Online Puja Services

కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయం

3.134.81.178
కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయం...
 
ఆలయ స్థలపురాణం ...!!
 
దాదాపు ఐదు వందల ఏళ్ల క్రితం కొడిమ్యాల పరగణాలో నివసించే సింగం సంజీవుడు అనే పశువుల కాపరి కొండగట్టు గుట్టల్లో తన పశువులను మేపుతుండగా ఓ ఆవు తప్పిపోయింది. వెతికి వేసారిన సంజీవుడు చెట్టుకింద సేదతీరుతూ నిద్రలోకి జారుకోగా అంజన్న కలలోకి వచ్చి కోరంద పొదల్లో వెలసిన తనకు ఎండ, వాననుంచి రక్షణ కల్పించాలని సూచించి ఆవు జాడ చెప్పాడట. కళ్లు తెరిచి చూడగా ఆవు కనిపించడంతో సంజీవుని ఆనందానికి అవధుల్లేవు. భక్తిభావంతో కోరంద ముళ్లపొదలను తొలగించి స్వామివారికి చిన్న ఆలయాన్ని నిర్మించినట్లు చరిత్రకారులు చెబుతారు. నారసింహ వక్త్రంతో వెలసిన కొండగట్టు అంజన్న ఆలయానికి ఈశాన్యభాగంలోని గుహల్లో మునులు తపస్సు ఆచరించినట్లు ఆనవాళ్లున్నాయి. శ్రీరాముడు సీతకోసం లంకకు వెళ్లే సమయంలో లక్ష్మణుడు మూర్చిల్లిపోగా ఆంజనేయుడు సంజీవని పర్వతాన్ని తీసుకొని వస్తుండగా అందులోంచి ఓ ముక్కరాలిపడి కొండగట్టుగా ప్రసిద్ధి పొందిందని మరికొందరు పురాణగాథను చెబుతుంటారు. ఆలయానికి వెళ్లే దారిపక్కన సీతాదేవి ఏడ్చినట్లు చెప్పే కన్నీటి గుంతలు భక్తులకు దర్శనమిస్తాయి. ప్రకృతి సిద్ధంగా వెలసిన పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరిస్తే పాపాలు తొలగిపోతాయని విశ్వసిస్తారు. రోగగ్రస్థులు, సంతానహీనులు అంజన్న సన్నిధిలో 41రోజులు గడిపితే బాగవుతారని భక్తుల విశ్వాసం.
 
ఆలయంలో నిర్వహించే ప్రధాన పర్వదినాలు 
 
* ఏటా చైత్ర పౌర్ణమిరోజు హన్మాన్‌ చిన్నజయంతి, వైశాఖ బహుళదశమినాడు వచ్చే పెద్ద హన్మాన్‌ జయంతిని ఘనంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా లక్షలాది దీక్షాపరులు అంజన్నను దర్శించుకొని ముడుపులు కట్టివెళ్తుంటారు. పెద్ద హన్మాన్‌జయంతి సందర్భంగా మూడురోజుల పాటు హోమం నిర్వహిస్తారు. 
 
*ఉగాది పండుగ రోజు స్వామివారి సన్నిధిలో పంచాంగ శ్రవణం జరుగుతుంది. 
 
*,ఐత్ర శుద్ధనవమి రోజు శ్రీరామనవమి సందర్భంగా శ్రీసీతారాముల కల్యాణం కన్నుల పండువగా జరుగుతుంది. 
 
* శ్రావణ మాసంలో సప్తాహ ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. 
 
* ఏటా ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా నెల రోజులపాటు తిరుప్పావై, గోదా రంగనాయకుల కళ్యాణం జరుగుతుంది. 
 
* వైకుంఠ ఏకాదశి రోజు ఉత్తరద్వారం ద్వారా భక్తులకు స్వామివారి దర్శనం గావిస్తారు. 
 
* దీపావళి పర్వదినం సందర్భంగా సహస్ర దీపాలంకరణతో ఆలయాన్ని తీర్చిదిద్దుతారు.
 
* ఆలయ పవిత్రతతో పాటు లోకకళ్యాణం నిమిత్తం ఏటా పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు. 
 
* ప్రపంచ శాంతికోసం జగత్‌కళ్యాణ సిద్ధికి ఏటా మూడు రోజులపాటు శ్రీసుదర్శన మహాయాగం జరుపుతారు.
 
- రాజేంద్ర ప్రసాద్ తాళ్లూరి 
 
 
 
 

Quote of the day

As a single withered tree, if set aflame, causes a whole forest to burn, so does a rascal son destroy a whole family.…

__________Chanakya