Online Puja Services

కేశవనామాలు ఎంత విశిష్టమైనవో తెలుసా ?

3.139.236.93

ప్రతి పూజలోనూ చెప్పుకొనే కేశవనామాలు ఎంత విశిష్టమైనవో తెలుసా ?  
-సేకరణ 

కేశవ నామాలు ప్రతి రోజూ పూజాసమయంలో చదువుకునేవే . ఆచమనం చేసిన తర్వాత వరుసగా చెప్పుకునే  ఆ 24 నామాలలో ఒక్కొక్కటీ ఒక దివ్య మంత్రం .  సృష్టి రహస్యాన్ని తెలియజేసి , భగవంతుని సర్వ వ్యాపకత్వాన్ని, సర్వజ్ఞతనూ ప్రబోధించే దివ్యజ్ఞానం వాటిలో దాగుంది .  ఆ విశేషాలని తెలుసుకొని ఆ నామాన్ని పలికినప్పుడు భావాంకితమైన మనసు ఆ దివ్యత్వాన్ని సరిగ్గా అనుభవించగలుగుతుంది. కాబట్టి ఇక్కడ ఆ కేశవా నామాల విశేషతని ఇక్కడ తెలుసుకొనే ప్రయత్నం చేద్దాం .  

1. కేశవ:- క = బ్రహ్మ, అ= విష్ణువు, ఈశ= రుద్రుడు. ఈ విధంగా కేశవ శబ్దానికి సృష్టి, స్థితి, లయ కారకుడైన పరబ్రహ్మమని అర్థం . 

2. నారాయణ:- పుట్టి, పోషించబడే  జీవసమూహం = నారం, ఆయనం= ఆశ్రయ స్థానం. ఆ విధంగా సర్వ జీవులకు ఆశ్రయమైన వాడు.

3. మాధవ:- మా అంటే లక్ష్మీ దేవి, ధవ= భర్త.

4. గోవింద:- గోవుల ద్వారా తెలియజేయ బడుతున్నవాడు . గో = కిరణములు, వాక్కులు, వేణువు, భూమి, ఇంద్రియములు, ప్రాణాలు.

5. విష్ణు:- ధర్మ,యజ్ఞాదుల రూపంతో , సూర్యాగ్న్యాది తేజస్సుల రూపంలో, శబ్ద స్వరూపంలో అన్నిటా వ్యాపించినవాడు.

6. మధుసూదన:- మధు- రాక్షసుడిని హరించిన వాడు.

7. త్రివిక్రమ:- మూడు లోకాలు ఆక్రమించిన వాడు.

8. వామనాయ:- వమనం= వెలికి పంపుట. నదులు, జలమును వెలిగ్రక్కినట్లు, సర్వ వ్యాపకుడైన విష్ణువు నుండి సనాతనము గా వివిధ జ్ఞాన మయమైన జగత్కర్మలు ప్రకటింప బడుటచే వామనుడు.

9. శ్రీధర:- అమృతం మాధుర్యాన్ని, చంద్రుడు వెన్నెలను ధరించినట్లు స్వాభావికంగా లక్ష్మిని /శ్రీదేవిని ధరించినవాడు.

10. హృషీకేశ:- హృషీకము= ఇంద్రియములు, ఇంద్రియములకు ఈశుడు.

11. పద్మనాభ:- పద్మమునకు నాభి వంటివాడు. అనంత శక్తులతో, (రేకులు) భూతాలతో ఉన్న విశ్వం యొక్క కేంద్రస్థానం/ శక్తి. పద్మమునకు కర్ణికలా విశ్వానికి పద్మనాభుడు.

12. దామోదర:- దామము (లోకములు) ఉదరమునందు కలవాడు. యశోద చే తాడు కట్టబడిన ఉదరం కలవాడు.

13. సంకర్షణ:- విశ్వాన్ని పట్టి ఉంచు వాడు.

14. వాసుదేవ :-వసించి దీపించు వాడు. అంతటా ఆవరించే ధర్మం కలది.’వాసన’ పూలలోని గంధంలా విశ్వమంతా వ్యాపించిన చైతన్యమే విశ్వమును ప్రచోదనం చేస్తుంది.

15. ప్రద్యుమ్న:- విశేషంగా, ఎడతెగక ప్రకాశించే తేజ స్వరూపుడు.

16. అనిరుద్ధ:- అడ్డగించుటకు సాధ్యం కాని వాడు .

17. పురుషోత్తమ :- హృదయ పురమున శయనించువాడు.(2) విశ్వమెవనిచేత పూర్ణమై (వ్యాప్తమై) ఉన్నదో అతడు పురుషుడు.

18. అధోక్షజ:- అధః = క్రిందకు, అక్షః = దివి. ఈ రెంటికీ నడుమ వ్యాపించిన విరాట్ పురుషుడు. క్రింద ఉన్న కిరణముల ద్వారా మూలమైన దానిని అక్షః – తెలుసుకోవడం.

19. నారసింహ:- శ్రేష్టమైన దివ్యాకారం. నారం( నర) జీవ సమూహం. నారభావం హింసించి పోగొట్టేవాడు. జీవుల (నర) హృదయ గుహలో ఉండే మహా చైతన్యమే సింహం.

20. అచ్యుత:- తానున్న స్థితి నుండి జారని వాడు.జారనివ్వనివాడు. మార్పు, వికారం లేనివాడు.

21. జనార్ధన:- జనులను (పాపఫలములుగా) హింసించు వాడు. జనులచే అభీష్ట సిద్ధులను అర్ధించబడువాడు.

22. ఉపేంద్ర:- ఇంద్రునికి సోదరునిగా ఉన్నవాడు. ఇంద్రునికి (ఉపరి)పైన ఇంద్రుడు.

23. హరి:- అన్నీ లయమయ్యాక, అన్నిటికి ఆధారమైన అధిష్ఠాన చైతన్యమే మిగులుతుంది.

24. శ్రీకృష్ణ:- భక్తుల దుఃఖములను పోగొట్టువాడు.(2) అన్నింటిని తనలోనికి లాగుకునేదే కృష్ణ .నామం, రూపం, గుణం, మహిమ, ఏది తలచినా భక్తుల మనసులు వెంటనే ఆయన లోనికి ఆకర్షితమవుతాయి.

ఈ నామాల తర్వాత  శ్రీకృష్ణ పరబ్రహ్మనే నమః అంటాం కదా ! దీని అంతరార్థం కూడా చెప్పుకుందాం .  భగవంతుని నామాల ద్వారా ఆయన  లీలలు (తత్త్వం) వ్యక్తమవుతాయి.ఇన్ని నామాల ద్వారా తెలియజేసిన తత్త్వం శ్రీకృష్ణునిదిగా తెలుసుకుని, సాక్షాత్ పరబ్రహ్మ అని చెప్పడం. “సచ్చిదానంద స్వరూపుడు” నిర్గుణ, నిరాకార, నిష్క్రియ పరబ్రహ్మ మే ఆ శ్రీకృష్ణ పరమాత్మగా తెలుసుకుని మనసారా స్మరించి, నమస్కరించడం. 

సర్వేజనా సుఖినో భవంతు !! 

శుభం !!

Quote of the day

The weak can never forgive. Forgiveness is the attribute of the strong.…

__________Mahatma Gandhi