Online Puja Services

శ్రీవారి జోడు పంచలు

18.119.104.93

శ్రీవారి జోడు పంచలు
- సేకరణ 

ఏడుకొండల వెంకన్న ధరించే ఏరువాడ జోడు పంచెలకు ఇంత విశేషం ఉందా?

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల తిరుపతి (Tirumala Tirupati) శ్రీవెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడమే మహా భాగ్యం.

మహా పుణ్యక్షేత్రంగా కీర్తికెక్కిన తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎన్నో ఆశ్చర్య గొలిపే విశేషాలు దాగున్నాయి. తిరుమలలో ప్రతి ఏటా జరిగే శ్రీవారి బ్రహ్మోత్సవాల (Srivari Brahmotsavala) సందర్భంగా స్వామి వారి మూలావిరాట్టు ధరించే ఏరువాడ జోడు పంచెలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది.

గద్వాల సంస్థానం నుంచి 400 ఏళ్ల సంప్రదాయంగా ఈ ఏరువాడ జోడు పంచెలను స్వామివారికి బహుకరిస్తున్నారు. బ్రహ్మోత్సవాల్లో మొదటి రోజు ద్వజారోహణం సందర్భంగా మూలమూర్తికి ఈ జోడు పంచెలను (Jodu panche) అలంకరిస్తారు.

అప్పటినుంచి ఈ జోడు పంచెలు ఏడాది పొడవున్న మూలవిరాట్టుకు ఉంటాయి. ప్రతి శుక్రవారం వీటిని తీసి శుభ్రం చేసి మళ్లీ స్వామి వారికీ అలంకారం చేస్తారు. బ్రహ్మోత్సవాల ముందు రోజున పాత వస్త్రాలను తొలగించి గద్వాల సంస్థానానికి ప్రసాదంగా పంపించి, తిరిగి కొత్త జోడు పంచెలను అలంకరిస్తారు. ఇది గద్వాల చేసుకున్న పుణ్యఫలం.

400 ఏళ్ల సాంప్రదాయంగా:

నవరాత్రి (Navaratri) బ్రహ్మోత్సవాల ప్రారంభం రోజున తిరుమల శ్రీ వేంకటేశ్వరునికి గద్వాల నేత మగ్గంపై తయారు చేసే ఏరువాడ జోడు పంచెలను అలంకరించిన తర్వాతనే బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. గద్వాల (Gadwal) సంస్థానం నుంచి నవరాత్రి బ్రహ్మోత్సవాల కానుకగా అందే ఏరువాడ జోడు పంచె ఎంతో ప్రాముఖ్యత ఉంది.

400 ఏళ్ల కిందట గద్వాల సంస్థానాదీశులు సాంప్రదాయ బద్దంగా నేత మగ్గాలపై జోడు పంచెలను ఇక్కడి చేనేత కార్మికులచే తయారు చేయించి తిరుమల తిరుపతి దేవస్థానానికి అందజేశారు. ఆనాటి నుంచి ఇది ఆచారంగా కొనసాగిస్తున్నారు. కృష్ణారావు భూపాల్‌తో మొదలైన ఈ సాంప్రదాయం సంస్థానాదిశుల వారసులైన లతా భూపాల్ ప్రస్తుతం కొనసాగిస్తున్నారు.

ప్రతి ఏటా ప్రారంభమయ్యే బ్రహ్మోత్సవాలలో భాగంగా శ్రీవారి మూలవిగ్రహానికి ఏరువాడ జోడు పంచెలు అలంకరించి ప్రత్యేక పూజలు చేసి అనంతరం బ్రహ్మోత్సవాలు ప్రారంభిస్తారు.

శ్రీవారి చెవిలో చెప్పి:

పంచెలు తిరుమల క్షేత్రానికి చేరిన అనంతరం అక్కడ ప్రధాన పూజారులు "స్వామి...! ఏరువాడ జోడు పంచెలు అందాయి. మీ బ్రహ్మోత్సవాల రోజున నూతన పంచెలు అలంకరణ చేస్తాం" అంటూ శ్రీవారి చెవిలో చెప్పి జోడు పంచెలను భద్రపరుస్తారు. ఏరువాడ జోడు పంచెలను తయారు చేసేందుకు మండలం 45 రోజుల కాలం పడుతుంది.

