సుదర్శనాష్టకం మహిమ
సుదర్శనాష్టకం మహిమ:
అవి ఆచార్య వేదాంత దేశికులు కాంచీపురములో నివాసం ఉన్న రోజులు. కాంచీపురం పరిసర ప్రాంతాల్లో విషజ్వరాలు ప్రబలాయి. ఓ సారి ఆచార్యులు తిరుప్పుట్కుళి ప్రాంతానికి శిష్యులతో విజయం చేశారు. అక్కడి ప్రజల ఆర్తనాదాలు విన్న ఆచార్యుల హృదయం కరగింది. వెంటనే విష్ణు భగవానుని ఆయుధము, సకల భవరోగ హారిణి అయిన శ్రీ సుదర్శన చక్రాన్ని స్తుతిస్తూ సుదర్శనాష్టకం రచించారు ఆచార్య దేశికులు.ఆచార్య దేశికుని కరుణకి ఉప్పొంగిన సుదర్శన చక్రాత్తాళ్వారు ప్రసన్నుడై పదహారు దివ్యాయుధాలతో దర్శనమిచ్చి కాంచీపురం దివ్యదేశ పరిసర ప్రాంతాలలో ప్రజలకు వ్యాపించిన విష జ్వరం పారద్రోలాడు.పిమ్మట ఆచార్య దేశికులు కాంచీ పరిసర ప్రజలకు భక్తి ప్రపత్తులతో సుదర్శన భగవానుని స్తుతించమని ఆజ్ఞాపించారు. ఆశ్చర్యం..కాంచీపురం పరిసరాల్లో ఉన్న ప్రజల అందరి ఆరోగ్యం ఒకే రోజులో కుదుట పడింది.
సకల రోగాలకు నివారిణీ ఔషధములన్నియూ శ్రీ సుదర్శన చక్ర రాజం నుండియే ఆవిర్భవించాయని మనకు విష్ణు పురాణము చెబుతోంది.శ్రీ వేదాంత దేశికులు సకల వేద సారమంతయూ సంగ్రహించి అందలి మంత్రాలను నిక్షిప్తం చేసి పాంచరాత్ర ఆగమ సహితంగా సుదర్శన అష్టకాన్ని విరచించి నుతించారు. పరమ దయాళువు అయిన ఆచార్య దేశికులు శాస్త్ర సమ్మతంగా అందరికీ అమిత కరుణతో సుదర్శన చక్రత్తాళ్వార్ కరుణ కలిగేలా అనుగ్రహించారు. సుదర్శనాష్టకం భక్తి శ్రద్ధలతో వినండి పఠించండి, సకల భవ రోగ హారిణి అయిన సుదర్శన కరుణతో ఆరోగ్యముతో జీవించండి.