Online Puja Services

వాలిని రాముడు చంపడం తప్పా?

18.222.220.80
రామాయణంలో వాలిని రాముడు వధించడం తప్పు అని 
చాలామంది విమర్శకులు అంటుంటారు అలాంటివారికి సమాధానము
 
రాముడు తప్పుచేసాడా ? లేదా అసలు ఒక్కసారి రాముడు , వాలి సంభాషణ చూద్దాము
 
శ్రీరాముని వాలి దూషించుట----
రామా! నీవు మహా తేజోవంతుడవు. కాని నీవు చేసిన ఈ నీచమైన పని వలన నీ వంశానికీ, తండ్రికీ అపకీర్తి తెచ్చావు. నేను నీకుగాని, నీ దేశానికి గాని ఏ విధమైన కీడూ చేయలేదు. అయినా న్ను వధిస్తున్నావు. నీవు సౌమ్య మూర్తిగా నటిస్తున్న మాయమయుడివి. ఇంద్రియ లోభాలకు వశుడవయ్యావు. అన్ని దోషాలు నీలో కనబడుతున్నాయి. నీవు క్షుద్రుడవు, మహాపాపివి.
నా చర్మం, గోళ్ళు, రోమాలు, రక్తమాంసాలు నీకు నిరుపయోగం కనుక నన్ను మృగయావినోదం కోసం చంపావనే సాకు కూడా నీకు చెల్లదు. నీ కపటత్వం గ్రహించే నా ఇల్లాలు తార నన్ను ఎన్నో విధాలుగా వారించింది. కాని పోగాలం దాపురించిన నేను ఆమె హితవాక్యాలను పెడచెవినబెట్టాను.
 
నా యెదుటపడి యుద్ధం చేసే లావు నీకు లేదు. మద్యపాన మత్తుడై నిద్రపోయేవాడిని పాము కాటు వేసినట్లుగా చెట్టుమాటునుండి నాపై బాణం వేశావు. ఇందుకు నీకు సిగ్గు కలగడంలేదా! నా సహాయమే కోరి వుంటే క్షణాలమీద రావణుడిని నీ కాళ్ళవద్ద పడవేసి నీ భార్యను నీకు అప్పగించేవాడిని.
 
నేను చావుకు భయపడేవాడిని కాను. సుగ్రీవుడు నా అనంతరం రాజ్యార్హుడే. కాని ఇలా కుట్రతో నన్ను చంపి నా తమ్ముడికి రాజ్యం కట్టబెట్టడం నీకు తగినపని కాదు. నీ చేతలను ఎలా సమర్ధించుకొంటావు? నా గొంతు ఎండుకు పోతోంది. ఈ బాణం నా ప్రాణాలు హరిస్తున్నది. నిస్సత్తువలో ఎక్కువ మాట్లాడలేను. కాని నీ సమాధానాన్ని వినగలను. – అని వాలి అన్నాడు.
 
రాముని సమాధానం :------
 
వాలి పలుకులను ఆలకించి రాముడు శాంతంగా ఇలా అన్నాడు – ఇంద్ర నందనా! నీ సందేహాలు తీర్చడం నా కర్తవ్యం. అందువలన నీ అంత్యకాలం ప్రశాంతంగా ముగియవచ్చును.
 
నేను వేట మిష మీద నిన్ను చంపలేదు కనుక భష్యాభక్ష్య విచికిత్స అనవుసరం. ధర్మ రక్షణార్ధమే నిన్ను చంపాను. ప్రభువైన భరతుని ప్రతినిధులం గనుక మా రాజ్యంలో ధర్మహీనులను దండించే బాధ్యతా, హక్కూ మాకున్నాయి. నీ తమ్ముడు జీవించి ఉండగానే అతని భార్యను నీవు వశం చేసుకొన్నావు. నీ ప్రవర్తనలో దుష్టత్వం ఉన్నది. అందుకు మరణ దండనయే సరైన శిక్ష. కనుకనే మన మధ్య ప్రత్యక్ష వైరం లేకున్నా నిన్ను శిక్షించాను. ధర్మానికి శత్రు మిత్ర తత్వాలుండవని కిష్కింధకు రాజైన నీకు తెలుసు.
ఇక చెట్టుమాటునుండి చంపడం గురించి. నీ మెడలోని కాంచనా మాలా వర ప్రభావాన్ని నేను మన్నించాలి గనుక ఉపాయాంతరంగా కూల్చాను. ధర్మ పరాఙ్ముఖుడైన వధ్యుని వధించడానికి యుద్ధ ధర్మాలు వర్తించవు. ఇక నీవు శిక్షార్హుడవు గనుక నీతో నేను నా కార్యాలు సాధించుకో దగదు. అన్యుల సహాయం పైని ఆధారపడేవాడిని కానని నా చరిత్రే చెబుతుంది. కనుక స్వలాభం కోసం నిన్ను వధించాననుకోవడం అవివేకం.
 
