రాముడొచ్చాడు
రాముడొచ్చాడు
వీధి గదిలో ఆత్రంగా అటూ ఇటూ తిరుగుతూ..హాల్లోని టీవీ వైపు ఆత్రుతగా చూస్తున్నారు సీతారావమ్మ గారు. అప్పటికే ఆవిడ స్నానం చేసి,మడిగట్టుకుని దేవుడి పూజ ముగించేరు.
ఆవిడ ఆత్రుత గమనించిన కోడలు వాణి,నవ్వుకుంటూ లోపలికెళ్ళిపోయింది. అరుగు మీద ఆడుకుంటున్న మనవడు రామాన్నిపిలిచి 'టైము తొమ్మిదిన్నర కావొస్తుందేవిట్రా?' అని అడిగితే 'లేదు మామ్మా..తొమ్మిదింపావు అయ్యింది' అంటూ పెరట్లోకి తుర్రుమన్నాడు.
'ఇంకో పావుగంటే ఉంది..కోడలు టీవీ పెడుతుందో లేదో.. అసలే ఇవ్వాళ సీతా స్వయంవరం కూడా.. పోనీ.నేనే వెళ్లి టీవీ పెట్టమని అడిగితే? ఒద్దులే.. మళ్ళీ ఏదో మాటందంటే బాధపడాలి..
అయినా బాధేముందీ? ఆ రాముణ్ణి చూడ్డం కోసం ఎన్ని మాటలైనా పడొచ్చు'అనుకుంటూ రకరకాల ఆలోచనలు చుట్టేస్తూ ఉంటే 'అత్తయ్యా.. టీవీ పెడుతున్నాను..మీరు రావొచ్చు' అంటూ కోడలు పిలిచింది.హమ్మయ్య అనుకుని వంగిన నడుముతో,పరుగులాంటి నడకతో గబగబా హాల్లోకొచ్చి టీవీ ముందు చేతులు జోడించి, ముడుచుక్కూచున్నారు సీతారావమ్మ గారు.
వాణి ఆ డయనోరా టీవీ కవరు పైకెత్తి,టీవీ పెట్టేసరికి 'రామాయణ్ కీ ప్రస్తుత్ కర్తా కోల్గేట్ పామోలివ్' అంటూఅడ్వర్టైజ్మెంటొస్తూంది. 'ఆ హిందీ ఏమో మీకు రాదు.. అయినా చిన్నపిల్లలా టీవీ చూడాలని ఆత్రుతొకటి' అంటూ వాణి విసుక్కుంటున్నా ఆ మాటలు పట్టనట్లుసీతారావమ్మ గారు రామాయణం చూడటంలో మునిగిపోయేరు.
పిఠాపురం పక్కనే ఉన్నకందరాడలో పుట్టిన సీతారావమ్మ గారికి చిన్నప్పటినుంచి శ్రీరాముడంటే విపరీతమైన భక్తి. ఆవిడ పన్నెండో ఏట తాలుకాఫీసులో పనిచేస్తున్న భమిడిపాటి రామానుజం గారితో వివాహం కుదిరినప్పుడు స్నేహితురాళ్ళు ఒకటే ఏడిపించేరు 'నీ పిచ్చికి తగ్గట్టే మీ ఆయన పేరు కూడా రాముడే' నని.
సన్యాసిరాళ్ళు వీధిలో రామాలయం దగ్గిరే రామానుజం గారిల్లు. సీతారావమ్మ గారు భర్త ఆఫిసుకెళ్ళిన తర్వాత పగలంతా ఇంటి పనులు చేసుకుని, పెరట్లోని పువ్వులు కోసి గుళ్ళోకి మాలలు కట్టడం, పడిపోయిన కొబ్బరి మట్టలు విరగ్గొట్టి వంటచెరుకు చెయ్యడం, రాలిపోయిన బూరుగుకాయల్లోంచి దూది తీసి బొంతలూ, దిళ్ళూ కుట్టడం లాంటి పనులు చేసుకుంటూండంతో గడిపేవారు. సాయంత్రప్పూట ఇంటి దగ్గిరున్న రామాలయానికెళ్ళి ఆ రాముడితో ఆ రోజు జరిగినవన్నీ చెప్పుకునేదావిడ. పురిట్లోనే ఎందరో పిల్లలు పోగా లేకలేక పుట్టిన కొడుకు పురుషోత్తం. వీడి తర్వాత ఇంకొకరు పుడితే మొదట పుట్టిన వాణ్ణి అశ్రద్ధ చేసే ప్రమాదం ఉంది.. మనకొక్కడు చాలన్నారు రామానుజం గారు.