నామాల మగ్గంపై నేత పనిని ప్రారంభించి, ముగ్గురు నేత కార్మికులు సాంప్రదాయ బద్దంగా నేస్తారు. మరో ఇద్దరు సహకారం అందించారు. ప్రస్తుతం ఈ జోడు పంచెలు నేసిన వారిలో భాగ్యం రమేష్, సాకి సత్యం, లక్ష్మణ్, షణ్ముఖరావు, గద్దె మురళి ఉన్నారు. మగ్గం నేసేటప్పుడు ఏ ఒక్కరు తప్పు చేసినా పని ముందుకు సాగదు.

దైనందిన జీవితంలో తెలిసీతెలియక తప్పులు దొర్లితే మగ్గం దగ్గరికి వచ్చే సమయానికి ఆ విషయం తమకు పరోక్షంగా ప్రభావం చూపిస్తుందని నేతన్నలు చెబుతున్నారు.

జోడు పంచెలు తయారు మొదలు వాటిని తిరుమలలో అధికారులకు అందించేంత వరకు మగ్గం ఉన్నచోట ఇంట్లో నిత్యం పూజలు చేయడం, గోవిందా నామస్మరణం చేసుకుంటూ పనికి ఉపక్రమించడం వీరి నిత్యకృత్యం. గద్వాల సంస్థానాదిశుల తరుపున గత పది ఏళ్లుగా ఏరువాడ పంచెలను ప్రముఖ వ్యాపారి మహంకాళి కరుణాకర్ ఆధ్వర్యంలో నేస్తున్నారు.

ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉపవాసంతో ఈ పంచెలను నేతన్నలు నేస్తారు. శ్రావణమాసంలో పంచెల తయారీ ప్రారంభించి నెల రోజులకు పూర్తి చేశారు.

శ్రీవారికి ఇష్టమైన ఏరువాడ జోడు పంచలు;

దేశం నలుమూలల నుంచి శ్రీవారికి కానుకగా పట్టు వస్త్రాలను సమర్పిస్తారు. వాటిని కేవలం అలంకార ప్రాయంగా మాత్రమే వేడుకలలో శ్రీవారి ఉత్సవ విగ్రహాలకు అలంకరిస్తారు. గద్వాల చేనేత కార్మికులు తయారు చేసిన శ్రీవారి ఏరువాడ జోడు పంచెలు మాత్రం శ్రీవారి మూలవిగ్రహానికి అలంకరించే ఉంచడం విశేషం.

11 గజాల పొడవు, 85 అంగుళాల వెడల్పు, ఇరువైపుల 12 అంగుళాల కంచుకోట కొమ్మునగిషీలతో ఏకకాలంలో ముగ్గురు ఒకేసారి నేయడం జోడు పంచెల తయారీలో దాగి ఉన్న సాంకేతిక పరమైన అంశం. సాంకేతికంగా నేత పనిలో ఎన్నో విప్లవాత్మకమైన మార్పులు వచ్చినా అనాదిగా నూలు రేషన్ కలయికలతో జోడు పంచెలను సాంప్రదాయ బద్దంగా తయారు చేస్తున్నారు.

ఇంతటి ప్రాధాన్యత సంతరించుకున్న ఈ ఏరువాడ జోరు పంచెలు నేసే విధానం చూడడానికి వెళ్లాలంటే శుచీశుభ్రతను పాటించాల్సిందే. ఇక్కడి నుంచి జోడు పంచెలు అందజేయడం గద్వాల ఖ్యాతిని ఎంతో ఇనుమడింప చేస్తుందని జోడు పంచెల తయారీని పర్యవేక్షిస్తున్న మహంకాళి కరుణాకర్ తెలిపారు.

ఏడుకొండల వెంకన్నకు పంచెలు నేయడం తమ అదృష్టమని నేతన్నలు గద్దె మురళి, రమేష్, సత్యంలు చెప్తున్నారు. ఏడాది పొడవునా మూలమూర్తికి ఈ జోడు పంచెలు అలంకరణ చేస్తారు.

Quote of the day

Our duty is to encourage everyone in his struggle to live up to his own highest idea, and strive at the same time to make the ideal as near as possible to the Truth.…

__________Swamy Vivekananda