ధనుర్మాసంలో భూదేవిని, విష్ణుమూర్తితో కలిపి పూజిస్తే,
ధనుర్మాసంలో భూదేవిని, విష్ణుమూర్తితో కలిపి పూజిస్తే, త్వరగా వివాహం అవుతుంది .
- లక్ష్మి రమణ
మార్గశిర పౌర్ణమి తర్వాత పాఢ్యమి నుంచి వైష్ణవులు ధనుర్మాస వ్రతానికి శ్రీకారం చుడతారు. విష్ణుమూర్తికి ఎంతో ప్రీతికరమైన మాసం ఈ ధనుర్మాసం. గోదాదేవి మార్గళి వ్రతం పేరుతో ధనుర్మాసంలో వ్రతాన్ని చేపట్టి నారాయణుని భర్తగా చేపట్టింది . ధనుర్మాసం నెల రోజులు బ్రహ్మ ముహూర్తంలో తిరుప్పావై పారాయణం చేసిన వారు దైవానుగ్రహాన్ని పొందుతారని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. వేదాలు, ఉపనిషత్తుల సారమే ఈ తిరుప్పావై గా హిందూ పురణాల్లో పేర్కొన్నారు. పైగా ఎవరైతే ధనుర్మాస వ్రతాన్ని విధిగా చేస్తారో వారికి చక్కని వరునితో త్వరగా వివాహం జరుగుతుందట .
మధుసూధనుని పూజ :
సూర్యుడు ధనుస్సంక్రమణ చేసిన రోజున నదీ స్నానాలు, పూజలు, జపాలు చేయడం మంచిది. వైష్ణవ, సూర్యాలయాలను సందర్శించడం కూడా శుభప్రదం. ధనుర్మాసంలో శ్రీ మహా విష్ణువును ‘మధుసూధనుడు’ అనే పేరుతో పూజించి, మొదటి పదిహేను రోజులు చక్కెర పొంగలి లేదా పులగం నైవేద్యంగా సమర్పించాలి. ఆ తర్వాత పదిహేను రోజులు దద్యోజనాన్ని నివేదించాలి. గోదాదేవి మార్గళి వ్రతం పేరుతో విష్ణువును ధనుర్మాసమంతా పూజించింది. రోజూ ఒక కీర్తనతో ఆమె స్వామిని కీర్తించేది. ఈ వ్రతం వల్ల మోక్షం సిద్ధిస్తుంది. ధనుర్మాస వ్రతం గురించి మొదట బ్రహ్మదేవుడు నారద మహర్షికి వివరించినట్లు పురాణ కథనం. ధనుర్మాస వ్రతానికి సంబంధించిన అంశాలు బ్రహ్మాండ, ఆదిత్య పురాణాలు, భాగవతం, నారాయణ సంహితల్లోనూ కనిపిస్తాయి.
తిరుప్పావై:
ధనుర్మాసం అనగానే అందరికీ గుర్తుకు వచ్చేది గోదాదేవి , తిరుప్పావై. సాక్షాత్తు భూదేవి అవతారమైన అండాళ్ రచించిన దివ్య ప్రబంధమే తిరుప్పావై. ద్రవిడ భాషలో తిరు అనగా పవిత్రం, పావై అనగా వ్రతం అని అర్థం. ప్రతిరోజు వైష్ణవాలయాలలో సాధారణంగా చేసే సుప్రభాత సేవకి బదులుగా గోదాదేవి శ్రీరంగనాధుని స్తుతించిన తిరుప్పావై పాశురములతో విష్ణువుని అర్చించటం ఆనవాయితీ. సాక్షాత్తు శ్రీమహావిష్ణువు కొలువై ఉన్న తిరుమలలో కూడా సుప్రభాతం బదులుగా తిరుప్పావై పాశురములతో కలియుగ వెంకటేశ్వరుని అర్చిస్తారు. ధనుర్మాసం చివరి రోజున గోదాదేవి కళ్యాణంతో ఈ తిరుప్పావై పారాయణ ముగుస్తుంది.
మొత్తం 30 పాశురాల్లో మొదటి అయిదు పాశురాలు ఉపోద్ఘాతం- తిరుప్పావై యొక్క ముఖ్యోద్దేశ్యాన్ని తెలియ జేస్తాయి. తరువాతి పది పాశురాల్లో- గోదాదేవి చెలులతో కలిసి పూలను సేకరిస్తూ, పల్లె వాతావరణాన్ని వర్ణించే అంశాలు ఉంటాయి. తరువాతి ఐదు పాశురాలు గోదాదేవి తన చెలులతో కలిసి చేసిన దేవాలయ సందర్శనను వివరిస్తాయి. భగవంతుడిని నిద్ర మేల్కొలపడానికి ఆండాళ్ సుప్రభాతాన్ని ఆలపిస్తుంది. చివరి తొమ్మిది పాశురాలు భగవద్విభూతిని వర్ణిస్తాయి. చిట్టచివరి పాశురంలో గోదాదేవి, తను విష్ణుచిత్తుని కుమార్తెనని, ఈ ముప్ఫై పాశురాలు తాను రచించి పాడానని, ఎవరైతే వీటిని భక్తితో గానం చేస్తారో వారికి భగవత్కృప తప్పక కలిగి తీరుతుందని ఉద్ఘాటిస్తుంది.
