విష్ణుభక్త అంబరీషుడు
హిందూ పురాణములు
విష్ణుభక్త అంబరీషుడు
సూర్యవంశములో సుప్రసిద్ధుడు అంబరీషుడు. అతను హరి పూజ ధురంధరుడు. సద్గుణ సంపన్నుడు. నిరాడంబరుడు. పరిపాలనా దక్షుండు. పూర్వ జన్మ సుకృతం వల్ల అతనికి బాల్యం నుంచి హరి భక్తి ఏర్పడినది. మనోవాక్కాయ కర్మలతో మహా విష్ణువునే ఆరాధించడం అతనికి నిత్యకృత్యం అయినది. విష్ణు భక్తుల్ని ఆదరిస్తూ విష్ణు కీర్తనలను ఆలపిస్తూ విష్ణు మందిరాన్ని పరిశుభ్రం చేస్తూ అతడు కాలం గడిపేవాడు. ఫలాపేక్ష లేకుండా సరస్వతి నదీ తీరంలో అనేక యజ్ఞాలు కావించి రాజర్షి అనే పేరు పొందాడు అంబరీషుడు.
కొంతకాలనికి అంబరీషుడు సంసార బంధాలకు అతీతుడై సత్యమార్గంలో ధర్మ నిష్టతో ప్రవర్తింపసాగాడు. విష్ణువు అతని భక్తికి మెచ్చి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేయగల సుదర్శన చక్రాన్ని ప్రసాదించాడు. అంబరీషుడు విష్ణుదేవుని కరుణా కటాక్షములకు పొంగి పులకించాడు. ఒకసారి అంబరీషుడు తన తోడు నీడ వంటి అర్థాంగి లక్ష్మితో కలిసి ద్వాదశ వ్రతాన్ని ఆచరించాడు. వ్రత సమాప్తి చేయడానికి కార్తీక మాసంలో మూడు రాత్రులు ఉపవాసం వుండి విష్ణువుకు షోడశోపాచారములతో అర్చించాడు. బ్రాహ్మణులకు గోవులను దానం యిచ్చాడు. యధావిదిగా వేదవేత్తలను ఆరాధించి ద్వాదశీపారాయణ చేయటానికి సిద్ధమైనాడు. సరిగ్గా అదే సమయంలో భాసుర తపో విలాసుడు, నిరంతర యోగాభ్యాసుడు అయిన దుర్వాస మహర్షి అక్కడకు వచ్చాడు. అనుకోకుండా భోజన సమయానికి అరుదెంచిన అతిధి సాక్షాత్తు విష్ణుమూర్తితో సమానమని పెద్దలు చెబుతారు.
అందుకు అంబరీషుడు ఆయనకు స్వాగతం పలికి తగిన మర్యాదలు చేసి తన ఆతిధ్యాన్ని స్వీకరించమని వేడుకున్నాడు ధుర్వాసుడిని. అందుకు సంతోషముతో సంతసించి స్నానం చేసి వస్తానని యమునా నదికి వెళ్ళాడు. అక్కడ స్నానానికి నీటిలో దిగి జపం మొదలుపెట్టి ఆలస్యం చేసాడు.
ఎండ మండిపోతున్నది. ద్వాదశీపారాయణకు సమయం మించిపోతున్నది. ఆ సమయంలో పారాయణ చేయకపోతే వ్రతం అంతా వ్యర్దమైపోతుంది. అటువంటి క్లిస్ట సయములో ఏం చేయడానికి తోచక అంబరీషుడు పండితులనందరిని పిలిపించాడు. విషయాన్ని వివరించాడు. తగిన ఉపాయం చెప్పమని ప్రాధేయపడ్డాడు. అప్పుడు ఆ విద్వాంసులందరు ఆలోచించి, అంబరీష మహారాజ అతిధి రాలేదని ద్వాదశీ పారాయణ మానకూడదు. ఆలాగని భోజనం చేయకూడదు. కనుక మధ్యేమార్గంగా జలపానం చేసినట్లయితే ద్వాదశీవ్రత ఫలితం దక్కుతుంది అని అతని ధర్మసందేహాన్ని తీర్చారు. అందుకు సంతోషించి అంబరీషుడు నీటిని మాత్రమే కొద్దిగ త్రాగి వ్రతాన్ని పూర్తి చేసాడు.
కొంతసేపటికి తన అనుష్టానం ముగించుకొని దుర్వాసుడు రానేవచ్చాడు. జరిగిన సంగతి తెలుసుకొని ఆగ్రహోదగ్రుడైనాడు. నన్ను భోజనానికి పిలిచి, నేను రాకముందే పారాయణ చేసి కూర్చుంటారా? అని పండ్లు పటపట కొరికాడు. కనుబొమ్మలు ముడివేసి పెదవులు అదరుచుండగా తన జట నొకదానిని ఊడపెరికి మంత్రించి కృత్య అనే రాక్షసిగా మార్చాడు. అపార్థమైన అహంకారంతో హుంకరించి, ఆ కృత్యను అంబరీషుని మీదకు ప్రయోగించాడు. ప్రళయాగ్నిలాగ విజృంభించి పెద్ద శూలాన్ని ధరించి కృత్య భయంకర ఆకారంతో అంబరీషుని పైకి దూకింది. అంతలోనే వెర్రిమొర్రి కోపంతో కేకలు పెడుతున్న దుర్వాసుడి దురహంకారాన్ని తుత్తునియలు చేయమని మహావిష్ణువు తన చక్రాయుధాన్ని పంపించాడు. చక్రం రివ్వున వచ్చి క్షణకాలంలో కృత్యుని భస్మం చేసింది. అంతటితో ఆగక అవక్రమైన పరాక్రమంగల ఆ చక్రం దుర్వాసుడి వెంట పడింది. ఆ ముక్కోపి దిక్కుతోచక భయంతో పరుగెత్తసాగాడు. అతడు ఎక్కడెక్కడకు వెళ్ళితే ఆ చక్రం అక్కడకు వెళ్ళింది. పాతాళానికి వెళితే పాతాళానికి, సముద్రంలో ప్రవేశిస్తే సముద్రంలోనికి, ఆకాశానికి వెళితే ఆకాశానికి, దిక్కులకు పోతే దిక్కులకు వెన్నంటిపోసాగింది.
