Online Puja Services

రామ నామ మహిమ

3.133.108.224

రామ నామ మహిమ

పార్వతీదేవి శివునితో సంభాషిస్తూ.. ‘తెలియక చేసినా తెలిసి చేసినారామనామంతో ముక్తి లభిస్తుందన్నది వాస్తవమేనా నాథా’ అని సందేహం వెలిబుచ్చినప్పుడు సదాశివుడు కొందరు కిరాతకుల కథ చెప్పాడు. వాళ్లు తమ జీవన విధానం గురించి..

వనేచరామః వసుచాహరామః
నదీన్తరామః నభయం స్మరామః
ఇతీరయంతో విపినే కిరాతా
ముక్తింగతాః రామపదానుషంగాత్‌

..అని చెప్పేవారట. ‘‘మనం వనంలో తిరిగే వాళ్లం. ధనాన్ని అపహరిస్తాం. నదీనదాలను దాటుతుంటాము. భయం అన్నది మనకు స్మరణకే రాదు’’ అని దీని అర్థం. వారికి తెలియకుండానే ఈ నాలుగు వాక్యాల్లో చివర ‘రామ’ శబ్దం ఉండడంతో రామనామాన్ని అనుసంగమం చేసుకొని వారి మరణానంతరం వారు ముక్తి పొందారట. అనాలోచితంగానే రామ శబ్దం ఇంతటి పుణ్యాన్నిస్తుంది. ఇక తెలిసి రామ చింతన చేస్తే.. ఇంకా చెప్పేదేముంది? ముక్తి లభించడంలో సంశయం అక్కరలేదు. శంకరుల వారి ఈ మాటలకి పార్వతి సంతృప్తి చెందింది. రామ శబ్దంలోని ర, మ అనునవి రెండు బీజాక్షరములు. శ్రీ మహావిష్ణువు అష్టాక్షరీ మంత్రంలోఐదో అక్షరం ‘రా’, శివ పంచాక్షరీ మహామంత్రంలోని రెండో అక్షరం ‘మ’. అలా రామ శబ్దం నిర్మితమైంది. ఐదు, రెండులను గుణిస్తే పది అవుతుంది. పదిని మరో పదితో గుణిస్తే వంద. దాన్ని మరో పదితో గుణిస్తే వెయ్యి. అంటే.. మూడుసార్లు రామనామాన్ని ఉచ్చరిస్తే వెయ్యిసార్లు ఉచ్చరించినట్టే.

శ్రీ రామ రామ రామేతి రమేరామే మనోరమే
సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే.

రామ శబ్దానికి ముందు ఓం ఉచ్ఛరించవలసిన అవసరం లేదు. కారణం రామ శబ్దమే ఓంకారానికి ప్రతీక. రామ శబ్దం ఉచ్చరిస్తే చాలు ఏ జపాలు మంత్రాలూ, తంత్రాలు అక్కరలేదు. రామ శబ్ద పారాయణం విష్ణు సహస్రనామ పారాయణకు సర్వసమానం. అందుకే మనలో చాలామందికి.. ఉత్తరాల పైభాగంలో ‘శ్రీరామ’ అని రాసిన తరువాతనే తదుపరి సమాచారం రాయడం అలవాటు. రామ శబ్దం పలకడానికి శౌచం అశౌచం లేదు. వేళతో నిమిత్తం లేదు.  
ప్రణవ నిలయ మంత్రం శ్రీ ప్రాణ నిర్వాణ మంత్రం
ప్రకృతి పురుష మంత్రం శ్రీ బ్రహ్మ రుద్రేంద్ర మంత్రం
ప్రకలు దురిత రాగద్వేష నిర్నాశమంత్రం
రఘుపతి నిజ మంత్రం శ్రీరామ రామేతి మంత్రం

Quote of the day

The will is not free - it is a phenomenon bound by cause and effect - but there is something behind the will which is free.…

__________Swamy Vivekananda