గోదా పరిణయం :
ఆండాళ్ లేదా గోదాదేవి, శ్రీ విష్ణుచిత్తులకు పూలతోటలో లభించిన కుమార్తె. ఈమెను విష్ణుచిత్తుల దంపతులు చాలా అల్లారుముద్దుగా పెంచుకున్నారు. యుక్త వయస్సుకు వచ్చిన తరువాత గోదాదేవి, శ్రీవారు అయిన రంగనాథుడినే తన పతిగా పొందాలని తలచినది. గోదాదేవి, శ్రీ రంగనాథుని వివాహ మాడదలచి రోజుకు ఒక గీతం చోప్పున ముప్పది గీతాలను రచించి స్తుతిస్తుంది.
ఆమె ఆలాపనకి, అందులోని భక్తి భావానికి, ఆ భక్తిలో అల్లిన పూలమాలలు సౌందర్యానికి ముగ్దుడైన రంగనాథుడు , విష్ణుచిత్తుల వారికి, ధనుర్మాసం చివరి రోజు ముందు రాత్రి, కలలో కనిపించి, గోదాదేవిని సాలంకృతంగా కన్యా దానం చేయమని ఆదేశిస్తాడు. అలా ధనుర్మాసం చివరి రోజున, శ్రీ రంగనాథుడు కోరిన విధంగా, గోదాదేవిని సాలంకృతంగా కన్యా దానం చేసి వివాహం జరిపించాడు విష్ణుచిత్తుడు. కళ్యాణం జరిగిన వెంటనే, గోదాదేవి శ్రీ రంగనాథునిలో లీనమై పోతుంది.
విష్ణుమూర్తిని కొలుద్దాం ఇలా :
ధనుర్మాసంలో బ్రహ్మ ముహూర్తంలో అంటే తెల్లవారు జామునే నిద్రలేచి స్నానమాచరించి, శ్రీ మహావిష్ణువును ఆవు పాలు, పెరుగు, నెయ్యి,తేనే, పంచదార, కొబ్బరి నీళ్లు మొదలగు వాటితో అభిషేకం చేసినట్లయితే స్వామి కటాక్షం సిద్ధిస్తుంది .
ధనుర్మాసంలో గొబ్బెలెందుకు ?
ధనుర్మాసంలో, ప్రతి ఇంటి ముందు సాయంత్రము రంగవల్లులు వేసి మరుసటి ఉదయం ఆవు పేడతో చేసిన గొబ్బెమ్మలను రంగవల్లుల మధ్యలో ఉంచి పూజించడం ఆనవాయితీ. పెళ్లీడుకొచ్చిన అమ్మాయిలు తమ ఇంటి ముందు ముగ్గులు, గొబ్బెమ్మలతో పూజ చేయడ వల్ల కోరిన వరుడు లభిస్తాడు. మద్యలో ఉన్న పెద్ద గొబ్బెమ్మను మహాలక్ష్మిగాను చుట్టూ ఉన్న గొబ్బెమ్మలను గోపికలు గాను భావించి, పాటలు పాడుతూ చుట్టూ తిరుగుతూ కొలుస్తారు. అలాగే ధనుర్మాసంలో రోజూ శ్రీకృష్ణుడికి తులసిమాల సమర్పించే స్త్రీలకు నచ్చిన వరుడితో వివాహం జరుగుతుంది. అవివాహితులు, కోరిన వరునీతో వివాహం కావాలనుకున్నవారూ తిరుప్పావై పారాయణం చేయడం వల్ల అవి ఫలిస్తాయని భావిస్తారు.
హరిదాసులు, గుమ్మడి కాయ వంటి గిన్నెను నెత్తిన పెట్టుకొని, హరి సంకీర్తనలతో ప్రతి ఉదయము ఇంటి ముందుకు రావటం ధనుర్మాసం ప్రత్యేకత. హరి సంకీర్తనలతో శ్రీ మహావిష్ణువు కటాక్షం లభిస్తుంది. భూమిని నెత్తిన పెట్టుకొని వచ్చిన సాక్షాత్తు శ్రీమహావిష్ణుగా హరిదాసును భావిస్తారు. భూమాత అనుగ్రహించే పంటలు, ధాన్యాలూ కూడా ఇల్లు చేరేది ఈ ధనుర్మాసంలోనే. అందుకే , ఆ ప్రక్రుతి స్వరూపమైన భూమాతని గోదాదేవిగానూ , పరమాత్మని మహావిష్ణువుగానూ భావించి పూజించి తరించడం .
#dhanurmasam #bhudevi #godadevi #tiruppavai #vishnu
Tags: dhanurmasam, bhudevi, godadevi, tiruppavai, vishnu