1983లో అనుకుంటా ఎన్టీఆర్ ముఖ్యమంత్రయ్యాడు. వెంటనే గవర్నమెంట్ ఉద్యోగుల రిటైర్మెంట్ యాభై ఐదేళ్లకి తగ్గిస్తూ జి. ఓ ఇచ్చారు . ఆ తర్వాత రోజు కి రామానుజం గారికి యాభై ఐదేళ్ళు నిండుతాయనగా, గుండాగి నూరేళ్ళు నిండిపోయాయి. ఆయన ఉద్యోగం పురుషోత్తం కి వచ్చింది. భర్త పోయిన కొంత కాలానికి కొడుకు పెళ్లి చేసేరు సీతారావమ్మగారు.
అప్పట్నుంచీ ఆవిడ కష్టాలు మొదలయ్యాయి. గదిలోంచి బయటకొస్తే చాలు 'ఏంకావాలత్తయ్యా.. మీ గదిలోంచి బయటికొచ్చేరు? ' అంటూ కోడలడిగేది. ఏంకావాలి అంటే ఏమని చెబుతుంది.. తన పెళ్లైన తర్వాత నుంచీ తిరిగిన ఇల్లు మరి. అదే మధ్యాహ్నం పెరట్లోకి వెళ్లి పని చేసుకుంటూంటే మటుకు ఏమీ అడిగేది కాదా వాణి. రామానుజం గారి ప్రావిడెంట్ ఫండ్ డబ్బులు రాగానే కొడుకు బజారుకెళ్ళి పాతిక వేలెట్టి డయనోరా టీవీ కొనుక్కొచ్చేడు. 'అదే డబ్బుతో నువ్వు ఓ ఇల్లో, స్ధలమో కొనుక్కునుంటే బావుండేది నాయనా' అని ఆవిడనేసరికి కొడుకు, కోడలు వారం రోజుల పాటు మాటలు మానేసేరు.
ప్రతీ నెలాఖరుకీ తల్లికి పట్టుచీర కట్టి పెన్షన్ డబ్బలకోసం రిక్షా లో తీసికెళ్ళేవాడు, పెన్షన్ డబ్బులు తీసుకుని కొడుకు చేతిలో పెట్టిన తర్వాత ఆ వైభోగం తీరిపోయేది.
శ్రీ రామనవమి వచ్చిందంటే ఉదయాన్నే పూజ చేసుకుని, ఆ మడి బట్టలతోనే రేడియో ఎదురుగా కూర్చుని సీతారామకళ్యాణం వ్యాఖ్యానం అంతా వినిగానీ ప్రసాదం తినేది కాదావిడ రెండు మూడు సార్లు అడిగిందావిడ కొడుకుని 'ఒరేయ్.. ఆ భద్రాచలం రాముడి కళ్యాణం చూడాలనుందిరా' అని. 'చూద్దాంలేవే' అంటూ దాటేసేవాడు. ఓరోజు కోడలంది 'ఆయన ఎంత కష్టపడుతున్నారో మీకు తెలీదత్తయ్యా.. ఆయన్ని భద్రాచలం, తిరుపతి అంటూ ఇబ్బంది పెట్టకండి'. ఆ తర్వాత ఇంకెప్పుడూ సీతారావమ్మ గారు భద్రాచలం ప్రసక్తి ఎత్తలేదు. టీవీ లో రామాయణం చూస్తూంటే 'టీవీ మూలంగా కరెంటు వృధా అయిపోతూందని మీ అబ్బాయి బాధ పడుతున్నారు' అనేది వాణి.
