Online Puja Services

నీలుడు చేసిన హనుమంతుని ఉపాసన

52.14.88.137

శక్తిని , ఐశ్వర్యాన్ని పొందేందుకు నీలుడు చేసిన హనుమంతుని ఉపాసన . 
సేకరణ 

విభీషణుని కుమారుడైన నీలుడు లంకారాజ్యానికి యువరాజుగా పరిపాలన చేస్తున్న సమయం. అత్యంతబల సంపన్నుడైన నీలుడు సమస్త విద్యలలో పండితుడు. ధర్మాచరణంపట్ల అనురాక్తిగాలవాడు. సంపదలలో కుబేరునికి దీటైనవాడు. అయినప్పటికీ నీలునికి తృప్తి కలుగలేదు. అతని మనసులో ఇంకా ఐశ్వర్యాన్ని సేకరించాలన్న తపన తీరలేదు .  దాంతో  నీలుడు  ఒకరోజు తన తండ్రి విభీషణునితో, “తండ్రీ! మనకు సంపదలకు, వైభావాలకు లోటు లేదు. కానీ, ఎంత ఉన్నప్పటికీ, మన దగ్గర చింతామణి, కామధేనువు, కల్పవృక్షాలు లేవు. అవి లేకపోవడం నా మనసెంతో వేదనకు గురవుతోంది. నువ్వు నాకిప్పుడు అనుమతినిస్తే, క్షణకాలంలో వాటిని సాధించి తీరుతాను. నన్ను ఆశీర్వదించు తండ్రీ!” అని పలికాడు.

కొడుకు మాటలు విన్న విభీషణుడు, “పుత్రా! రామభక్తిని మించిన సంపదలు మనకెందుకు? ఆ మహనీయుని అనుగ్రహం ఉంటే చాలు, అదే మనకు సర్వానందదాయకమైంది. దానిని మించిన సిరిసంపదలతో మనకేమి పని? అంతకు మించి పేరు పెన్నిధులు మనకెందుకు? చింతామణి, కామధేనువు, కల్పవృక్షాలు రామభక్తికి సరితూగేవి కావు. అందువల్లనే వాటి పట్ల నాకు అనురక్తి లేదు. వాటిపై నీకు అమిత ఇష్టం అయినట్లయితే, వాటిని నువ్వు సాధించుకో. అయితే ఒక విషయం, మన భూలోకవాసులం కనుక అవి మనకు సులువుగా లభించవు. వాటిని పొందాలంటే దైవశక్తిని సంపాదించాలి. దైవశక్తి కావాలంటే దేవతలను ఆరాధించాలి. అందుకై ముందుగా గురువులను ఆరాధించి, వారి ఆశీస్సులను పొందాల్సి ఉంటుంది. తద్వారా లోకోత్తరశక్తులను పొందగలిగితే, అటుపై నీ కోరిక నెరవేరుతుంది” అని కొడుకు కోరికని తీర్చగలిగిన మార్గాంతరాన్ని  ఉపదేశించారు . 

తండ్రి ఆజ్ఞను శిరసావహించిన నీలుడు, తండ్రికి ప్రదక్షిణ నమస్కారాలను చేసి, కులదైవమైన శుక్రాచార్యుని ఆశ్రయించి పన్నెండు సంవత్సరాలు భక్తిప్రపత్తులతో సేవించి, గురువును ఆనందపరిచాడు. నీలుని మనసులోని కోరికను మన్నించిన శుక్రుడు, “నాయనా, నీలా! నీ కోరిక నెరవేరాలంటే, అందుకు తగిన పరమాద్భుతమైన మంత్రాన్ని ఉపదేశిస్తాను. ఆ మంత్రం శ్రీరామచంద్రుని పరమభక్తాగ్రేసరుడైన ఆంజనేయుని పరమ పవిత్ర మంత్రరాజము. దానికితోడు ఒక వ్రతం గురించి కూడ చెబుతానూ. ఆంజనేయుని అవతారాలలో పంచముఖ ఆనంజనేయుని భక్తిశ్రద్ధలతో పూజిస్తే, ఎంతటి అసాధ్యమైన పని అయినప్పటికీ సుసాధ్యమవుతుంది. అంటే, సాధించలేనిదంటూ ఏమీ ఉండదు" అని తెలిపి, దివ్యమైన హనుమ మంత్రాన్ని నీలునికి బోధించి, వ్రతం కూడ చేయించాడు. నీలుడు శుక్రుని ఘనంగా సత్కరించి, ధ్యాన నిమగ్నుడయ్యాడు.

