‘గోవింద’ నామ మహిమ ఎలాంటిది ?

‘గోవింద’ నామ మహిమ ఎలాంటిది ?
- లక్ష్మి రమణ
భజ గోవిందం భజ గోవిందం
గోవిందం భజ మూఢమతే !
అంటారు శంకరాచార్యులవారు . మృత్యువు ఆసన్నమైనప్పుడు నిన్ను రక్షించేది , నీకు శాశ్వతమైన సంతోషాన్నిచ్చేది , నీతో వచ్చేది నువ్వు చేసిన గోవింద నామ స్మరణ ప్రభావం మాత్రమే అంటారాయన ! అందువల్ల ఆ నామాన్ని నిరంతరాయంగా స్మరించమని మూఢమైన మనసుని ఆదేశిస్తారు . అంతగా ఆ గోవింద అనే నామంలో దాగున్న మహిమ ఎటువంటిది ?
నామము భవసాగరాన్ని దాటించే నావ వంటిది. నామాన్ని నిరంతరం స్మరిస్తుంటే, అది ధ్యానమై అనంతరం దైవానుగ్రహాన్ని అందిస్తుంది . సంసారం అనే సాగరాన్ని దాటించే చుక్కాని అవుతుంది . మనసు మరో ఆలోచన లేకుండా భగవంతుని మీదే నిలవడం నిలపడం చాలా కష్టం . అది సాధించినవారు యోగి ! అందుకే ముందర మనసుకి స్మరణ అలవాటు చేయాలి . నెమ్మదిగా ఆ నామ సగుణ స్వరూపం నుండీ నిర్గుణ పరబ్రహ్మలో మనసు తాదాత్మ్యం పొందుతుంది . అటువంటి శ్రీహరి నామాలలో ‘గోవింద’ అనే నామం ఒకటి .
తెలుగువారికి గోవిందుడంటే వేంకటేశ్వరస్వామే! ఆ స్వామిని ఆరాధించే వారందరూ గోవిందా గోవిందా అని ఆ కలియుగదైవాన్ని స్మరిస్తుంటారు . తిరుమల లోని శ్రీవారి సన్నిధి నిరంతర గోవింద నామ స్మరణతో మారుమ్రోగుతూ ఉంటుంది . ఇంతకీ ఈ నామం హరి అవతారమైన కృష్ణ స్వామిది . ఆ నామానికి విస్తృతమైన అర్థం ఉంది .
ఇంద్రుని గ్గర్వాన్ని అణిచి, చిటికిన వేలుపైన గోవర్థన గిరిని నిలిపి గోకులాన్ని కాపాడిన నల్లనయ్య కథ అందరికీ తెలిసినదే ! ఈ సంఘటనతో గర్వం తొలగిపోయి, కృష్ణుడే పరమాత్మ అనే జ్ఞానం కలిగింది ఇంద్రుడికి. స్వయంగా శ్రీకృష్ణుని దర్శించుకుని, క్షమాపణలు వేడుకునేందుకు గోకులానికి వచ్చాడు . అదే సమయంలో తన బిడ్డలైన గోవులన్నింటినీ రక్షించిన కృష్ణుని పట్ల కృతజ్ఞతగా, ఆయనను దర్శించి తన క్షీరాలతో కృష్ణుని అభిషేకిస్తుంది గోమాత కామధేనువు. ఆ దృశ్యాన్ని చూసి పరవశించిపోయిన ఇంద్రుడు తన వాహనమైన ఐరావతాన్ని కూడా గంగాజలంతో కృష్ణుని అభిషేకించవలసిందిగా ఆజ్ఞాపిస్తాడు.
భూమిమీద ఉన్న జీవులన్నింటికీ అధిపతి అయిన పరమాత్ముని స్వరూపాన్ని చూసి, పులకించి పోయారు . స్వామీ మీరు అనుగ్రహించిన ఈ దివ్య రూపంలో గోవిందుడనే నామంతో పూజింపబడతారు. అని చెబుతారు . నిజానికి గోవులు అంటే జీవులు అని అర్థం . ఆ విధంగా జీవుల్లన్నింటికీ ఇంద్రుడు (పరిపాలకుడు / అధిపతి) గా గోవిందుడు అనే నామాన్ని పొందారు పరమాత్మ .
విష్ణు సహస్రనామంలో
మహేష్వాసో మహీభర్తా శ్రీనివాసః సతాం గతిః |
అనిరుద్ధః సురానందో గోవిందో గోవిదాం పతిః
అన్న శ్లోకం కనిపిస్తుంది. ఇందులో గోవింద అనే నామాన్ని వివరిస్తూ పెద్దలు గో అనే శబ్దానికి గోవులు, భూమి, వాక్కు, వేదాలు అనే అర్థాలు ఉన్నాయని చెబుతారు. అంటే యోగులు విష్ణుపరమాత్మను ఈ లోకానికీ, ఆ లోకం మీద ఉండే జీవులకూ ప్రాణాధారంగా భావిస్తున్నారని తెలుస్తోంది. ప్రేమ పురుషుని ఈ విధంగా గోవిందా నామంతో స్మరిస్తే, ముక్తి ప్రాప్తిస్తుంది .
శుభం .
#govinda #bhajagovindam #venkateswaraswami
Tags: govinda, bhajagovindam, venkateswara swami,