Online Puja Services

తొండమానుడు కట్టించిన ఆలయమే తిరుమల ఆనంద నిలయం !!

3.144.106.207

తొండమానుడు కట్టించిన ఆలయమే తిరుమల ఆనంద నిలయం !!
- లక్ష్మి రమణ 

‘కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు … ‘ అని కొండలంత వరాలిచ్చి అనుగ్రహించే శ్రీ వేంకటేశ్వరుని గురించి ప్రతి భక్తుడూ పాడుకుంటూ ఉంటారు. ఈ కీర్తన ఆ స్వామికి మహా భక్తుడైన అమ్మమాచార్యులవారు రాసింది . ఇందులో ఆయన ఇంకా ఇలా అంటారు . “దొమ్ములు సేసిన యట్టి తొండమాన్ చక్రవర్తి రమ్మన్న చోటికి నమ్మిన వాడు” అని.  ఇంతకీ తొండమానుడు ఎవరు ? యేమాతని కథా కమామిషు ? అంటే భవిష్యోత్తర పురాణం ఇలా చెబుతుంది . తొండమానుడు  స్వామి ఆజ్ఞపై తిరుమల భవ్య మందిర నిర్మాణము చేయించిన ధన్యజీవి. బ్రహ్మాది దేవతలు నిత్యం వచ్చి శ్రీవేంకటపతిని సేవించుకునేది తొండమానుడు కట్టించిన ఆలయంలోనే. తొండమానుడు ఎంతటి భక్తుడంటే నిత్యము స్వామితో సంభషణలు చేసేవాడు! ఆ తొండమానుడు ఆనందానిలయాన్ని కట్టించే భాగ్యాన్ని ఎలా పొందాడు ? 

కలియుగ ప్రత్యక్ష దేవుడైన శ్రీ వేంకటనాథునికి, అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకి అయిన పద్మావతీ దేవిని కన్యాదానమిచ్చిన మహానుభావుడు తొండమండలాధీశుడైన ఆకాశరాజు. తొండమానుడు ఆకాశరాజు సోదరుడు. ప్రస్తుతం కాంచీపురంగా పిలువబడే ఒకప్పటి తొండై మండలం సామ్రాజ్యానికి అధిపతి. అన్నింటికీ మించి అమిత శ్రీనివాస భక్తుడు.

"వేంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన
వేంకటేశ సమోదేవో న భూతో న భవిష్యతి" 

అన్నది జగమెరిగిన సత్యం. ఆ వెంకటాద్రి సంస్థానాన్ని అంతటి వైభవోపేతముగా  కట్టించినవాడు తొండమాన చక్కురవర్తి.  అయితే, అటువంటి భవ్య నిర్మాణానికి కూడా వెనుక నటనసూత్రధారి పాత్ర లేకపోలేదు. ఆయన  ఆజ్ఞలేకుండా అంతటి బృహత్తర కార్యం ఎలా నెరవేరగలదు మరి !! 

ఒకరోజు తొండమానుడు మంచి నిద్రలో ఉండగా ఓ మధుర స్వప్నాన్ని కన్నాడు. ఆ కలలో విష్ణుమూర్తి కనిపించి ఇలా చెప్పారు. ''భక్తా! పూర్వజన్మలో నీ పేరు రంగదాసు. నీకు స్త్రీ వ్యామోహం లేకుండా చేసి, నిన్ను మహారాజుగా చేశాను. (ఆ కథ  మరో సారి చెప్పుకుందాం )  క్రమంగా మన మధ్య బాంధవ్యం పెరిగింది. అనుబంధం పెనవేసుకుంది. ప్రస్తుతం నేను వేంకటేశ్వరునిగా భువికి వచ్చాను కదా ! కలియుగాంతం వరకూ శ్రీనివాసుడనై  శేషాచలము పైన  స్థిర నివాసం ఏర్పరచుకో దలచాను. కాబట్టి  నువ్వు నా కోసం ఒక ఆలయాన్ని నిర్మించాలి. శ్రీ వరాహస్వామి వారు, పుష్కరిణి పక్కన నా ఆలయ నిర్మాణం కోసం, స్థలం కేటాయించారు . కాబట్టి,  అక్కడ నువ్వు వెంటనే ఆలయాన్ని కట్టించు..'' అని ఆదేశించారు .