కొంతకాలం తరువాత నీలుని ప్రార్థనకు సంతుష్టుడైన హనుమంతుడు, పంచాముఖాంజనేయ రూపంలో నీలునికి దర్శనమిచ్చాడు. పంచముఖ ఆంజనేయ స్వరూపంలో గరుక్మాంతుని స్వరూపం  వెనుక ముఖంగా ఉండి దర్శనమిస్తారు స్వామి . అలా  ప్రత్యక్షమైన స్వామిని  నీలుడు  బహువిధాలుగా  స్తుతించగా, నీలుని మనసెరిగిన ఆంజనేయుడు, “భక్తా, నీలా! నీ కోరిక త్వరలో నేరావేరుతుంది. నువ్వు నా పరమభక్తుడవు. నీ తండ్రి నాకు అత్యంత మిత్రుడు. ఆత్మబంధువుకంటే ఎక్కువ. ఆందుకే నువ్వు నాకు అత్యంతప్రీతి పాత్రుడవు. నువ్వుకోరుకున్న విధంగానే చింతామణి మొదలైన దివ్యసంపదలు నీకు సొంతమవుతాయి. 

వాటితో పాటు శీలసౌందర్యాది విశేషగుణ  నిధియైన వసుందరిని కూడ పొందగలవు. నువ్వు నా గురించి తపస్సు చేసిన పురుషోత్తమ షెత్రమనే ఏ ప్రదేశం ఇకపై నీ పేరిట నీలాద్రిగా ప్రసిద్ధిని పొందుతుంది “. అని నీలుని అనుగ్రహించి అదృశ్యమయ్యాడు. ఇప్పటికీ ఈ ప్రదేశాన్ని మీరు చూడవచ్చు . ఒడిస్సా రాష్ట్రంలోని ,  నీలాద్రి లేదా నీలాచల్ గా ఈ ప్రాంతాన్ని ప్రస్తుతం వ్యవహరిస్తున్నారు . ఇక, స్కాంద పురాణంలో కూడా ఈప్రాంతాన్ని నీలాద్రియని వ్యవహరించారు . 

తిరిగి కథలోకి వెళితే, అలా తన కోరికలను సిద్ధింపజేసుకున్న నీలుడు గురువు శుక్రుడు, తల్లిదండ్రులకు మొక్కి, వారి ఆశీర్వాదాలను అందుకున్నాడు. అనంతరం దేవలోకంపై దండయాత్ర చేయ సంకల్పించిన నీలుడు, ఇంద్రుని వద్దకు దూతను పంపి తన ఉద్దేశ్యాన్ని వినిపింపజేసాడు. “ఓయీ ఇంద్రా! గతంలో మా పెద్దనాన్న కొడుకు చేతిలో పరాజితుడవై బందిపబడ్డావు. ఇప్పుడు విభీషణుని కుమారుడనైన నేను, నీతో యుద్ధం చేయాలనుకుంటున్నాను.  నాతో యుద్ధం చేసి పరాభింపబడతావా? లేక చింతామణి, కామధేనువు, కల్పతరువు మున్నగు సంపదలను ఇస్తావా? ఏది ఏమైనా, నువ్వు నాతో యుద్ధం చేయలేవు కనుక, ఆ దివ్యరత్నాలను నాకివ్వు, బ్రతికిపో.” 

 నీలుని ఈ సందేశాన్ని విన్న ఇంద్రుడు మండిపడ్డాడు. “ఎంతోమంది రాక్షసులను తుదముట్టించాను. ఈ నీలుడు నాతో అనవసరంగా కయ్యానికి కాలు దువ్వుతున్నాడు. నీలునికి నా వజ్రాయుధసామర్థ్యం తెలిసినట్లు లేదు. వందల, వేల కోట్లకొలది రాక్షసులను నా వజ్రాయుధం సంహరించింది. అదలావుంటే, నీలుడొకలెక్క?! అందుకే ఈ దూతను శిక్షించి, పరాభావించి పంపించండి" అని ఇంద్రుడు ఆజ్ఞాపించడంతో దేవతలు రాయబారిని పంపారు. రాయబారి నీలునికి ఈ ఉందంతాన్ని చెప్పగా, ఆగ్రహించిన నీలుడు దేవలోకంపై యుద్ధభేరిని మోగించాడు. దేవతలకు, రాక్షసులకు మధ్య భయంకరమైన యుద్ధం ప్రారంభమైంది. కామరూప విద్య పాండిత్య ప్రవీణులైన దానవుల మాయోపాయాలకు దేవతలు ఎదురొడ్డి నిలువలేకపోయారు. 