ఆ సుదర్శన చక్రపు అగ్నిజ్వాలలకు తట్టుకోలేక గిలగిల కొట్టుకొంటున్నాడు. దుర్వాసుడు పరుగెత్తుచూ పోయి సత్యలోకం చేరాడు. కాపాడమని బ్రహ్మదేవుని ప్రార్థించాడు. ఆయన సుదర్శన చక్రాన్ని మరల్చే శక్తి తనకు లేదన్నాడు. ఈశ్వరుడు చక్రాన్ని ఉపసంహరించాలంటే ఆ చక్రధరుడే రావాలన్నాడు. దుర్వాసునికి దిక్కు తోచలేదు. విష్ణుమూర్తిని శరణు వేడడం కంటే వేరే మార్గం లేదని నిర్ణయించుకున్నాడు. శోకంతో ఆక్రోశిస్తూ వెంటనే వైకుంఠానికి వెళ్ళాడు. లక్ష్మి సమేతుడైయున్న శ్రీమహావిష్ణువుకు దుర్వాసుడు మొఱపెట్టుకున్నాడు.
అప్పుడు శ్రీహరి ”దుర్వాసా, నేను భక్త పరాధీనుణ్ణి. గోమాత వెంటనంటే నుండే గోవత్సలులాగ నేను నా భక్తులను అనుసరిస్తుంటాను. అందువలన ఆ చక్రాన్ని ఉపసంహరించే శక్తి నాకంటే ఎక్కువగా ఆ అంబరీషుడికే వుంది. వెంటనే వెళ్ళి అతన్ని ఆర్దించు” అని పంపించాడు. దుర్వాసమహర్షి తన అహంకారినికి తన ప్రవర్తనకు ఎంతో పశ్తాత్తాపపడ్డాడు. ఇక తప్పేదేముంది, అంబరీషుడే శరణ్యం. లేకుంటే చక్రజ్వాలామాలికలు తనను కాల్చివేస్తాయి. చకచకామని వెళ్ళి పాహి పాహి అని ప్రార్థించాడు. సహజంగానే సాధు స్వభావుడైన అంబరీషుడు దయార్థహృదయుడై దుర్వాసుణ్ణి ఓదార్చాడు. శాంతించమని చక్రాయుధాన్ని పరి పరి విధాల స్తుతించాడు. చక్రం శాంతించి ఆరోగమించింది. దుర్వాసుడి ప్రాణాలు కుదుటపడ్డాయి.
ఆ ముని తన అవివేకానికి సిగ్గుపడ్డాడు. భక్తి ప్రభావాన్ని కన్నులారా చూచాడు. భక్తులంటే ఏమిటో, వారి శక్తి ఎంత గొప్పదో తెలుసుకొనగలిగాడు. వెంటనే చేతులు యెత్తి తనను క్షమించమని అంబరీషుడ్ని వేడుకొన్నాడు. అంబరీషుడు దుర్వాసమహర్షికి వేదవేత్తలైన బ్రాహ్మణులకు తృప్తిగా భోజనం పెట్టి, అనంతరం తన భార్యతో కలిసి భుజించాడు. ద్వాదశీవ్రతం విజయవంతంగా పరి సమాప్తమయ్యింది. అంబరీషుని వద్ద సెలవు తీసుకుని దుర్వాసుడు తన ఆశ్రమానికి వెళ్ళిపోయాడు.
భక్తునికి భగవంతుడు ఏవిధంగా లోబడియుంటాడో, వారిద్దరికి గల బంధం ఎటువంటిదో అంబరీషుడి వృత్తాంతం వెల్లడిస్తుంది. అంతేకాదు! భగవంతునికంటే ఒక్కొక్కసారి భక్తుడే శక్తిమంతుడని కూడా మనకు స్పష్టమవుతుంది. భగవంతున్ని మన ప్రభువుగా భావించి సర్వకర్మలను ఆయనకే అంకితం చేయడం దాస్య భక్తి అని పిలువబడుతుంది. సప్తద్వీప విశాల భూభారాన్ని వహించి విష్ణు సేవతో కాలం గడిపిన సద్గుణ సంశోభితుడై అంబరీష చక్రవర్తి దాస్యభక్తి లక్షపాయుడుగా మనకు సాక్షాత్కరిస్తాడు.
- ఎం. కోటయ్య, ఖమ్మం