హనుమంతుడు సింధూరం ఎందుకు ధరిస్తాడు
*హనుమంతుడు సింధూరం ఎందుకు ధరిస్తాడు.........!!*
*ప్రత్యేకత ఏమిటి...?*
*పూర్వం శ్రీరామ పట్టాభిషేకం తర్వాత ఒక రోజు సీతమ్మ తలస్నానం చేసి, నుదుటన తిలకం దిద్ది, పాపిటన ‘సింధూరం' పెట్టుకొని, శ్రీరామునితో కలిసి విశ్రాంతి మందిరానికి వెళుతున్న సమయంలో, అప్పటి వరకూ శ్రీరాముని సేవకై వేచి ఉన్న ఆంజనేయుడు వారి వెనుకనే వెళ్ళసాగాడు.*
*ఇది గమనించిన సీతారాములు వెనుకకు తిరిగి చూడగా, సీతాదేవి హనుమంతునితో‘మేము విశ్రాంతి మందిరానికి వెళుతున్నాము, నీవు రాకూడదు, వెళ్ళు హానుమా...తరువాత రావచ్చు' అనెను. రాములవారు కూడా ‘సీతమ్మవారు చెప్పినట్లు చేయుము హనుమా..ఇప్పుడు రావద్దు..'అనెను. అంతట ఆంజనేయుడు ‘రామా! మిమ్ములను సేవించనిదే నాకు కునుకు పట్టదు కదా...మీరును సీతమ్మ చెప్పినట్లే పలికెదరేమి? మీరు స్త్రీ దాసులై పోతిరేమి రామ''అనగా, రాములవారు హనుమంతునితో‘నేను వివాహ సమయమున ఆమె పాపిట చిటికెడు సింధూరం పెట్టితిని. అందుకు కారణంగా ఆమెకు దాసుడనైతిని' అని తెలిపాడు*.
*హనుమంతుడు ఆశ్చర్యంతో ‘అమ్మా! మీ నుదుట తిలకముంది కదా!పాపిటన సింధూరం దేనికి' అని అడిగాడు. అప్పుడు సీతాదేవి‘నాయనా హనుమా! స్వామి వారికి ఇంకా సౌభాగ్యం కలగాలని పాపిటన సింధూరం ధరించానని' చెబుతుంది.*
*వెంటనే హనుమంతుడు అయోధ్యా నగరంలోని అంగడి నందు సింధూరంను తీసుకొని దాని నంతటిని నువ్వుల నూనెతో పలుచగా చేసుకొని తన తలాతోకా అనుకోకుండా పాదాది శిర: పర్యంతము ఎక్కడను సందులేకుండా సింధూరం రాసుకొని వెంటనే సీతారాముల దర్బారుకు పట్టరాని ఆనందంతో వెళ్ళాడు*.
*హనుమంతుని రూపం చూసి అక్కడి వారంతా ముసిముసినవ్వులు నవ్వుతుండగా, శ్రీరామచంద్రుడు చిరునవ్వుతో హనుమను చేరదీసి ‘హనుమా! ఇదేమిటి‘ అని అడగగా, హనుమంతుడు ‘మీరు చిటికెడు సింధూరమును సీతమ్మవారికి అలంకరించుట చేతనే ామెకు వశపడితిరి కదా, చిటికెడు సింధూరంతోనే మీకు సౌభాగ్యం కలిగితే, మరి నేను శరీరం మొత్తం సింధూరం అలంకరించుకున్నాను. మరి మీరు నాకు వశపడేదరా లేదా ప్రభూ! మీకు ఇంకెంత సౌభాగ్యం కలుగుతుందో కాదా" అని ఆనందంతో, సంతోషంతో కేరింతలు కొట్టసాగాడు*.
*హనుమ పలుకులు విన్న శ్రీరాముడు, తన సభలోని వారందరూ వినేలా ‘ఆంజనేయా! నీవంటి భక్తుడు ఈ పద్నాలుగు భువనాల్లోనే కాక మరెక్కడా ఉండడు. నీవు ధరించిన ఈ సింధూరాన్ని తిలకంగా ధరించిన వారికి, మన అనుగ్రహంతో పాటు అపారమైన సిరిసంపదలు, సుఖ సంతోషాలు కలుగుతాయి. అంతే కాక నీవు సీతాన్వేషణ సమయంలో సీత జాడ తెలుసుకొని ఆమెకు గుర్తుగా శిరోమణిని నాకు తెచ్చి ఇచ్చిన మంగళవారం నాడు, నీ జన్మదినమైన శనివారం నాడు ఎవరైతే భక్తీ శ్రద్ధలతో నుదుట ఈ సింధూరం ధరిస్తారో, వారికి ఆయురారోగ్యములు, సుఖ సంపత్తులు సంపూర్ణంగా లభిస్తాయి'అని వరదానం చేశాడు. భక్త జనుల అభీష్టములు తీర్చేవాడు ఆంజనేయస్వామి. అందుకే ఆనాటి నుండి సింధూర ప్రియుడు అయినాడు*.