ఇంద్రుడు రెట్టించిన పౌరుషంతో నీలుపైకి ఉరికి, “ఓయీ! నీలా! వాలి నా పుత్రుడు. అతడు నీ పెదనాన్నని చంకలో పెట్టుకుని సప్త సాగరాలలో ముంచగా, ఎలాగో ప్రాణాలను దక్కించుకుని బ్రతికిన విషయం నీకు తెలియదా?!” అని ఇంద్రుడు చెబుతుండగా, నీలుడు మరింతగా రెచ్చిపోయి యుద్ధాన్ని చేయసాగాడు. నీలుడు ప్రయోగించిన అస్త్రాలను ఇంద్రుడు భగ్నం చేయగా, ఇంద్రుని వజ్రాయుధాన్ని నీలుడు ఒక్క బాణంతో అణిచి వేశాడు. ఇంద్రుడు అంకుశంతో విజృభించగా, నీలుడు దానిని గదాఘాతంతో ఖండించాడు. అనంతరం నీలుడు పదునైన కత్తిని చేతబూని ఇంద్రుని శిరస్సును ఖండించేందుకు ముందుకు ఉరకగా, అక్కడ ప్రత్యక్షమైన బ్రహ్మ నీలునితో, "ఓయీ నీలా! నీ తండ్రి రామభక్తుడు, రాముడంటే శ్రీమహావిష్ణువే. ఆ మహావిష్ణువుకు సోదరుడు. ఈ ఇంద్రుడు. అందువల్ల ఇతడు నీకు మిత్రుడేగానీ, శత్రువుకాదు. ఇతనితో తగవులాట వద్దు. ఇద్దరూ స్నేహితులుగా మసలండి. నీ కోరికను నేను నెరవేరుస్తాను. చింతామణి వంటి దివ్య వస్తువులన్నింటిని నేను అనుగ్రహిస్తాను. నీకు మరో విషయాన్ని చెబుతాను. శ్రద్ధగా విను.

పూర్వం అత్రిమహాముని హిమాలయ పర్వత సానువుల్లో సంచరిస్తుండగా, ఆ మహనీయుని నేత్రాల నుండి దివ్యతేజస్సు వెలువడింది. ఆ తేజస్సు, అందులోని వృక్షాలతో కూడి పలురీతులుగా వ్యాపించింది. వాయుదేవుడు ఆ దివ్యతేజాన్ని రెండు రాశువులుగా విభజించగా, అందులో నుంచి సౌందర్యనిధియగు చంద్రుడు ఉద్భవించాడు. రెండవ రాశి నుంచి త్రిభువన సుందరియైన వనసుందరి జనించింది. ఆ సౌందర్యవతి మధువుతో పెంచబడింది. అమృతస్వరూపిణి కాబట్టి దివ్యమణులతో పాటుగా కన్యామణి కూడ గ్రహించి సుఖించు. నువ్వు పంచముఖ ఆంజనేయుని ఆరాధించనందువల్ల మాకు కూడ గౌరవ పాత్రుడవయ్యావు అని చెప్పాడు.  బ్రహ్మ ఇలా చెప్పడమే కాక, మహత్తర శక్తి సంయుతమైన హనుమద్ర్వతాన్ని ఉపదేశించాడు. ఇంద్రునిచే చింతామణి మొదలైన దివ్యమైన వస్తుసంపదల తోడుగా సౌందర్యరాశియైన వనసుందరిని కూడ అర్పింపజేసాడు. ఆవిధంగా హనుమదనుగ్రహం వలన ప్రాప్తించిన సంపదలతో నీలుడు హనుమద్భక్తులలో అగ్రగణ్యునిగా వెలుగొందాడు. 

Quote of the day

A man is born alone and dies alone; and he experiences the good and bad consequences of his karma alone; and he goes alone to hell or the Supreme abode.…

__________Chanakya