Online Puja Services

విష్ణుమూర్తి కేశవుడు ఎలా అయ్యారు ?

18.219.209.144

విష్ణుమూర్తి కేశవుడు ఎలా అయ్యారు ?
లక్ష్మీ రమణ 

విష్ణుపురాణం ప్రకారం విష్ణుమూర్తి కృష్ణావతారాన్ని స్వీకరించే ముందర ఒక నల్లని , ఒక తెల్లని వెంట్రుకని తన స్వరూపంగా ,అవతారంగా ఉద్భవించమని  ఆదేశించారు .  ఆ తెల్లని వెంట్రుక బలరామునిగా, నల్లని వెంట్రుక శ్రీకృష్ణునిగా ఉద్భవించింది . ఇలా కేశములు రెండు అవతారాలు దాల్చాయి కాబట్టి , ఆ విష్ణువుకి కేశవుడు అని పేరొచ్చిందా ? 

కేశములు అవతారములు దాల్చడమేమిటి ? పిచ్చికాకపోతే, అని ఆలోచన . అయినా బలరాముడు ఆదిశేషుని అవతారంకదా అని  మరో వాదన . ఆదిశేషుడు ఎక్కడి నుండీ ఉద్భవించాడు. మళ్ళీ మూలము పరబ్రహ్మము దగ్గరికే వస్తోంది కదా! అందుకే ఆ మూలపదార్థానికి సంబంధించిన కేశమైతేనేమి , అణువైతేనేమి సంకల్పమాత్రము చేత ఒక అవతారమైనదని భావిస్తే తప్పులేదు కదా ! అయినా పరమాత్ముని కేశములంటే కాంతి కిరణములు అని అర్థం. సూర్య చంద్రులకి కిరణములు ప్రసాదించేవాడు పరమాత్మ .  ‘అంశవో ఏ ప్రకాశంతే తే కేశ సంజిగ్నితా’ అనేకదా శ్లోకము. తన కేశములైన కిరాములద్వారా ఈ ప్రపంచము అంతా కూడా నిండి ఉన్నవాడు, ప్రళయ కాలములో బ్రహ్మ , రుద్ర, ఈశ తత్వాలని ఉపసంహరించి, ఒకే  పరమాత్మగా వెలుగొందేవాడూ కేశవుడు . ఇటువంటి తత్వము బ్రహ్మానందములో మరొకటి లేనేలేదు. అంతటి గొప్ప నామము ఈ ‘కేశవ’. కేశవనామాలు అని మనం ప్రతిరోజూ చదువుకొనే 24 నామాలలో మొదటి నామం ఇంతటి గొప్పది .  

ఇక మరో కధానిక ప్రకారం , పరంధాముడు  కేశవుడు అని పేరొందడం వెనుక కేశి అనేగుఱ్ఱం ముఖం కలిగిన  రాక్షసుణ్ణి , కృష్ణుడు వధించిన  ఉదంతం చెబుతున్నారు . నారాయణీయములోని దశమస్కందము లో కేశవా అనే నామముతో నారాయణుని దేవతలు కీర్తించిన ఉదంతాన్ని చెబుతూ ఇలా పేర్కొన్నారు . 

కృష్ణుని చంపడానికి కంసుడు పంపించిన మహా బలశాలి ఈ కేశి అనే రాక్షసుడు. గుర్రం రూపంలో వచ్చి గోపాలుర ఆలమందలని తీవ్రంగా కరిచాడు.  అది చాలదన్నట్టు, గోకులంమీదికీ  విజృంభించాడు . అప్పుడు రక్షకుడై వారిని ఆదుకోవడానికి ఎదురు నిలిచాడు కృష్ణస్వామిగా ఉన్న పరమాత్మ . గుఱ్ఱము ముఖంగా కలిగిన ఆ రాక్షసుని నోటిలోకి చేతిని జొనిపి , ఆ చేతి పరిమాణాన్ని క్షణాల్లో పెద్దగా విస్తరించాడు. ఆ దెబ్బతో ఊపిరాడక కేశి మరణించాడు . 

‘ఆలంభమాత్రేణ పశోః సురాణాం ప్రసాదకే నూత్న ఇవాశ్వమేధే।
కృతే త్వయా హర్షవశాత్ సురేంద్రాస్త్వాం తుష్టువుః కేశవానామధేయమ్॥’

అప్పుడు నీవు చేసిన ఆ వినూత్నమైన అశ్వమేధాన్ని చూసి దేవతలంతా, నిన్ను కేశవా అనే పేరుతొ కీర్తించారు  అని చెబుతుంది . ఈ విధంగా కూడా పరమాత్మ కేశవుడయ్యారు. 

ఇక్కడ వెలుగంటే జ్ఞానమని చెప్పాల్సిన పనిలేదుకదా! అందువలనే జ్ఞానులైనవారు ఆడామగా అనే బేధాన్ని మరిచి జుట్టు పెంచుకోవాలని , కత్తిరించుకోవద్దని చెబుతారు . ‘అహంబ్రహ్మాస్మి’ అని భావించే వాడు , నిజానికి అంతటి గుణ , జ్ఞాన సంపద గలిగినవాని కేశములు కూడా ప్రకాశాన్ని కలిగినవే కదా ! ఆ పరమాత్మకి, తనకీ అభేదమైనస్థితిలో ఆయన కేశములూ తన  కేశములూ వేరుకాదుకదా ! 

Quote of the day

The weak can never forgive. Forgiveness is the attribute of the strong.…

__________Mahatma Gandhi