ముక్కోటి ఏకాదశి నాడు రావి ఆకులో దీపారాధన చేస్తే,
ముక్కోటి ఏకాదశి నాడు రావి ఆకులో దీపారాధన చేస్తే, సంపద కలుగుతుంది .
- లక్ష్మి రమణ
ఏడాదికి 24 ఏకాదశులు వస్తాయి. సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశినే వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అంటారు. సూర్యుడు ధనుస్సులో ప్రవేశించిన అనంతరం మకర సంక్రమణం వరకు జరిగే 'మార్గం' మధ్య ముక్కోటి ఏకాదశి వస్తుంది. ఈ రోజున వైకుంఠ వాకిళ్లు తెరుచుకొని ఉంటాయని వైష్ణవాలయాలలో గల ఉత్తర ద్వారం వద్ద భక్తులు తెల్లవారుజామునే భగవద్దర్శనార్థం వేచి ఉంటారు. ఈ రోజు మహావిష్ణువు గరుడ వాహనారూఢుడై మూడు కోట్ల దేవతలతో భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనమిస్తాడు కనుక దీనికి ముక్కోటి ఏకాదశి అనే పేరు వచ్చిందంటారు.
ఈ ఒక్క ఏకాదశి మూడు కోట్ల ఏకాదశులతో సమమైన పవిత్రతను సంతరించుకున్నందువల్ల దీన్ని ముక్కోటి ఏకాదశి అంటారని పురాణాలు చెప్తున్నాయి. క్షీర సాగర మధనంలో ముక్కోటి ఏకాదశి నాడే హాలాహలం, అమృతం రెండూ పుట్టాయట. ఈ రోజునే శివుడు హాలాహలం మింగి దేవతలకు అమృతం ఇచ్చారని ఒక విశ్వాసం .
ముక్కోటి ఏకాదశిరోజు తప్పకుండా చేయాల్సినవి ఇవీ :
మహావిష్ణువుని ఉత్తర ద్వారముద్వారా దర్శనం చేసుకోవడం.
ఏకాదశీ ఉపవాసం చేయడం .
రాత్రికి జాగరణ .
మరుసటి రోజు ద్వాదశిలో పారణ .
రావి ఆకులో దీపారాధన, భగవదార్చన .
రావి ఆకులో దీపారాధన చేసే విధానం ఇదీ :
రావి చెట్టు శ్రీ మహా విష్ణువుకి నివాస స్థానం . రావి ఆకుల మీద ప్రమిదలు, లేదా మట్టి కుందులు ఉంచి దీపారాధన చేయాలి . ఇలా చేసేప్పుడు ఆకు కాడ భగవంతుని వైపు, ఆకు చివరి భాగం మనవైపు ఉండేలా చూసుకోవాలి . ఇలా శ్రీ మహావిష్ణువుకు ఏకాదశినాడు దీపారాధన చేయడం వలన మంచి శుభ ఫలితాలు కలుగుతాయని కొందరు పండితులు సూచిస్తున్నారు . ఈ దీపారాధన వలన ఆర్థిక ఇబ్బందుల నుంచి బయట పడొచ్చని చెబుతున్నారు.
ప్రతి రోజూ కూడా ఇలా దీపారాధన చేస్తే, రాహు కేతు దోషాలు తొలగిపోతాయి. శని బాధలు ఉపశమిస్తాయి . అఖండ ఐశ్వర్యం సిద్ధిస్తుంది . సకల దోషాలు కూడా తొలగి పోతాయని చెబుతున్నారు .
#mukkotiekadasi #vaikuntaekadasi
Tags: mukkoti, vaikunta, vaikuntha, ekadasi