దాంతో కోడలు టీవీ పెట్టి, పిలిస్తే చూడ్డం, లేకపోతే ఆ వీధి గదిలో కూర్చుని రాముణ్ణి తల్చుకోవడం. ఆ ఏడాది పురుషోత్తం అడిగాడు 'నీ కోడలు, మనవడు వేసవిలో ఊటీ వెళ్దామని సరదా పడుతున్నారు.. మేము ముగ్గురం వెళ్ళేమనుకో , ఇంట్లోఒక్కదానివీ ఉండగలవా అమ్మా?' 'నిక్షేపంగా ఉంటారు.. మనం ఉంటే ఇబ్బంది గానీ లేకపోతే మహారాణీ లా ఉంటారు అత్తయ్య గారు ' జోకేసాననుకుని కిసుక్కున నవ్వింది వాణి. ' హాయిగా వెళ్లి రండి నాయనా.. నా గురించి మీరు ఇబ్బంది పడక్కరలేదు' అన్నారు సీతారావమ్మ గారు.
పురుషోత్తం వాళ్ళు వెళ్ళిన తర్వాత అర్ధమైందావిడకి తను చేసిన తప్పు. రేడియో కొడుకు గదిలో ఉండిపోయింది.. కోడలు ఆ గదికి తాళం పెట్టుకునెళ్ళిపోయింది. ఎల్లుండి శ్రీ రామనవమి... ఈసారి తన రాముడి కళ్యాణం ఎలా వినాలి? పోనీ పక్కింటికెళ్తే? వద్దులే.. మళ్ళీ వాళ్ళు తన కొడుకు గురించి తప్పుగా అనుకుంటారు.
ఆవిడ లా మధనపడుతూంటే తటాలున వచ్చిందా ఆలోచన. పోనీ భద్రాచలం వెళ్లిపోతే? అవును.. అక్కడికెళ్ళాలే గానీ ఆ రాముడే తనను చూసుకుంటాడు. వెంటనే గబగబా తన ఒత్తుల డబ్బా వెతికిందావిడ.. డబ్బులెంతున్నాయో చూద్దామని. అన్నీ కలిపి ఐదు రూపాయలు దొరికాయావిడకి. ఏం చెయ్యాలో తోచలేదు. ముందుగా బస్టాండుకెళ్ళి కనుక్కుందాం.. టిక్కెట్టు ఎంతవుతుందో.. ఏమైనా తను తన రాముడి కళ్యాణం చూడ్డానికి వెళ్తూంది..తనను తీసుకెళ్ళే బాధ్యత ఆ రాముడిదే అనుకుంది. నాలుగు చీరలు మూట కట్టుకుని, బయటకొచ్చేసి, భర్త కట్టిన ఆ ఇంటికేసోసారి ఆప్యాయంగా చూసి బస్టాండుకి నడుచుకుంటూ వెళ్ళింది.
బస్టాండు లో కనుక్కుంటే చెప్పారు, భద్రాచలానికి మధ్యాహ్నం రెండింటికి బస్సుందని, యాభై రెండు రూపాయలు టిక్కెట్టనీ. ఏంచెయ్యాలో అర్థం కాలేదావిడకి. ఏదైతే అయ్యింది.. ఆ డ్రైవరు కాళ్ళట్టుకునైనా వెళ్ళిపోదామనుకుంది.
రెండూపదవుతూండగా బస్సొచ్చింది. ఆశ్చర్యంగా పెద్ద రద్దీగా లేదు. కొంచెం రద్దీగా ఉండుంటే గుంపులో గోవిందలాగా టిక్కెట్టు కొనడం తప్పించుకోవచ్చు. ఇప్పుడు తప్పదు..ఇంకా డ్రైవరూ, కండక్టర్ల కాళ్ళట్టుకోవల్సిందే. వాళ్ళ కాళ్ళట్టుకుంటాను కానీ వాళ్లు ఒప్పుకునేలా చూడు తండ్రీ అని రాముణ్ణి తల్చుకుంది. బస్సెక్కి ఆఖరి సీటులో కిటికీ పక్కన కూర్చుంది. కాసేపటికి బస్సు బయల్దేరింది. కండక్టర్ తీరిగ్గా అందరి దగ్గిరకీ వెళ్లి టిక్కెట్లు కొడుతున్నాడు. సీతారావమ్మ గారి దగ్గిరకొచ్చి టిక్కెట్టమ్మా అనేసరికి ఆవిడకి నోటమాట రాక ఐదు రూపాయల చిల్లర చూపించి చేతులెత్తి దణ్ణం పెట్టేరు.
