Online Puja Services

గోవిందా అని ఒక్కసారి పలికితే చాలు! పలుకుతాడు .

3.144.114.8

గోవిందా అని ఒక్కసారి పలికితే చాలు! పలుకుతాడు . 
- లక్ష్మి రమణ 

గోవిందా గోవింద! అని తిరుమల వెళ్లే ప్రతి భక్తుడూ నినదిస్తూ ఉంటారు .  ఆ ఆపద మొక్కులవాడిని ఆయన భక్తులు ఎక్కువగా తలుచుకునేది ఈ నామం తోటే ! ఈ నామంతో తలుచుకుంటే, పిలుచుకుంటే ఆ స్వామి కూడా బిరబిరా కదిలి వస్తారట ! ఏడుకొండలూ దిగివస్తారట ! గోవిందుడు అంటే గోపాలకుడా ? ఎందుకా నామం అంటే ఆ దేవదేవునికి అంతటి ప్రీతి ? కలియుగప్రత్యక్షదైవమైన వేంకటేశుని ఈ నామవిశేషత ఒక్కటి చాలు, పరమాత్మ ప్రేమ ఎలాటిది అని తెలుసుకోవడానికి . 

గోవిందాశ్రిత గోకులబౄందా
పావన జయజయ పరమానంద

ఆయనని ఆశ్రయించిన గోవులన్నింటినీ కాపాడే వాడు , గోపాలుడు పోషించినట్టు వాటిని పోషించేవాడు గోవిందుడు. గోవులు అంటే ఇక్కడ ఆవులు అని మాత్రమే అర్థం కాదు . ఇందులో గొప్ప అంతరార్థమే దాగి ఉంది .  

గోపతయే నమః అని హయగ్రీవస్తోత్రనామావళిలోని నామము . అలాగే సూర్య సహస్రనామావళి , అయ్యప్ప సహస్రనామావళి , శ్రీ గణేశ సహస్రనామావళిలో కూడా ఉంటుంది .  వెంకన్నస్వామిని గోపాలకా అంటే, ఆయన కృష్ణావతారంలో గోవుల్ని కాచినవాడు కనుక అలా అన్నారని అనుకోవచ్చు . మరి సూర్యుణ్ణి, అయ్యప్పని, విగ్నేశ్వరున్ని గోపతులు అనడంలోని అర్థం ఏమిటి ?

గోవులనే శబ్దానికి కిరణాలు అనే అర్థం ఉంది. ఈ కిరణాలు ఎవరినుండీ వస్తాయి ? సూర్యుని నుండే కదా ! ఆ సూర్యుడు తన కిరణాల చేత జీవులని పోషిస్తూ ఉంటాడు. సప్తాశ్వములూ ఆయన కిరణములే. ఆ  జీవి మనుగడ అనేదే లేదు . ఆయన ఎటువంటి వారు ? సర్వత్రా వ్యాపించినవారు. వ్యాపించినవానికి ఏమనిపేరు అంటే వ్యాపించినవాడు విష్ణువు అంటుంది మన వేదం . అంతేనా , పోషించేవాడు విష్ణువు అని కూడా చెబుతుంది .  అంటే విష్ణువు ఎవరు సాక్షాత్తూ సూర్యభగవానుడే! ఆయనే కలియుగ దైవమైన వేంకటేశ్వరుడు . ఆయన సప్తాశ్వాలే ఇక్కడున్న సప్తగిరులు . ఇది గొప్ప రహస్యం . 

 నారాయణుని స్వరూపాలే విఘ్నేశ్వరుడు, అదేవిధంగా ఆయ్యప్ప స్వామీ అందువల్ల వారిద్దరూ కూడా గోపతులయ్యారు.  ఇక్కడ ఇప్పుడు మనం గో శబ్దానికి సరైన అర్థాన్ని చెప్పుకుంటే - గోవులు అంటే, సమస్త విశ్వంలోని జీవులు అని అర్థం అవుతుంది . అంతేకాదు వేదము అని అర్థం కూడా ఉంది . వేదమే తానైన రూపము జ్ఞాస్వరూపుడైన హయగ్రీవుడు.  ఆ జీవులని జ్ఞానముచేత, ఆహారముచేత పోషించే, నారాయణుడు గోపతి, గోవిందుడు.  అందువల్ల ఆయనకీ ఆ నామము అత్యంత ఇష్టమైనదయ్యయింది . 

