శ్రీ రామ సేతు
శ్రీ రామ సేతు
చూసి రమ్మంటే కాల్చి వచ్చే ఘటం హనుమంతుడు. సీతాదేవిని కనుగొని మహదానందభరితుడై, శ్రీరాముని దర్శింప ఆతురతతో తిరిగి వస్తున్నప్పుడు, 'చూశాను సీతను' అంటూ అందరినీ ఆనందంలో ముంచెత్తాడు.ఆ తరువాత లంకకు వారధి నిర్మించే పని ప్రారంభమైంది. వానరులు ఎంతో శ్రమించి ఒక రకంగా వారధి నిర్మాణం పూర్తిచేశారు. పిదప జాంబవంతుడు రాముని వద్దకు వెళ్ళి, నమస్కరించి, "ప్రభూ! వానర వీరుల సహకారంతో వారధి కట్టడం పూర్తయింది. కాని వారధి వలసినంత వెడల్పుగా లేదు. కనుక మన సైన్యాన్ని వరుసలో నిలబెట్టి ఒకరి తరువాత ఒకరినిగా పంపవలసి వస్తుంది” అని విన్నవించాడు.అది విని రాముడు కించిత్తు కూడా ఆందోళన చెందలేదు. “ఎక్కడ, నాతో రా. వారధిని చూద్దాం” అంటూ ఆయన జాంబవంతుని తోడ్కొని వెళ్ళాడు.
అప్పుడు సముద్రంలో జీవించే అసంఖ్యాక జలచరాలు శ్రీరాముని దర్శించాలనే ఆతురతతో సముద్ర ఉపరితలం మీదకు వచ్చాయి. వాటిలో కొన్ని జలచరాలు కొన్ని మైళ్ళు వెడల్పు గలవిగా కూడా ఉన్నాయి.
వారధిని పరికించగానే శ్రీరాముని దృక్కులలో సంతృప్తి వ్యక్తం కావటం జాంబవంతుడు గమనించకపోలేదు. అయినప్పటికీ అతడు. శ్రీరాముని మహత్వాన్ని గ్రహించలేదు. "ప్రభూ! జలచరాలు మిమ్మల్ని దర్శింప నీటి ఉపరితలం మీదికి వచ్చాయి. అందుకే నీటి ఉపరితలమే కంటికి కానరావడం లేదు. వాటి మీద కాలు పెడితే అవి నీటి అడుక్కి వెళ్ళిపోతాయి. ఇక వానరులు సముద్రంలో మునిగిపోవడమే తరువాయి” అని చెప్పాడు. కాని ఆ జలచరాలో, కనురెప్పలు మూస్తే, ఆ సమయంలో రాముని దర్శనం భాగ్యం కోల్పోతామని కనురెప్పలు ముయ్యకుండా, కదిలితే కనురెప్పలు మూతపడతాయని కదలకుండా, భక్తి పారవశ్యంలో సముద్ర ఉపరితలం మీద ఉన్నవి ఉన్నట్లే ఉండిపోయాయి.
అప్పుడు రాముడు జాంబవంతుడితో, “ఎక్కడ, నువ్వు భావించినట్లే కావాలంటే ఒక పెద్ద బండరాయిని వేసి, జలచరాలు నీటి అడుక్కి పోతాయేమో పరీక్షించి చూడు" అన్నాడు. జాంబవంతునికి అప్పుడే కాస్త అర్థం కాసాగింది. వెంటనే వానర సేనకు ఆవలి తీరానికి ఇక బయలుదేరమని ఆజ్ఞ జారీ చేయబడింది.వానరులలో కొందరు ఆకాశమార్గంలో ఆవలి తీరం చేరుకొన్నారు. మరికొందరు నిర్మించబడిన వారధి మీదుగా వెళ్ళి అవతలి ఒడ్డును చేరుకొన్నారు. తక్కిన వారు జలచరాల మీదుగా నడిచి వెళ్ళి లంకను చేరుకొన్నారు. శ్రీరామునికి వారధి నిర్మింప ఇతరుల సహాయం అవసరమా? అంతే! జాంబవంతునికి సమస్తం అవగతమైపోయింది.దీనినుండి ఏం అర్థం అవుతోంది? ఆకాశ మార్గంలో వెళ్ళిన వారు జ్ఞాన యోగావలంబులు. వారధి మీదనుండి వెళ్ళిన వారు కర్మయోగాన్ని అనుసరిస్తున్న వారు. జలచరాల మీదుగా నడచి వెళ్ళిన వారు భక్తి యోగావలంబులు. భగవంతుని అనుగ్రహం వలన భక్తియోగం ద్వారా వేలాదిమంది అతిసులభంగా ముక్తి అనే తీరం చేరుకొంటున్నారు.