రాములోరి వెంట భక్త ఆంజనేయుడు ఎందుకు రానన్నాడు ?
రాములోరి వెంట భక్త ఆంజనేయుడు ఎందుకు రానన్నాడు ?
లక్ష్మీ రమణ
ఎక్కడెక్కడైతే రాములవారి నామం వినిపిస్తుందో అక్కడ హనుమ ప్రత్యక్షమవుతారు. హృదయంలోని రాముని ప్రతిష్టించుకున్న భక్త హనుమాన్ కదా ఆయన ! రాముని వీడి ఒక్క క్షణమైనా ఉండలేనని , రాముని ఏకాంతసేవకి సీతమ్మవారినే అనుమతిస్తే, ఆయన్ని సేవించకుండా , అంతసేపూ ఉండలేనని అమ్మతోనే వాదం పెట్టుకున్న భక్తి ఆంజనేయునిది . మరి రాముని అవతార పరిసమాప్తి సమయంలో , మిగిలిన దేవగణాలతో పాటుగా , హనుమనికూడా వెంటరమ్మంటే, ఆయన వెళ్ళలేదు . ఇక్కడే నిలిచిపోయారు . ఎందుచేత ?
రాముడై ఆ ఆదిమహావిష్ణుమూర్తి ఈ భువిని పావంచేయడానికి అవతరిస్తే, ఆయనవెంట లక్ష్మీమాత సీతమ్మగా అవతరించింది. ఆదిశేషుడు లక్ష్మణుడైనాడు . శంఖ , చక్రాలు భారత శత్రుఘ్న రూపం దాల్చాయి . మొత్తం వైకుంఠమే భూమిమీదికి తరలివచ్చింది . ఆ రామాయణ గాథలో ఎన్నో అద్భుతాలు , ఎన్నో మలుపులూ ఉన్నా , రావణాసురుడు సీతమ్మని ఎత్తుకెళ్ళడం, సుగ్రీవుడు , రాముడు మైత్రిని చేసుకోవడం, రావణాసుర సంహారం, శ్రీరామ పట్టాభిషేకం వంటి మహత్తర ఘట్టాలు, అద్భుతమైన రామాయణ ఇతిహాసనాన్ని అజరామరం చేశాయి . రామ సుగ్రీవుల మైత్రిని చేసిన హనుమ , రామునికి భక్తుడు . ‘రాముని దాసులకీ నేను దాసుడనే ‘అనేది ఆ అంజనీసుతుని మాట !
‘యత్ర యత్ర రఘునాథ కీర్తనం
తత్ర తత్ర కృతమస్తకాంజలిమ్
భాష్పవారి పరిపూర్ణ లోచనం
మారుతిం నమత రాక్షసాంతకం
ఆపదమపహర్తారం దాతారం సర్వసంపదాం
లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం’
అని అందుకే కదా ఆ రామభక్తుని కొలుస్తుంటాం .
ధర్మమూర్తి అయిన శ్రీరాముని నామం చెబితే చాలు కన్నులు నిండా నీటిని నిలుపుకునే అంజలి బద్ధులై హనుమ అక్కడ విచ్చేస్తాడు అని పెద్దలు చెబుతారు ఇందులో ఎటువంటి అపనమ్మకాలకి తావులేదు శ్రీ రామాయణం ఉత్తరకాండ కూడా ఈ విషయాన్ని ధ్రువీకరిస్తుంది.
అయితే, రాముని అవతార పరిసమాప్తి సమయంలో శ్రీరామునితో పాటు ఆయన పరివారం అంతా వైకుంఠానికి తరలి వెళ్ళి పోతుంది. ఆ సమయంలో రాములవారు ‘హనుమ! నీవు రావా? ‘అని ప్రశ్నిస్తారు. భగవంతుని వియోగం భక్తునికి ఎంత భాదో , భగవంతునికీ అటువంటి భక్తుని వియోగం అంతే బాధ మరి ! అందుకు హనుమంతుడు ‘స్వామి! నీ నామము ఒక్కటి నీవు వేరొకటి అని నేను ఏనాడు తలచలేదు. నీ నామం పెదవులపై ఆడుతున్నంతకాలం నాకు మీతో ఉన్నట్లే! వేరే వైకుంఠ వాసాలు నాకేల తండ్రీ! నేను కోరుకోను కూడా . నిరంతరం మీకథ గానం చేయడం , శ్రవణానంద కరంగా ఆ రామనామ గానామృతాన్ని ఆస్వాదించడమే గానీ , నాకింకేమీ అక్కర్లేదు స్వామీ ! “ అని సమాధానం ఇచ్చారట .
అప్పుడు శ్రీరాముడు ఆప్యాయంగా ‘అయితే రామకథ ఈ జగత్తులో నిలిచిన అంతకాలం నీవు చిరంజీవివై వర్ధిల్లు. ఎక్కడ రామ కథాగానం సాగితే అక్కడ నీవు నిలిచి తనివితీరేలా విను’ అని దీవించారట .
అందుకే ,జగత్తు నిలిచి ఉన్నంత కాలం నిలబడి పోయే శ్రీ రామాయణం చెప్పుకున్న ప్రతి చోట హనుమంతుడు ఉంటాడు శ్రీరామ అనుగ్రహం పరిపూర్ణంగా కలగటానికి కారకుడవుతాడు. ఈ కథ వాల్మీకి రామాయణంలో ఉందా ? అని రకరకాలుగా శోధనా సాధనా చేసేకన్నా ,ఇందులో నిబిడీకృతమై భక్తి తత్వాన్ని చదువరులు మనసారా ఆస్వాదించగలరని , ఆ రకంగా ఆ వాయునందనునికి ప్రీతిని చేకూర్చి, ఆయన అనుగ్రహానికి పాత్రులు కాగలరని ఆశిస్తూ , సెలవు .