గోవిందా ! అని పిలుస్తే, ఆయన సమస్తవిశ్వంలోని అణువు అణువు నుండీ  ‘ఓయ్’ అని పలుకుతాడు .  ఆ పిలిచే హృదయం , భక్తి అనే రెండు వస్తువులూ మనదగ్గర ఉంటె చాలు . దీని గురించి ఒక చిన్న కథని కూడా మన పెద్దలు చెబుతూ ఉంటారు . గోవిందుని ఈ నామాన్ని అర్థం చేసూకోవడానికి ఈ కథ మరింత గొప్పగా తోడ్పడుతుంది . 

ఒకనాడు ఏడుకొండలవెంకన్న, స్వయంగా కొండలన్నీ దిగివచ్చి , అగస్త్యముని ఆశ్రమానికి వేంచేశారు . “ ఓ మునీంద్రా  నన్ను శ్రీనివాసుడు అంటారు . నీదగ్గర చాలా గోవులున్నాయని విని వచ్చాను . నాకు వాటిలో ఒక్క గోవుని ఇవ్వగలవా ?” అని అభ్యర్ధించారు . 

అగస్త్య మునీ “ వేదాల ప్రకారం సహచారినిఉంటే గాని గోవుని  ఇవ్వకూడదు. కాబట్టి స్వామి మీరు సతీమణితో మరోసారి రాగలరు” అని చెబుతారు . ఆ తర్వాత పద్మావతీ సమేతుడై శ్రీనివాసుడు మరోసారి మున్యాశ్రమానికి విచ్చేస్తారు . అప్పుడు అగస్త్యుడు ఆశ్రమంలో ఉండరు. అక్కడున్న శిష్యులు ఆయనకీ గురువాజ్ఞ లేదని గోవునియ్యరు .  

దాంతో స్వామి వారు ఆగ్రహించి, తిరుమల కొండ వైపు గబగబా నడుచుకుంటూ వెళుతుంటారు . అంతలో ఆశ్రమానికి తిరిగి వచ్చిన అగస్త్యులు జరిగినదంతా తెలుసుకొని , ఒక గోవును, కొంతమంది శిష్యులనీ వెంటపెట్టుకొని శ్రీనివాస స్వామి వైపు పరిగెడతారు.  స్వామివారు కనుచూపు దూరంలోకి రాగానే, "గో ఇంద"గట్టిగా అరవ సాగారు.  స్వామి వినిపించుకోకుండా అలా వెళుతూ ఉండడం, అగస్త్యునితో కలిసి  శిష్యులందరూ మరింత గట్టిగా  స్వామి గో ఇంద గో ఇంద అని అరవడం !! 

గో ఇంద  అంటే ఆవు ఇంద అంటే తీసువయ్యా అని !  అలా శిష్యులందరూ గో ఇంద గో ఇంద గోవింద గోవింద అంటూ పిలుస్తూ గట్టిగా అరుస్తూ స్వామి వారిని వెంబడిస్తుండగా ఆయన  అదృశ్యం అవుతారు. ఆ పిలుపు కోసమే స్వామీ ఆంత కష్టమూ పడ్డారని పెద్దలు చెబుతారు . 

 స్వామివారికి గోవిందా అనే పిలుపు ఎంత ఇష్టం కాకపోతే భక్తుల దగ్గరికి గోవిందా అని పిలిపించుకోవడానికి స్వామి వారే కొండ దిగి వస్తారు!  గోవులేకాదు జీవులన్నీ ఆయనకీ గోవులే ! ఆహారాన్నిచ్చేవాడు, ఆ ఆహారం కోసం మాయామోహాల్లో చిక్కుకొని అహంకారాన్ని పొందకుండా రక్షించేవాడు , జ్ఞానాన్ని అనుగ్రహించేవాడు ఆ గోవిందుడు ! గోవింద నామం అంత గొప్పది . అందుకే మనసునిండా ఆ కల్యాణవెంకటేశుని దివ్యమంగళ నామాన్ని స్మరిస్తూ ఒక్కసారి పలుకుదాం .. 

 గోవిందా గోవింద!!

సర్వేజనా శుఖినోభవంతు !!

Quote of the day

The weak can never forgive. Forgiveness is the attribute of the strong.…

__________Mahatma Gandhi