అంతలా ఆ పాశురాల్లో ఏ మహిమ దాగుంది ?
అంతలా ఆ పాశురాల్లో ఏ మహిమ దాగుంది ?
- లక్ష్మీరమణ
గోదాదేవి అర్చన, గోదాదేవి పాశురాలతో గోవిందుని అర్చన ధనుర్మాసంలో జరుగుతూ ఉంటుంది . తిరుమలలో వేంకటేశ్వరునికి కూడా మేలుకొలుపులు సుప్రభాతంతో జరగకుండా, ఆ గోదామాత రచించిన పాశురాలతోటే జరుగుతూ ఉంటాయి. పాశురాలు తమిళంలో ఉంటాయి . మొత్తం నెలరోజులపాటు గోవిందుని, అమ్మ రోజుకొక్క పాశురం చొప్పున 30 పాశురాలతో అర్చించింది . చివరికి తన విభునిగా బ్రహ్మాండనాయకుని పొందగలిగింది . అంతలా ఆ పాశురాల్లో ఏ మహిమ దాగుంది ?
ముక్తికి మార్గం మార్గశిరం. అదే మార్గాన్ని అమ్మ పాశురాల్లో బోధిస్తారు. రండి రండి మేల్కొనండి . మనం భగవారాధనకి కెళ్ళాల్సిన వేళయ్యిందని గోపికలందరినీ గోదామాత పిలుస్తూంటారు . ఆమె గోపికలతో కలిసి చేసిన ఆ వ్రతమే తిరుప్పావై లేదా శ్రీవ్రతం .
ఉత్తరాయణం ప్రారంభమైన మకర సంక్రాంతికి ముందు, దక్షిణాయనానికి చివర వచ్చే ధనుర్మాసం సంవత్సరానికి తెల్లవారుజాము లాంటిది. ధనువు అంటే యోగ శాస్త్ర పరిభాషలో వెన్నెముక. ఆ బ్రహ్మ దండాన్ని అనుసరించి ఊర్ధ్వగమి గా పయనించి ధ్యానం ద్వారా పరమాత్మని చేరుకోవడం. అంటే ఇది ఒక యోగ సాధన ధ్యానమే ధనుర్మాస వ్రతం. ప్రకృతి పరమస్వరూపం భూమాత అనుకుంటే, ఆ మాత అవరాతమైన గోదామాత పరమాత్మని చేరుకోవడానికి చూపిన దారి ఈ శ్రీవ్రతం .
ఈ ధనుర్మాస వ్రతాన్ని ఆచరించింది విష్ణు చిత్తుని దత్తపుత్రిక ఆండాళ్. తమిళంలో ‘కోదై’ అనే పేరు పొందిన ఈ తల్లి గోదాదేవిగా ప్రసిద్ధి చెందిన భూమాత అవతారం. ఈ నెల రోజులు గోదాదేవి పాడిన పాటలే 30 పాశురాలుగా తిరుప్పావై దివ్య ప్రబంధంగా ప్రసిద్ధమైనది. ధనుర్మాసాన్ని ఆచరించే 30 రోజులు గోదాదేవి బ్రహ్మీమయ ముహూర్తంలో నిద్ర లేచి, తోటి స్నేహితురాలను నిద్ర లేపుతూ, అందరితో కలిసి స్నానమాడి, కృష్ణ కీర్తనతో, కృష్ణ ధ్యానంతో గడపమని బోధించారు . అలా ముప్పది రోజుల నిరంతర వ్రతంతో గోదాదేవి ఆ గోవిందుని వరునిగా పొందింది .
మార్గశిరమాసంలో ఇక్కడ స్నేహితులను మేల్కొల్పడము అంటే, మనలోని భక్తి భావాలను సాత్విక ప్రవృత్తులను జాగృతం చేసి, ఏకీకృతం చేయడం. వారందరితో కలిసి స్నానమాచరించడము అంటే భగవద్భావనా సంకీర్తనలనే సాగరంలో మన భావాలన్నీ మొనకలు వేయడం.
గోదాదేవి పాశురాలను ఒకసారి పరికిస్తే, ఇలా భగవంతుని ధ్యానంలో జాగృతమైన భావనలన్నీ కలిసి, హృదయాంతరంగ ధామంలో ఉన్న పరమాత్మ చైతన్యాన్ని చేరి తాదాత్మ్యం చెందడం అనే యోగ సాధనా క్రమము, సిద్ధి కనిపిస్తాయి.
ఈ శ్రీ వ్రతాన్ని ఆచరించడం ఎంతో సులభం. చేయవలసిందల్లా, ఉదయాన్నే లేవడం , శ్రీరంగని భక్తిలో మునిగి స్నానం చేయడం , చక్కని తీయటి మనసనే చక్కర పొంగలిని ఆ గోపాలునికి నివేదించడం . అంతే ! యెంత సులభమో ! గోదామాతలాగా పూర్ణ హృదయంతో ఎవరు పిలిచినా మధుర మురళీ రవంతో మువ్వగోపాలుడు పలికి తీరతాడు .
మహావిష్ణువుకు ఎంతో ప్రీతికరమైన ఈ మాసంలో అయ్యవారితో పాటు అమ్మవారు లక్ష్మీదేవికి చేసే పూజలు, ఉపవాసాలతో సకల శుభాలు కలుగుతాయని, సకల శుభాలు కలుగుతాయని చెబుతున్నాయి శాస్త్రాలు .