సంవత్సరంలో ఒక్కరోజు మాత్రమే తెరవబడే ఆలయం
దేవభూమి ఉత్తరాఖండ్ లోనున్న సంవత్సరంలో ఒక్కరోజు మాత్రమే తెరవబడే ఆలయం గురించి మీరు ఎప్పుడైనా విన్నారా?
అదే శ్రీబన్సి నారాయణ్ మందిర్
ఉర్గమ్ వ్యాలీ ,
చమోలీ జిల్లా
ఉత్తరాఖండ్ రాష్ట్రం.
ఈ దేవాలయం 8వ శతాబ్ధంలో నిర్మించినట్టుగా చారిత్రిక ఆధారాలు తెలుపుతున్నాయి. ఈ ఆలయంలో కృష్ణ పరమాత్మ కొలువైయున్నారు.
పురాణ ప్రాశస్త్యం : విష్ణుమూర్తి వామనావతారం దరించినప్పుడు బలిచక్రవర్తిద్వారా మూడు అడుగుల భూమిని పొంది మూడవ అడుగు ద్వారా బలిని పాతాళలోకానికి అధిపతిని చేశాడు. అప్పుడు బలిచక్రవర్తి కోరికమేరకు భక్తపరాయణుడైన స్వామివేరే స్వయంగా ద్వారపాలకుడు అయ్యాడు. అలా ఉండగా ఎంతకాలం గడిచినా విష్ణుమూర్తి దర్శనం కలుగకపోయేసరికి స్వయంగా లక్ష్మీఅమ్మవారే నారద మహర్షిని వెంటబెట్టుకొని ఇచటకు వచ్చి పాతాళలోకంలో ద్వారపాలకుడుగానున్న స్వామిని కనుగొనింది. అంతట తన స్వామిని తీసుకెళ్ళడానికై అమ్మవారు బలిచక్రవర్తికి రక్షాభందనం కట్టారట. బలిచక్రవర్తిని అనుగ్రహించిన స్వామి చతుర్భుజములతోటి దర్శనం ఇచ్చి ఇచటనే వెలిశారు. ఒక్క శ్రావణ పౌర్ణమినాడు భక్తులకు దర్శనమిస్తారు స్వామి. మిగతా 364 రోజులు నారద మహర్షులవారు ఈ ఆలయంలో తపస్సమాధిలో ఉంటారని భక్తులు ప్రఘాడంగా విశ్వసిస్తారు.
ఇక్కడకు చేరుకొనే మార్గం:
అత్యంత సాహసంతో కూడుకొన్న ఈ ఆలయాన్ని దర్శించడానికి పర్వతారోహణము చేస్తూ
బన్సా అనేగ్రామానికి 10కి.మి., ఉర్గమ్ గ్రామానికి 12 కి. మీ.దూరంలో సముద్ర మట్టానికి 13000 ఫీట్ (3600 మీటర్లు) ఎత్తులో ఉర్గమ్ వ్యాలీ నుండి దూరంగా దట్టమైన హిమాలయ పర్వత శ్రేణుల్లో ఉన్న ఈ ఆలయాన్ని చేరుకోవాలి. అందువల్ల అక్కడ ఏ గ్రామమూ లేదు. ఈ ఆలయం చుట్టుతా నందాదేవి పర్వత శ్రేణులు,ఓక్ పర్వతాలు, రోడోడెన్డ్రోన్స్ పర్వతాలు చుట్టుముట్ట ఉన్నాయి.
ఈ ఆలయం సంవత్సరానికి ఒక్కరోజు మాత్రమే శ్రావణ పౌర్ణమి నాడు భక్తుల దర్శనార్థం తెరవబడి సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు మాత్రం తెరవబడియుంటుంది. భక్తులు ఆనాడు అచటికి అనేకమంది వస్తారు. స్వామి సన్నిధిలో తోబుట్టువులు తమ అన్నదమ్ముళ్ళకు రక్షాభందనాలు కట్టి ఆ బన్సి నారాయణుని అనుగ్రహం పొందుతారు.
- వల్లినాథ్ శాస్త్రి గొల్లపిన్ని