Online Puja Services

అనంత పద్మనాభుని అంగరక్షకుడు ఎవరో తెలుసా ?

3.145.196.150

శ్రీ అనంత పద్మనాభస్వామి వారు ఆదిశేషునిపై పవళించి హాయిగా నిద్రిస్తుంటారు .  నాభిలో ఉన్న బ్రహ్మగారు సృష్టిని రచిస్తుంటారు . అనంతశయుని పాదాలని ఆశ్రయించిన మాత అనంతలక్ష్మి పాటి పాదసేవలో నిమగ్నమై ఉంటుంది . వీళ్లెవరికీ ఆ అనంతునికి నిద్రాభంగం కాకుండా, కాపలా కాసేందుకు బొత్తిగా తీరికేలేదు. అందుకేమరి, సరోవరంలో సేవకి తానూ సిద్హమని వచ్చేశాడో వీరుడు.   

సడిసేయకోగాలి సడిసేయబోకే …. 
సృష్టి రక్షణలోన స్వామి , బడలి శయనించెనే , అంటూ ఆ స్వామిని కాచే అంగరక్షకుడు స్వామి సరస్సులో నే తిరుగాడుతుంటాడు . ఆదిశేషుడేగా ? అంటారేమో , కానీ కాదు , అరివీర భయంకరమైన మకరం . అదేనండీ మొసలి . 

  మొసలి పేరు బాబియా. ఈ మొసలి ఎవరికీ ఎలాంటి హాని చెయ్యదు . పైగా శుద్ధ శాఖాహారి .  రోజూ అక్కడి ఆచార్యవర్యులు  పెట్టె పరమాన్నం మాత్రమే తింటుంది. ఆ సమయాల్లో మాత్రమే బయటికి వస్తుంది . దాదాపు గత 70 ఏళ్లుగా ఈ మొసలి ఇక్కడే ఉంటుందని చెబుతున్నారు స్థానికులు . 

ఇక్కడ మరొక విశేషం ఏంటంటే, ఈ సరస్సులో ఇది మూడవ మొసలి కాగా, ఒక మొసలి చనిపోయిన తరువాత మరొక మొసలి అనేది సరస్సు లో కనిపిస్తుంది. ఇక సరస్సు మధ్యలో ఈ ఆలయం ఉంటుంది . కానీ , చుట్టూ ఈ సరస్సుకి అనుసంధానంగా సముద్రం, నది వంటివి ఏవీ ఉండవు . అయినప్పటికీ ,  ఈ మొసలి ఎటునుండి వస్తుందనేది ఎవరికీ తెలియదు.

అందుకే ,ఇది అనంతుని లీలేనని,  ఆ మకరం స్వయంగా స్వామివారి మరొక రూపమని, అనంతపద్మనాభుడి అంగరక్షకుడని భక్తులు భావిస్తుంటారు . ఈవిధంగా ప్రకృతి అందాల నడుమ, సువిశాలమైన ప్రదేశంలో, ఆశ్చర్యకరమైన లీలావిలాసాలతో కూడిన ఈ అనంతపద్మనాభ స్వామిని దర్శించుకోవడానికి భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు . విచిత్రమైన మొసలిని దర్శించుకొని అచ్చెరువుతో నమస్కరిస్తుంటారు . 

ఎక్కడ ఉంది :

కేరళ రాష్ట్రంలోని  కాసర్ గోడ్ జిల్లా, అనంతపురంలోని   సరోవర మందిరం ఇది. ఈ ఆలయం చుట్టూ సరస్సులతో రెండు ఎకరాల స్థలంలో అద్భుతంగా ఉంటుంది. ఇక్కడికి రోడ్డు మార్గం ద్వారా చేరుకోవచ్చు .  

స్థలపురాణం :

ఈ ఆలయ స్థలపురాణానికి వస్తే, పూర్వం శ్రీమహావిష్ణువు భక్తుడైన బిల్వమంగళుడు ఇక్కడి సరస్సు వద్ద తపస్సు చేసుకుంటూంటాడు . అప్పుడు అతని వద్దకు ఒక బాలుడు వస్తాడు .  ఆ బాలుడికి ఎవరులేరని తెలియడంతో, తన దగ్గరే ఉండమని బాలుడికి ఆశ్రయాన్ని ఇస్తాడు. . అయితే నన్ను ఎప్పుడు ఇబ్బందిపెట్టకూడదు, అవమానించకూడదు, ఒకవేళ నన్ను ఏదైనా అంటే నేను ఇక్కడి నుండి వెళ్లిపోతానని ఆ బాలుడు చెప్పడంతో దానికి బిల్వమంగళుడు సరేనంటాడు . అయితే ఎప్పుడు అల్లరిచేసే ఆ బాలుడి చేష్టలకి ఒకసారి బిల్వమంగళుడు మందలిస్తాడు . దాంతో అలిగిన బాలుడు  ఒక గుహలోకి వెళ్ళిపోతాడు.

బాలున్ని వెతుక్కుంటూ బయల్దేరిన బిల్వమంగళుడు , అతను సరస్సు పక్కన ఉన్న ఒక గుహలోకి వెళ్ళాడని తెలుసుకొని ,  వెతుకుంటూ ఆ గుహలోకి వెళ్తాడు . అలా  ఆ గుహ లోపల వెతుక్కుంటూ వెళ్లిన బిల్వమంగళుడు  తిరువనంతపురం పద్మనాభస్వామి ఆలయానికి చేరుకుంటాడు . గుహలో బాలుడు అదృశ్యం అవ్వడం, గుహ నుండి వెళితే స్వామివారి ఆలయానికి చేరుకోవడంతో ఇన్ని రోజులు తనతో ఉన్నదీ శ్రీమహావిష్ణువే అని గ్రహించి, అక్కడి సరస్సులో ఈ  గుడిని కట్టించాడు. ఆ ఆలయమే అనంతపురం లోని సరోవర మందిరం. 

అద్భుతమైన ఈ అనంత పద్మనాభుని వీలయితే , ఒకసారి తప్పక దర్శించండి. 

-లక్ష్మీ రమణ 

Quote of the day

The weak can never forgive. Forgiveness is the attribute of the strong.…

__________Mahatma Gandhi