Online Puja Services

శ్రీ రామ పట్టాభిషేకం

3.147.6.176

భరతుడు శిరస్సున అంజలి ఘటించి రాముడితో " మా అమ్మ అయిన కైకేయి ఆనాడు రెండు వరములు అడిగింది. ఇక్ష్వాకు వంశంలో పెద్దవాడిగా పుట్టి రాజ్యం పొందడానికి సమస్త అర్హతలు కలిగి ఉన్న నువ్వు తండ్రిని సత్యమునందు నిలబెట్టడము కోసం రాజ్యాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయావు. నీ పాదుకలని న్యాసముగా ఇచ్చి నన్ను రాజ్యం చెయ్యమన్నావు. నువ్వు నాకు రాజ్యాన్ని ఎలా ఇచ్చావో అలా ఆ రాజ్యాన్ని తీసుకొచ్చి నీ పాదాల దగ్గర పెడుతున్నాను. నీకు ఉన్నదానిని నాకు ఇచ్చి నేను దానిని అనుభవిస్తుంటే చూసి నువ్వు మురిసిపోయావు. ఇవ్వాళ నేను దానిని నీకు ఇచ్చేస్తున్నాను " అన్నాడు.

భరతుడి మాటలకి సంతోషించిన రాముడు తిరిగి రాజ్యాన్ని స్వీకరించడానికి అంగీకరించాడు.

శత్రుఘ్నుడు అక్కడికి వచ్చి " అన్నయ్యా ! క్షుర కర్మ చేసేవారిని తీసుకొచ్చాను. నీ జుట్టు జటలు పట్టేసింది. అందుకని క్షుర కర్మ చేయించుకో " అన్నాడు.

రాముడు " నేను తండ్రిమాట నిలబెట్టడము కోసమని నా అంత నేనుగా అరణ్యవాసమునకు వెళ్ళాను. తండ్రి ఆజ్ఞాపించకపోయినా నాయందున్న ప్రేమ చేత స్వచ్ఛందముగా తనంత తాను దీక్ష స్వీకరించి నా పాదుకలని తీసుకెళ్ళి సింహాసనములో పెట్టి పదునాలుగు సంవత్సరములు రాజ్యమునందు మమకారము లేకుండా పరిపాలించిన భరతుడు ముందు దీక్ష విరమించి స్నానం చేస్తే తప్ప నేను దీక్షని విరమించను " అన్నాడు.

భరతుడు, శత్రుఘ్నుడు, సుగ్రీవుడు, విభీషణుడు క్షుర కర్మ చేయించుకుని మంగళస్నానములు చేశాక రాముడు క్షుర కర్మ చేయించుకుని మంగళ స్నానం చేశాడు. రాముడు అందమైన పట్టుపుట్టములను ధరించి మంచి అంగరాగములను పూసుకొని దివ్యాభరణములను ధరించి బయటకి వచ్చాడు.

తన కొడుకు ఇన్నాళ్ళకి తిరిగొచ్చాడని పొంగిపోయిన కౌసల్యా దేవి సీతమ్మకి అభ్యంగన స్నానం చేయించి మంచి పట్టుపుట్టం కట్టి చక్కగా అలంకరించింది. కౌసల్య, సుమిత్ర, కైకేయల చేత అలంకరింపబడ్డ వానర కాంతలు తొమ్మిది వేల ఏనుగుల్ని ఎక్కారు. దశరథుడు ఎక్కే శత్రుంజయం అనే ఏనుగుని తీసుకొచ్చి దానిమీద సుగ్రీవుడిని ఎక్కించారు. వానరులందరూ కూడా సంతోషముగా అయోధ్యకి బయలుదేరారు. సూర్యమండల సన్నిభమైన రథాన్ని రాముడు ఎక్కాడు. ఆ రథం యొక్క పగ్గములను భరతుడు పట్టుకొని నడిపించాడు. లక్ష్మణుడు నూరు తీగలు కలిగిన తెల్లటి గొడుగుని పట్టాడు. ఒకపక్క శత్రుఘ్నుడు మరొకపక్క విభీషణుడు వింజామర వేస్తున్నారు. రథంలో అయోధ్యకి వెళుతున్న రాముడు కనపడ్డ వాళ్ళందరినీ పలకరించుకుంటూ వెళ్ళాడు.

ప్రతి ఇంటిమీద పతాకాలు ఎగురవేశారు. అన్ని ఇళ్ళముందు రంగవల్లులు వేశారు. సంతోషపడిపోతూ, నాట్యం చేస్తూ అందరూ వెళుతున్నారు. ఆ వెళ్ళేటప్పుడు ముందుగా మంగళ వాయిద్యాలు నడిచాయి. ఆ వెనకాల వేద పండితులు నడిచారు. తరువాత పెద్దలు, వాళ్ళ వెనకాల కన్నె పిల్లలు, కొంతమంది స్త్రీలు పిండివంటలు పట్టుకుని నడిచారు. మార్గమధ్యములో గంధపు నీరు జల్లుకుంటూ వెళ్ళారు. ఆ తరువాత సువాసినులయిన స్త్రీలు చేతులలో పువ్వులు, పసుపు, కుంకుమ పట్టుకుని వెళ్ళారు. వశిష్ఠుడు, జాబాలి, కాశ్యపుడు, గౌతముడు మొదలైన ఋషులందరూ వచ్చారు. అందరూ కలిసి అయోధ్యకి చేరుకున్నారు. ఆ రాత్రికి అయోధ్యలో గడిపాక మరునాడు రాముడి పట్టాభిషేకానికి నాలుగు సముద్ర జలములు, ఐదువందల నదుల జలములను వానరములు తీసుకొచ్చాయి. ఇంద్రుడు నూరు బంగారు పూసలు కలిగిన మాలని రాముడికి బహూకరించాడు.

