అమావాస్య రోజుల్లో హనుమని పూజిస్తే,
అమావాస్య రోజుల్లో హనుమని పూజిస్తే, సకల సంపదలు కలుగుతాయి.
- లక్ష్మి రమణ
హనుమంతుని జయంతిని చైత్ర శుద్ధ పౌర్ణమి నాడు వైభవంగా జరుపుకుంటారు. శ్రీరామనవమి తరువాత వచ్చే గొప్ప ఉత్సవం హనుమాన్ జయంతి . హనుమాన్ జయంతిని జరుపుకోవడం , ఆరోజున అన్నదానం చేయడం అనంతకోటి పుణ్య ఫలాన్ని అనుగ్రహిస్తుంది. ఒకవేళ ఏదైనా కారణం చేత, హనుమాన్ జయంతి జరుపుకోలేనివారు బాధపడాల్సిన అవసరం లేదు . ప్రతి మాసంలో వచ్చే అమావాస్యరోజున హనుమంతుని ఇలా ఆరాధించండి . అనంతమైన పుణ్యంతోపాటు, అష్టైశ్వర్యాలూ సిద్ధిస్తాయని సూచిస్తున్నారు పండితులు .
రుద్రాంశ సంభూతుడైన ఆంజనేయుడిని ప్రతి అమావాస్య రోజునా మంచి సింధూరంతో అర్చించడం ద్వారా అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని ప్రతీతి. ఇంట్లో చిన్నా ఆంజనేయుని ప్రతిమని ఉంచుకొని ఆంజనేయ స్వామికి సింధూరంతో అర్చనచేసి, శ్రీరామదూతం శిరసానమామి అని స్తోత్రం చేయండి . లక్ష్మీదేవి - అమ్మ నువ్వు శ్రీహరి వక్షస్థలం నివాసినివి అంటే అమితమైన ఆనందాన్ని పొందుతుంది. పార్వతీదేవి- అమ్మ నీవు పరమేశ్వరునిలో సగభాగాన్ని పొందిన అర్ధనారీశ్వరివి అంటే సంతోషిస్తుంది. అలాగే సరస్వతీదేవి - బ్రాహ్మిణి అంటే ఆనుగ్రహిస్తుంది . అదేవిధంగా ఆ హనుమ- రామదూతవయ్యా నువ్వు అంటే చాలు అమితంగా సంతోషిస్తారు . అందువల్ల శ్రీరామదూత స్తోత్రం చేయండి. ఆ హనుమ అనుగ్రహాన్ని అందుకోండి .
ఈ రోజున నిష్టతో ఆంజనేయ స్వామి ఆలయాన్ని సందర్శించుకోవడం ద్వారా అనుకున్న కార్యాలను దిగ్విజయంగా పూర్తవుతాయని విశ్వాసం. ఇంట్లో పూజ చేసుకోవడానికి కుదరనివారు, ఇంట్లో దీపం పెట్టుకొని ఆలయానికి వెళ్లి హనుమంతునికి సింధూరార్చన చేయించుకోండి .
అమావాస్య చంద్రుడు కనిపించని రోజు. దుష్ట శక్తులు శక్తిని పుంజుకొని ఉండే రోజు. అయినా ఆ హనుమంతుని అనుగ్రహం ఉంటె, ఆ పేరు వింటే, ఎంతటి శాకినీ , డాకినీలైనా తోకజాడించి వెళ్లిపోవాల్సిందే . ఆ విధంగా కూడా అమావాస్యపూట హనుమంతుని ఆరాధన శ్రేష్టమైనది.
ఆ నాటి సాయంత్రం వేళ, ఆంజనేయ స్వామికి నేతితో దీపం పెట్టండి , ఆ తర్వాత, హనుమంతుని ఆలయానికి 18 సార్లు ప్రదక్షిణ చేయడం ద్వారా మనోధైర్యం, సకలసంపదలు, ఉన్నత పదవులు లభిస్తాయని పండితులు అంటున్నారు.
హనుమంతుడు కార్యసాధకుడు. భక్తితో హనుమంతుడిని కొలిచిన వారికి వారి కోరికలు తప్పక నెరవేరతాయి. భక్తులు వారి వారి కోరికను అనుసరించి ఆంజనేయ శ్లోకాలను భక్తితో స్మరిస్తే కార్యసిద్ధి ని కూడా సాధించగలరు. అందువల్ల ఇప్పటి నుండీ ప్రతి అమావాస్య నాడూ తప్పక ఆంజనేయార్చన చేయండి .
శుభం !!
Hanuman, anjaneya, Amavasya, Hanuman Jayanthi, Chaitra Pournami, Ram Navami