కండక్టర్ చిరాగ్గా చూసి 'టిక్కెట్టు డబ్బులివ్వకుండా అలా చేతులెత్తి దణ్ణం పెడితే ఎలాగమ్మా?' అని ఆవిడ కాళ్ళ దగ్గిరున్న చేతిసంచీ తీసుకుని, అందులోనుంచి యాభై నోటూ, ఈవిడ చేతిలోంచి రెండు రూపాయలూ తీసుకుని చేతిలో టిక్కెట్టెట్టి వెళ్ళిపోయేడు. ఆవిడకి మతోయింది.. ఆ సంచీ నిండా డబ్బులు . ఈ సంచీ తనది కాదు.. ఎవరి డబ్బో తనకెందుకు? ఆ డ్రైవరు, కండక్టర్లు ఏవైనా దయ తలిస్తే వెళ్దామనుకుంది కానీ ఇంకొకరి డబ్బుతో కాదు. నిశ్చయించుకుని కండక్టర్ దగ్గిరికెళ్ళి నిజాయితీగా జరిగింది చెప్పి, ఈ సంచీ తనది కాదంది. ఆ కండక్టరు 'భలే వారమ్మా మీరు.. ఇది ఆడాళ్ళ చేతిసంచీ..ప్రస్తుతం ఈ బస్సులో ఉన్న ఆడమనిషి మీరొక్కరే. అలాంటప్పుడు ఇది మీది కాక వేరెవరిదవుతుందీ? ఏవయ్యా.. ఈ సంచీ మీదా?' అని బస్సులో ఉన్న మిగతా పాసింజర్లని అడిగితే వారంతా మాది కాదన్నారు. డ్రైవరు అన్నాడు 'మీదే అయ్యుంటాదమ్మా.. మీరెళ్ళి హాయిగా ఆ సీట్లో పడుక్కోండి.. భద్రాచలం వచ్చిన తర్వాత లేపుతాం'
ఇంకేం చెయ్యలేక వెళ్లి తన సీట్లో రాముణ్ణి తల్చుకుంటూ కూచున్న సీతారావమ్మ గారికి మాగన్నుగా నిద్దరట్టేసింది. తెలతెల వారుతూండగా కండక్టర్ నిద్ర లేపి 'భద్రాచలం వచ్చేసిందండి.. మీ రాముడి కళ్యణానికెళ్ళండి' అనేసరికి అప్పుడే భద్రాచలం వచ్చిందా.. తన రాముడి ఊరికొచ్చేసేనా.. ప్రభూ అంతా నీ దయ అనుకుంటూ మళ్లీ వెళ్లి ఆ డ్రైవరు, కండక్టర్లతో చెప్పింది 'బాబులూ.. ఈ డబ్బులు నిజంగా నావి కావు.. ఎవరివో ఏంటో మీరే
కనుక్కుని ఇచ్చేద్దురూ' 'ఆ డబ్బులు మీవే అయ్యుంటాయమ్మా..మీరెక్కువగా ఆలోచించక మీ రాముడి కళ్యాణం చూసుకోండి' అన్నాడు కండక్టరు. 'ఈ సొమ్ము ఆ రాముడి సొమ్మే అనుకుని హుండీలో వేసేస్తాను.. నన్ను భద్రంగా ఇక్కడికి తీసుకొచ్చిన మీ మేలు ఈ జన్మకి మర్చిపోలేను బాబూ.. మీ పేర్లు? ' అని సీతారావమ్మ గారడిగితే కండక్టరు నవ్వేసి' పెద్ద గొప్ప పేర్లేవీ కాదులెండి.. నా పేరు లక్ష్మణరావు, ఆ డ్రైవరు గారి పేరు రామారావు ' అనేసి ఆ తెల్లవారుజాము చీకట్లో కలిసిపోయారు వాళ్లు.
(వాట్స్ ఆప్ సందేశం)