స్వామితో తానూ స్వయంగా సంభాషిస్తాడు. అయినా, ఆయన ఇచ్చిన ఈ స్వప్న దర్శనం,  అద్భుతంగా అనిపించింది . స్వామిని అడిగితె, నేను నిజముగానే ఆవిషయం నీకు చెప్పాను అన్నారు . ఇక  ఆ భక్తుని ఆనందం అవర్ణమైపోయింది.  తొండమానుడు  అప్పటికప్పుడే అందుకు సన్నద్ధమయ్యారు. 

వేంకటేశ్వరుడు తనకి అప్పజెప్పిన బృహత్తర బాధ్యతను అమలుచేసే పనికి పూనుకున్నారు . ఆప్తులతో చర్చించారు, ప్రణాళిక రచించారు. వెంటనే దేవశిల్పి విశ్వకర్మను రప్పించారు. మంచి ముహూర్తం చూసి, ఆలయ నిర్మాణం కోసం పునాదులు వేయించారు. కేవలం దేవాలయం, గర్భగుడి, ధ్వజ స్థంభంతో సరిపెట్టకుండా, బ్రహ్మాండంగా కట్టించాలని అనుకున్నారు. తొండమానుడు అనుకున్నట్టుగానే, అనతి కాలంలోనే దేవాలయ నిర్మాణం పూర్తయింది. విశాలమైన పాకశాల, సువిశాలమైన గోశాల, గజ శాల, అశ్వ శాల, బంగారు బావి, మంటపాలు, ప్రాకారం, గోపురం - ఇలా అనేక గదులతో ఆలయం బహు గొప్పగా రూపొందింది.

ఆలయం అపురూపంగా ఉంటే సరిపోతుందా? గుడిని చేరడానికి మార్గం సుగమంగా ఉండాలి కదా! అందు కోసం, కొందరు భక్తులు శేషాచలం చేరడానికి రెండు వైపులా దారులు ఏర్పరచారు. సోపానాలు నిర్మించారు. మార్గ మధ్యంలో, అక్కడక్కడా మండపాదులు నిర్మించారు.

ఆలయ నిర్మాణం, గుడికి వెళ్ళే రహదారి, సోపానాలూ పూర్తయిన తర్వాత, విషయాన్ని వేంకటేశ్వరునికి తెలియజేశాడు తొండమానుడు. వేంకటేశ్వర స్వామి  ఈ వర్తమానాన్ని సవివరంగా ముల్లోకములకు తెలియ పరిచారు. అప్పుడు బ్రహ్మ, మహేశ్వరుడు, ఇతర దేవతలు అందరూ కలసి, శేషాచలం చేరుకున్నారు. శుభ ముహూర్తం చూసి, వేంకటేశ్వరుడు పద్మావతీ సమేతుడై, ఆలయము ‘ఆనంద నిలయం’లోకి ప్రవేశించారు. అది అద్భుతమైన, అపురూపమైన వేడుక. అత్యంత కమనీయంగా, రమణీయంగా జరిగింది. ఆ వేడుకను చూడటానికి, రెండు కళ్ళూ చాలవు. వర్ణించడానికి భావాలూ, వాటిని వ్యక్తీకరించడానికి అక్షరాలూ సరిపోవు. 

వేంకటేశ్వరుడు ఆలయంలోకి ప్రవేశించే సమయంలో, దేవతలు పూవులు జల్లారు. తొండమానుడు అతిధులకు పంచ భక్ష్య పరమాన్నాలతో విందు భోజనం ఏర్పాటుజేశారు. దక్షిణ, తాంబూలాదులు ఇచ్చారు. వస్త్రాలూ, ఆభరణాలూ సమర్పించారు. ఆ విధంగా దేవతలందరినీ సగౌరవంగా సత్కరించి పంపారు.

తిరుమల వేంకటేశ్వరుని ఆలయ వివరాలు పురాణాల్లో ఈ విధంగా ఉన్నాయి. మొత్తానికి తొండమానుడు కట్టించిన దేవాలయాన్ని, చోళులు అభివృద్ధి చేశారు. తర్వాత పల్లవ రాజులు, తంజావూరు చోళులు, విజయ నగర రాజులూ, దేవాలయాన్ని మరింత తీర్చిదిద్దారు. ఆ ఆనంద నిలయం లోనే ఈరోజుకి మనం కలియుగ ప్రత్యక్షదైవాన్ని దర్శించుకొని , తరిస్తున్నాం . 

నమో వెంకటేశాయ !!

#venkateswaraswamy #tondamanudu #anandanilayam #tirumala

Tags: venkateswara swamy, tondamanudu, ananda nilayam, tirumala

Quote of the day

The weak can never forgive. Forgiveness is the attribute of the strong.…

__________Mahatma Gandhi