తిరుమల వెంకటేశ్వరస్వామిని అర్చామూర్తి అని ఎందుకంటారు?

తిరుమల వెంకటేశ్వరస్వామిని అర్చామూర్తి అని ఎందుకంటారు?
- లక్ష్మి రమణ
వేంకటేశ్వరుడు కలియుగ దైవం . దక్షిణ భారత దేశంలో, అందులోనూ తెలుగు నేలమీద ఈ దివ్యమూర్తి వెలసి ఉండడం మన తెలుగు వారి అదృష్టమని చెప్పాలి . అడుగడుగు దండాల వాడు, ఆపద మొక్కుల వాడని ఈ ఏడేడు లోకాల నాయకున్ని విశ్వమంతా ఆరాధిస్తుంది . వైష్ణవ రూపుడైన అటువంటి స్వామి విశిష్టాద్వైతానుసారం ఐదు రూపాలు ధరించి ఈ విశ్వపాలన చేస్తుంటారు. తిరుపతిలో మనందర్శించుకొననే వెంకన్నని అర్చామూర్తి అంటారట . ఎందుకలా అంటారో ,ఆ విశేషాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం .
విశిష్టాద్వైత సిద్ధాంతం ప్రకారం నారాయణుడు ఐదు స్వరూపాలతో భాసిస్తున్నారు. అవే పర, వ్యూహ, విభవ, అంతర్యామి, అర్చ అవతారం.
పరస్వరూపం :
పరము అనగానే అది భూలోకములో ఉన్న స్వామి కాదనేది స్పష్టం . ఈయన శుద్ధసత్వ స్వరూపంతో, అద్భుత తేజస్సుతో భాసించే వైకుంఠ వాసుడు. భూదేవి శ్రీదేవి సమేత విష్ణుస్వరూపం. నిత్య ముక్తులకే ఈ స్వామి దర్శనం అవుతుంది.
వ్యూహ స్వరూపం:
జగత్ సృష్టికి మూల కారణమైన స్వరూపం. ఈ స్వరూపం నాలుగు స్వరూపాలతో ఉంటుంది. వారే వాసుదేవ, అనిరుద్ధ, ప్రద్యుమ్న, సంకర్షణ రూపాలు . ఈ వ్యూహాలతో సృష్టి స్థితి లయాలను నిర్వహిస్తూంటారు పరమాత్మ. వీరిలో వాసుదేవుడు క్షీరసాగర శయనుడైన మూలమూర్తి. అనిరుద్ధుడు సృష్టికారకమైన చైతన్య స్వరూపం . ప్రద్యుమ్నుడు ఆ సృష్టిని సంరక్షించే, పోషించే స్థితి శక్తి. సంకర్షణ రూపం లయకారకం. ఇక్కడ సృష్టి స్థితి లయాలని నిర్దేశించే బాస్ వాసుదేవుడయితే, అనిరుద్ధుడు బ్రహ్మ ప్రకాశమై సృష్టిని, విష్ణు తేజమై అనిరుద్ధుడు స్థితి కార్యాన్ని, రుద్ర స్వరూపమై సంకర్షణుడు లయాన్ని నిర్వహిస్తారన్నమాట .
విభవ :
తేజం విష్ణువు విభవ స్వరూపం. అంటే, ధర్మ సంరక్షణర్థం లీలగా అవతరించే నారాయణడు. అప్రాకృత దివ్య మంగళ స్వరూపంతో, లీలా విభూదితో ఇలకు దిగిన శ్రీరామ, శ్రీకృష్ణాదులు హరి విభవ స్వరూపులుగా చెప్పుకోవాలి.
అంతర్యామి:
ఈయనే అణువూ అణువున నిండిన దేవుడు. ప్రతి జీవిలోనూ, సృష్టి ప్రతి అణువులోనూ నిండి ఉన్న పరమాత్మ. జీవుల హృదయాలలో భాసించే దివ్యస్వరూపుడు. అందరి వృద్ధులకు కారకమై, సత్కర్మ అనుష్ఠానాలకు అనుగ్రహించే స్వరూపమే అంతర్యామి.
అర్చవతారం:
మనం చేసే పూజాన్ని గైకొని, మనలని అనుగ్రహించేందుకు విచ్చేసి వివిధ క్షేత్రాలలో కొలువైన స్వామి. తిరుమలలోని శ్రీ వేంకటేశ్వరుడు, శ్రీరంగంలోని రంగనాధుడు తదితర అర్చా స్వరూపాలు ఈ కోవలోకే వస్తారు .
అందుకనే కోనేటి రాయని, కొలుపులు అందుకొనే అర్చామూర్తిగా వ్యాహరిస్తారు . వ్యవహారికం ఏదైనా, ఆయన మనకి కొంగుబంగారంగా వ్యవహరించడమేగా మనకి కావలసింది . కొండలరాయడికి కొలుపులు చేసేవారన్నా, కోటిదండాలు పెట్టి మొక్కేవారన్నా, కల్యాణాలు సమర్పించుకొని ,కనులారా దర్శించేవారన్నా బహు ప్రీతి ! బోలెడంత కరుణ కూడా ! అందుకే ఆ ఏడుకొండలవాడికి అడుగడుగు దండాలని అనంతంగా అర్పిస్తూ శలవు !
#venkateswaraswamy #tirumala