సీతకు గురువు హనుమంతుడా?
వేదాంత దేశికుల ప్రకారం హనుమంతుడు సీతకు గురుతుల్యుడు, ఒక వానరం విదేహరాజ కుమార్తెకు గురువు అవ్వడం ఏమిటి? అని కలిగే ప్రశ్నకు దేశికులు ఇలా అన్నారు: గురువు అంటే మనను, భగవంతుని కలిపేవాడు అని అర్థం. హనుమంతుడు కూడా భగవంతుడైన శ్రీరాముని తో సీతమ్మను కలిపాడు కాబట్టి హనుమ సీతకు గురువన్న మాట. దానిని కొనసాగిస్తూ దేశికులు ఇలా సంకల్పసూర్యోదయం అన్న గ్రంథంలో ఇలా అంటున్నారు:
దర్పోదగ్ర దశేంద్రియానన మనోనక్తంచరాధిష్టితే
దేహోస్మిన్ భవ సింధునా పరిగతే దీనం దశామాస్థితిః!
అద్యత్వే హనుమత్ సమేన గురుణా ప్రఖ్యా పితార్థః పుమాన్
లంకారుద్ధ విదేహరాజతనయా న్యాయేన లాలప్యతే!!
"జీవాత్మ శరీరం ధరించి ఉన్నప్పుడు ఎలాగైతే బాధలను అనుభవిస్తూ ఉంటుందో అలాగే సీత లంకపురమున బాధలను అనుభవించింది. శరీరం ఎలాగైతే పది ఇంద్రియముల(ఐదు కర్మ, ఐదు జ్ఞాన ఇంద్రియములు) చేత శాసింపబడునో అదే విధముగా పది తలల రావణుడు లంకను పాలించుచున్నాడు. శరీరము ఏ విధముగా సంసార సాగర మధ్యమున ఉన్నదో అదే విధముగా లంక, సాగర మధ్యమున ఉన్నది. అలాగే, జీవాత్మకు పరమాత్మ గురించి చెప్పి విరహ వేదన తీర్చిన గురువు వలె హనుమంతుడు సీతమ్మకు పరమాత్మ శ్రీరాముని గురించి చెప్పెను." అంటూ సత్యాన్వేషణ, శ్రీమద్రామాయణం ఒక్కటే అని చాటిచెప్పారు.
- రాజేంద్ర ప్రసాద్ తాళ్లూరి