చెన్నకేశవ స్వామి దేవాలయం, బేలూర్
చెన్నకేశవ స్వామి దేవాలయం, బేలూర్, కర్ణాటక
వెయ్యి సంవత్సరాల క్రితం సూర్యవంశపు క్షత్రియులు హొయసల శకంలో దక్షిణ భారతదేశంలో కళలు, శిల్ప కళాశైలి, సంస్కృతి చాలా అభివృద్ధి చెందాయి. ఈ సామ్రాజ్యము నేటికీ అద్భుతమైన హొయసల శిల్పానికి చిరస్మరణీయం.
బేలూరులోని చెన్నకేశవాలయం, హళిబేడులోని హొయసలేశ్వరాలయం, సోమనాథపురంలో చెన్నకేశవాలయం వంటి ప్రసిద్ధ ఆలయాలతో పాటు కర్ణాటకంతటా విస్తరించి నేటికీ నిలిచి ఉన్న వందకు పైగా దేవాలయాలు హొయసల శిల్పకళకు తార్కాణం. దాదాపు 92 దేవాలయాలు హొయసల సామ్రాజ్యంలో నిర్మించగా 34 దేవాలయాలు హాస్సన్ జిల్లాలో ఉన్నాయి. హొయసల రాజులు లలిత కళలను కూడా ప్రోత్సహించి చేయూతనిచ్చారు. వీరి ఆదరణ వలన కన్నడ మరియు సంస్కృత సాహిత్యాలు వెల్లివిరిశాయి.
విజయనగర రాజుల కాలం 1117 సంవత్సరంలో (12వ శతాబ్దం) హస్సన్ జిల్లాలో నిర్మించిన బేలూర్ చెన్న కేశవాలయం అంతా పూర్తి కావడానికి 103 సంవత్సరాలు పట్టిందట. దాదాపు 1000 మంది ఈ నిర్మాణంలో పాల్గొన్నారు. హొయసల రాజ్యానికి ప్రధమ రాజధానిగా బేలూర్ ఉండేది. అప్పటి రాజు విష్ణువర్ధనుడు జైనిజం నుండి విష్ణు భక్తుడిగా మారినప్పుడు లేదా విష్ణువర్ధనుడు చోళుల మీద విజయం సాధించినప్పుడు ఈ నిర్మాణం జరిగిందని రెండు కథలు ఉన్నాయి. రాణి శాంతల దేవి ఒక గొప్ప భరతనాట్య కళాకారిణి, సంగీతం, కళల మీద ఎక్కువ మక్కువ ఉండటంతో ఈ దేవాలయ నిర్మాణం అడుగడుగునా మీకు కళ్ళు చెదిరే అత్యద్భుత శిల్పకళా నైపుణ్యం కనిపిస్తుంది. దేవాలయ ముఖ ద్వారంలో మకర తోరణం, దశావతారాలు కనిపిస్తాయి.
నవరంగ మండపం ఈ దేవాలయ ప్రధాన ఆకర్షణ. ఈ మండపం అంతా 48 స్తంభాలతో ప్రతి స్థంభం మీద ఒక్కో ప్రత్యేకమైన శిల్పం చెక్కబడి ఉంటాయి. ముఖ్యంగా విష్ణు మూర్తి మోహిని రూపంలో ఉన్న మోహిని శిల్పం, నరసింహ శిల్పం, శాంతల దేవి శిల్పం, శుక భాషిణి (lady with a parrot), గంధర్వ నాట్య భంగిమలు, జుట్టు అంతా విరబోసుకుని తుడుచుకున్నట్లుగా శిల్పం ఇలా 48 శిల్పాలు హొయసల రాజ్య శిల్పుల ప్రతిభకి అద్దం పడతాయి. కొన్ని శిల్పాలకు చేతికి ఉన్న ఉంగరం, గాజులు సులువుగా తిప్పుకోవచ్చు అంట.
దేవాలయ బయట గోడ మీద ఖాళీ అనేదే లేకుండా చెక్కిన చిన్న చిన్న బొమ్మలు.. మొదటి వరసలో 650 చిన్న ఏనుగులు వేరు వేరు భంగిమలలో, రెండో వరసలో సింహాలు, మూడో వరసలో నాట్య భంగిమలు ఇలా ఈ గోడ అంతా రక రకాల బొమ్మలతో ఏకశిల మీద చెక్కడం విశేషం. ఎన్నోసార్లు మొహమ్మదీయుల దండయాత్రలో ధ్వంసం అయినా విజయనగర రాజులు మళ్ళీ పునరుద్దించుకుంటూ ఉండబట్టి దాదాపు 1000 సంవత్సరాలు అయినా మనం ఇప్పటికి ఈ అద్భుతమైన దేవాలయం చూడగలుగుతున్నాం. జీవితంలో తప్పని సరిగా వెళ్ళవలసిన దేవాలయలలో ఈ గుడి కూడా చేర్చుకోండి. దీనితో పాటు హళిబేడులోని హొయసలేశ్వరాలయం, సోమనాథపురంలో చెన్నకేశవాలయం కూడా సందర్శించుకోవచ్చు.