నీ వధకు మరొక అలౌకిక పరమార్ధ కారణం ఉంది. నీవు ఇంద్రుని పుత్రుడవు. సృష్టి కర్త ఆజ్ఞ మేరకు రావణ వధలో వానరులు నాకు సహకరించాలి. కాని నీవు రావణుడి మిత్రుడవయ్యావు. కనుక నీవు నాకు సహాయ పడితే మిత్ర ద్రోహివవుతావు. రావణుడి పక్షాన ఉంటే పితృద్రోహివవుతావు. అటువంటి మహాపాతకాలు నీకు అంటకుండా నిన్ను రక్షించాను. ఇకనైనా నా చేతలో ధర్మాన్ని తెలిసికొని చిత్త క్షోభను వర్జించి శాంతిని పొందు.
 
వాలి చివరి కోరికలు:
 
వాలి ఇలా అన్నాడు– రామా! సర్వజ్ఞుడవైన నీకు బదులు చెప్పగలిగేవాడను కాను. నీ చేతిలో మరణించడం నా పూర్వ జన్మ సుకృతం. గారాబంగా పెరిగిన నా కొడుకు అంగదుని కూడా సుగ్రీవునిలాగానే నీవు రక్షించు. నామీద వున్న ద్వేషంతో సుగ్రీవుడు తారను హింసించకుండా చూడు. నా ప్రేలాపననూ, అపరాధాలనూ మన్నించు.
 
తరువాత వాలి సుగ్రీవుని పిలచి తన మెడలోని కాంచనమాలను అతనికిచ్చాడు. అంగదుడిని స్వంత కొడుకులాగానే చూసుకోమన్నాడు. తార హితోక్తులను అమలు చేయమన్నాడు. రాఘవుల కార్యాలను అలక్ష్యం చేయవద్దన్నాడు.
 
పిన తండ్రిని కూడా తండ్రిని లాగానే గౌరవించమని అంగదునికి చెప్పాడు. దేశ కాలాలు గుర్తించి ప్రభువు పట్ల విధేయుడై ఉండాలన్నాడు. ఎవరితోనూ అతి స్నేహమూ, తీవ్ర వైరమూ మంచివికావన్నాడు. అందరి వద్దా సెలవు తీసికొని, నోరు తెరచియే మరణించాడు.
 
అందరూ గొల్లుమన్నారు. తనను కూడా చంపి భర్త దగ్గరకు పంపమని తార రాముని ప్రాధేయపడింది. సుగ్రీవుడు పశ్చాత్తాపంతో కుమిలి పోయి తాను కూడా మరణిస్తానన్నాడు. అందరినీ ఓదార్చి రాముడు వాలికి అంత్య క్రియలను జరపమన్నాడు. అనంతరం రాముని ఆనతిపై రాజుగా సుగ్రీవుడు, యువరాజుగా అంగదుడు అభిషిక్తులయ్యారు. తన వనవాస నియమం ప్రకారం పదునాలుగు సంవత్సరాలు నగరంలో ప్రవేశించకూడదు గనుక రాముడు కిష్కింధకు వెళ్ళలేదు.
 
- రాజేంద్ర ప్రసాద్ తాళ్లూరి 

Quote of the day

There are only two mistakes one can make along the road to truth; not going all the way, and not starting.…

__________Gautam Buddha