Online Puja Services

మార్గశిర మాసం పూర్తవకుండానే ధనుర్మాసం ఎలా వచ్చింది

18.191.178.45

మాసం అంటే నెలరోజులు కదా ! మరి మార్గశిర మాసం పూర్తవకుండానే ధనుర్మాసం ఎలా వచ్చింది ?
-లక్ష్మీ రమణ 
 
కాలాన్ని కొలిచేందుకు మనం అనేక కొలమానాల్ని వాడతాము. వాటిలో చాంద్రమాన, సౌరమానాలు ముఖ్యమైనవి. చంద్రుడు ఏ నక్షత్రంలో ఉంటే దానిని బట్టి చాంద్రమానం లెక్కిస్తారు. సూర్యుడు ఒక్కో రాశిని దాటడాన్ని బట్టి సౌరమానాన్ని లెక్కిస్తారు. సూర్యుడు - ఒక  రాశిలోకి ప్రవేశించిన సమయాన్ని సంక్రమణం అంటారు . ఆయా రాశులలో సూర్యుడు సంచరించే కాలమును బట్టి లెక్కించడాన్ని సౌరమానం  అంటారు . ఉదాహరణకు కర్కాటకంలో సూర్యుడు ప్రవేశించే సమయము కర్కాటక సంక్రమణం అన్నమాట. అదే విధముగా కర్కాటక రాశిలో సూర్యుడు సంచరిచే కాలము కర్కాటకమాసము అవుతుంది .ఆ విధంగా సూర్యుడు ధనస్సురాశిలో ప్రవేశించిన సమయం ధనుస్సంక్రమణం. ధనస్సురాశిలో  సూర్యుడుండే కాలము ధనుర్మాసము అవుతుంది . ఆ విధంగా  ఈ ధనుర్మాసం సౌరమానానికి సంబంధించింది. కానీ మనం (తెలుగు వారం) చాంద్రమాన అనుయాయులం. అందుచేత , సాధారణంగా మార్గశిర మాసంలో, డిసెంబరు నెలలో మనకి ఈ ధనుర్మాసారంభం జరుగుతుంది . ఆవిధంగా ఒకనెల మధ్యలోనే మరో నెల ఉన్నట్టుగా అనిపిస్తుంది . 
 
ఈ ధనుర్మాస కాల విశేషం మరొకటి కూడా ఉంది .  మానవులకు ఒక సంవత్సరం (12 నెలలకాలం) దేవతలకు ఒకరోజు కింద లెక్క అంటారు. ఈలెక్కన ఉత్తరాయణం రాత్రి, దక్షిణాయనం పగలుగా భావించబడుతోంది. సూర్యుడు కర్కాటకరాశిలో ప్రవేశించడం కర్కాటక సంక్రమణం అని చెప్పుకున్నాం కదా ! అక్కడనుండి దక్షిణాయన కాలం  ప్రారంభం అవుతుంది . అంటే, ఇది రాత్రి కాలం అన్నమాట . సూర్యుడు మకర సంక్రమణం చేసిననాటి నుండీ అంటే, మకర రాశిలోకి సూర్యుడు ప్రవేశించిన నాటి నుండీ ఉత్తరాయణం. అంటే, పగలుగా భావించాలి . ఇలా భావించినప్పుడు, దక్షిణాయనమునకు చివరిది, ఉత్తరాయణమునకు ముందుది ఐన ధనుర్మాసం ప్రాతఃకాలము అవుతుంది . 
 
 అంటే, బ్రహ్మముహూర్త కాలమన్నమాట. ఇది అత్యంత పవిత్రమైనది. సాత్వికమైన ఆరాధనలకు ప్రధానమైనది. కనుక సత్వగుణ ప్రధానమైన విష్ణువును ఈనెలలో ఆరాధిస్తారు. ఈ నెల విష్ణుమూర్తికి ప్రీతికరమైనది. గోదాదేవి కథ ఈ మాసమునకు సంబంధించినదే. సూర్యుడు ధనూరాశిలో ప్రవేశించడాన్ని ‘పండుగ నెలపట్టడం’ అనికూడా అంటారు. ఈ నెల రోజులూ ఇంటి ముందు పండుగ హడావుడిని గుర్తు చేస్తూ నాలుగు వీధుల చిహ్నంగా ముగ్గును తీర్చిదిద్దుతారు. ఈ మాసం సూర్యమానం అనుసరిస్తూ జరుపుకుంటున్నప్పటికీ, తెలుగువారు చంద్రమానానునూయులు అనేదానికి గుర్తుగా ఈ ముగ్గు మధ్యలో చంద్రుని తీర్చిదిద్దుతారు.
 
ధనుర్మాసమంతా ఉదయం, సాయంత్రం ఇల్లు శుభ్రం చేసి, దీపారాధన చేయడం వల్ల మహాలక్షి కరుణా, కటాక్షాలు సిద్ధిస్తాయి. తిరుమలలో ధనుర్మాసం నెలరోజులు, సుప్రభాతం బదులు తిరుప్పావై గానం చేస్తారు. విష్ణు ఆలయాలల్లో ఉదయం అర్చనలు చేసి నివేదనలు చేసి వాటిని పిల్లలకు పంచుతారు. ఇలా చేయడాన్ని బాలభోగం అంటారు. ఈ మకర, కర్కాటక సంక్రాంతులలో స్నాన, దాన, హోమ, వ్రత పూజలు చేయడం చాలా విశేషమైనది. శుభం 

Quote of the day

If you shut the door to all errors, truth will be shut out.…

__________Rabindranath Tagore