Online Puja Services

తొలి ఏకాదశి' - గోపద్మ వ్రతం

18.216.241.11

శాంతాకారం భుజగశయనం, పద్మనాభం, సురేశం
విశ్వాకారం, గగన సదృశం మేఘవర్ణం శుభాంగం
లక్ష్మీకాంతం, కమలనయనం యోగి హృద్ధ్యానగమ్యం
వందే విష్ణుం, భవభయహరం సర్వలోకైక నాధం!!

ఏ మంచిపని ప్రారంభించినా దశమి ఏకాదశులకోసం ఎదురుచూడటం ప్రజలకు అలవాటు. ఏడాది పొడుగునా ఉండే 24 ఏకాదశుల్లో , ఆషాఢ శుక్ల ఏకాదశి తొలి ఏకాదశిగా పరిగణిస్తారు.

ప్రతీసంవత్సరం ఆషాడ శుద్ధ ఏకాదశిని 'తొలిఏకాదశి' గా అంటారు. ఎందుచేతనంటే! పూర్వకాలమందు ఈ తోలిఏకాదశితోనే, సంవత్సర ప్రారంభంగా కూడ చూచేవారట! ఈ రోజును 'శయన ఏకాదశి' అనికూడా పిలుస్తారు ఎందువల్లననగా; శ్రీమహావిష్ణువు ఆరోజునుండి కార్తీకశుద్ధ ఏకాదశి వరకు యోగనిద్రలో ఉంటారని, నాటినుండి శ్రీహరిభక్తులు కామక్రోధాధులు వర్జించి ప్రయాణాలు చేయకుండా ఒకేచోట ఉండి శ్రీహరిని అర్చిస్తూ తిరిగి కార్తీకశుద్ధ ఏకాదశి 'ఉత్థాన ఏకాదశి' వరకు ఆనాలుగు మాసములు చాతుర్మాస్య వ్రతం చేయుట కూడా మన భారతీయ సంప్రదాయములలో ఒకటి. ఆరోజు 'శ్రీహరి' శేషతల్పం పైనుండి మేల్కొంటారు. ఈ చాతుర్మాస్య దీక్షను సన్యాసులు మాత్రమేకాదు. సంసారులు, వయో, లింగబేధము లేకుండా భక్తులందరూ దీనిని ఆచరిస్తూ ఉంటారు.

ఈ 'తొలి ఏకాదశి' నాడు "గోపద్మ వ్రతం" చేయుట ఎంతో విశిష్టమైనదిగా చెప్తారు.

ఈ గోమాత పూర్తిగా విరాట్ పురుషుని రూపంతో పోల్చబడింది. గోవునకు ముఖమునందు వేదాలు, కొమ్మలయందు హరిహరులు, కొమ్ముల చివర ఇంద్రుడు, లలాటమున ఈశ్వరుడు, కర్ణములందు అశ్వనీదేవతలు నేత్రములందు సూర్యచంద్రులు, దంతములయందు గరుడుడు, జిహ్వయందు సరస్వతి, ఉదరమునందు స్కందుడు, రోమకూపములందు ఋషులు, పూర్వభాగమునందు యముడు, పశ్చిమ భాగమునందు అగ్ని, దక్షిణభాగమున వరుణ కుబేరులు, వామభాగము నందు యక్షులు, ముఖమునందు గంధర్వులు, నాసాగ్రమందు పన్నగలు, అపానంబున సరస్వతి, గంగాతీర్థంబులు, గోమయంబున లక్ష్మీ, పాదాగ్రంబున ఖేచరులును, అంబా అంటూ అరచే అరుపులో ప్రజాపతి, స్థనములందు చతుస్సాగరములు ఉన్నట్లుగా వర్ణింపబడెను. కావున గోవును పూజిస్తే! సమస్త దేవతలను పూజించి నట్లేనని, సమస్త తీర్థములలో పుణ్యస్నానంచేసిన పుణ్యఫలం లభిస్తుందని 'గోమాతకు' ఇంత పూజ్యస్తానమిస్తూ, అధర్వణ వేదంలో బ్రహ్మాండపురాణంలో, మాహాభారతంలో, పద్మపురాణంలో ఇలా ఎన్నో గాధలు ఉన్నాయి.

అట్టి గోమాత నివశించే గోశాలను ఈ 'తొలిఏకాదశి' దినమందు మరింతగా శుభ్రముచేసి అలికి ముత్యాల ముగ్గులతో రంగవల్లికలను తీర్చిదిద్ది గోశాల మధ్యభాగమందు బియ్యపు పిండితో ముప్పైమూడు పద్మాల ముగ్గులు పెట్టి, శ్రీమహాలక్ష్మీ సమేత శ్రీమహావిష్ణువు ప్రతిమను ఆపద్మములపైనుంచి, వారిని విధివిధానంగా పూజించి, పద్మానికి ఒక్కొక్క "అప్పడాన్ని" వాటిపై ఉంచి ఆ అప్పడాలను వాయనాలను, దక్షిణ తాంబూలాదులలో బ్రాహ్మణుని సంతుష్టుని గావించి, గోమాతను పూజించువార్కి సకలలాభీష్టములు తప్పక నెరవేరుతాయని చెప్పబడినది. అలా, గోపద్మవ్రతం చెయ్యాలి.

ఇంత పుణ్యప్రదమైన తొలిఏకాదశి పర్వదినం శుభప్రదముగా జరుపుకుందాము.
 

- Surya Prakash Sadanala 


  

Quote of the day

Beauty is truth's smile when she beholds her own face in a perfect mirror.…

__________Rabindranath Tagore