వానరములు తీసుకుని వచ్చిన ఆ జలములను రాముడి మీద పోసి ఆయనకి పట్టాభిషేకము చేశారు. కిరీటాన్ని తీసుకొచ్చి రాముడి శిరస్సున అలంకారము చేశారు. ఆ సమయంలో రాముడు కొన్ని కోట్ల బంగారు నాణాలు, లక్షల ఆవులు, వేల ఎద్దులు దానం చేశాడు.

రాముడు లక్ష్మణుడితో " లక్ష్మణా! యువరాజ పట్టాభిషేకము చేసుకో " అన్నాడు. లక్ష్మణుడు " అన్నయ్యా ! నాకన్నా పెద్దవాడు భరతుడు. నాకు రాజ్యం వద్దు భరతుడికి ఇవ్వు " అన్నాడు.

యువరాజ పట్టాభిషేకము భరతుడికి జరిగింది.

సుగ్రీవుడు, విభీషణుడు, అంగదుడు మొదలైన వానర వీరులందరికీ బహుమతులు ఇచ్చారు. హనుమంతుడికి తెల్లటి వస్త్రముల ద్వయం, హారములు ఇచ్చారు.

సమయంలో, సీతమ్మ తన మెడలో ఉన్న ఒక హారాన్ని తీసి చేతిలో పట్టుకున్నది. రాముడు సీత వంక చూసి " ఈ హారము ఎవరికి ఇస్తావో తెలుసా! పౌరుషము, బుద్ధి, విక్రమము, తేజస్సు, వీర్యము, పట్టుదల, పాండిత్యము ఎవరిలో ఉన్నాయో అటువంటివారికి ఈ హారాన్ని కానుకగా ఇవ్వు. అన్నిటినీమించి వాడు నీ అయిదోతనానికి కారణము అయ్యి ఉండాలి " అన్నాడు.

సీతమ్మ ఆ హారాన్ని హనుమంతుడికి ఇచ్చింది. అప్పుడాయన ఆ హారాన్ని కన్నులకు అద్దుకొని మెడలో వేసుకున్నాడు.

ఎప్పుడైతే ధర్మాత్ముడైన రాముడు సింహాసనము మీద కూర్చున్నప్పుడు ఎవరినోట విన్నా' రాముడు, రాముడు ' తప్ప వేరొక మాట వినపడలేదు. రాముడు రాజ్యం చేస్తుండగా దొంగల భయం లేదు. శత్రువుల భయం లేదు. నెలకి మూడు వానలు పడుతుండేవి. భూమి సస్యశ్యామలముగా పంటలని ఇచ్చింది. చెట్లన్నీ ఫలపుష్పములతో నిండిపోయి ఉండేవి. చాతుర్వర్ణ ప్రజలు తమ తమ ధర్మముల యందు అనురక్తులై ఉన్నారు. చిన్నవాళ్ళు మరణిస్తే పెద్దవాళ్ళు ప్రేతకార్యం చెయ్యడము రామ రాజ్యంలో లేదు. ఆ రాముడి పరిపాలనలో అందరూ సంతోషముగా ఉండేవారు.

రామాయణం యొక్క ఫలశ్రుతి -

ఎక్కడెక్కడ రామాయణము చెబుతున్నప్పుడు బుద్దిమంతులై, పరమ భక్తితో రామాయణాన్ని ఎవరైతే వింటున్నారో అటువంటివారికి శ్రీ మహావిష్ణువు యొక్క కృప చేత తీరని కోరికలు ఉండవు. ఉద్యోగం చేస్తున్నవారు, వ్యాపారం చేస్తున్నవారు ఆయా రంగములలో రాణిస్తారు. సంతానం లేని రజస్వలలైన స్త్రీలు ఈ రామాయణాన్ని వింటే వాళ్ళకి గొప్ప పుత్రులు పుడతారు


తమ బిడ్డలు వృద్ధిలోకి వస్తుంటే చూసుకొని ఆ తల్లులు ఆనందము పొందుతారు. వివాహము కానివారికి వివాహము జరుగుతుంది. కుటుంబం వృద్ధిలోకి వస్తుంది. వంశము నిలబడుతుంది. మంచి పనులకి డబ్బు వినియోగం అవుతుంది. దూరంగా ఉన్న బంధువులు తొందరలో వచ్చి కలుసుకుంటారు. ఇంటికి మంగళతోరణం కట్టబడుతుంది. ఎన్నాళ్ళనుంచో జరగని శుభకార్యములు జరుగుతాయి. పితృదేవతలు సంతోషిస్తారు.

అందరూ రామాయణాన్ని చదివి ఆనందించండి. ఇంత మంచి రామాయణాన్ని చక్కగా చెప్పిన గురుదేవులు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర రావుగారికి మా పాదాభివందనములు.

సేకరణ 
నాగమణి 

Quote of the day

Emancipation from the bondage of the soil is no freedom for the tree.…

__________Rabindranath Tagore