొడుకు గీసిన బొమ్మని మొదటగా అయిదు రూపాయలతో వేలం వేయాలని, దాన్ని ఎవరు కొంటే వారికి తను గీసిన చిత్రాలన్నిటిని ఉచితంగా ఇవ్వాలని రాసాడు. కొడుకు గీసిన అసంపూర్ణ చిత్రానికి తన ప్రేమతో ఎంతో విలువ చేకూర్చాడు.. ఎందుకంటే తండ్రిగా తన కొడుకు గీసిన బొమ్మ మీద అతని ప్రేమ అలాంటిది. కాబట్టి మీరు కోరుకున్న చిత్రాలని మీరు ఇతని నుండి కొనుగోలు చేయండి."
ఎవరైనా దేవుణ్ణి కానీ, దేవుడిచ్చిన మనసుని కానీ నిజంగా ప్రేమించగలిగితే... అతని విలువకు పది ఇంతల విలువను చేకూర్చడానికి, అవి మీకు సహకారం అందించడానికి ఒక తండ్రిగా మీ వెంట ఉంటాయి..ఆ ప్రేమని పొందగలిగిన వాళ్ళు నిజంగా ధన్యులు..


- వాట్సాప్ సేకరణ

Quote of the day

The life ahead can only be glorious if you learn to live in total harmony with the Lord.…

__________Sai Baba